ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా (IMI) శ్రీసిటీలో తన పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సోమవారం పరిశ్రమ ఆవరణలో వేడుకను నిర్వహించింది. ఈ వేడుకల్లో సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పదేళ్లలో సంస్థ లక్షకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయడంతో పాటు, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతుల కేంద్రంగా ఎదిగింది. ఈ కార్యక్రమానికి ఇసుజు గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ నవోహిరో యమగుచి, మిత్సుబిషి కార్పొరేషన్ మొబిలిటీ గ్రూప్ సీఈఓ షిగేరు వకబయాషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇసుజు మోటార్స్ పదేళ్ల ప్రగతిపై డాక్టర్ యువరాజ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం, అనువైన పెట్టుబడుల విధానాలు సంస్థ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. తయారీ రంగం, ఎగుమతులు, ఉపాధి కల్పనలో ఇసుజు గణనీయమైన పాత్ర పోషించిందని తెలిపారు. సంస్థ మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఇసుజు మోటార్స్ పదేళ్ల విజయవంతమైన ప్రస్థానం పట్ల అభినందనలు తెలిపారు. 2013లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్న రోజు నుంచి సంస్థ అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షించడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ ఇసుజు సాధించిన ప్రగతి, శ్రీసిటీలో అందుబాటులో ఉన్న పటిష్ఠమైన పారిశ్రామిక వ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపారానుకూల వాతావరణం, పెట్టుబడిదారులకు సత్వర సహకారం అందిస్తూ ఇసుజు వంటి అంతర్జాతీయ సంస్థల అభివృద్ధికి శ్రీసిటీ నిరంతరం తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇసుజు గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ నవోహిరో యమగుచి మాట్లాడుతూ, సంస్థ విజయానికి ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారులు, ఇతర భాగస్వాముల కృషి కీలకమని అన్నారు. శ్రీసిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలోనూ సంస్థ వృద్ధిని వేగవంతం చేయడమే భవిష్యత్తు లక్ష్యమని పేర్కొన్నారు. ఇసుజు ఇండియా ఛైర్మన్ కెంజిరో హొమ్మసన్ పరిశ్రమ ప్రగతి, పదేండ్లలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.
కాగా, గత పదేళ్లలో శ్రీసిటీ ప్లాంట్లో సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టగా, లక్షకు పైగా వాహనాలను ఉత్పత్తి చేసింది. సుమారు 1,600 మందికి ఉపాధి కల్పించింది. ఆసియా మరియు మధ్యప్రాచ్య దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో తనదైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో 20,000కు పైగా వాణిజ్య వాహనాలను ఎగుమతి చేసి, భారత్ వాణిజ్య వాహనాల ఎగుమతుల్లో అగ్రస్థానాన్ని సాధించింది.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్