ప్రభుత్వ భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
స్టార్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యుల డిమాండ్
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 31 . (పున్నమి ప్రతినిధి )
కొత్తవలస: ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్టార్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు కోరారు.
గతంలో ప్రభుత్వ భూముల కబ్జాలను అడ్డుకోవడంలో ముందుండిన అసోసియేషన్‌లోని కొంతమంది సభ్యులే ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారిందని మిగతా సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల్లోకి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి, స్థలాలను మట్టితో నింపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు.
ప్రభుత్వానికి చెందిన భూములు, స్థలాలు ప్రజా ఆస్తులని, వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం చట్టవిరుద్ధమని సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నా, ఇతర వ్యక్తులైనా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, ఆక్రమణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలాలను మట్టితో నింపేందుకు ఉపయోగించిన ట్రాక్టర్లు, మట్టి తరలింపు, ఆక్రమణకు సంబంధించిన అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో మీడియా, జర్నలిస్టులు ముందుండాలని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని స్టార్ జర్నలిస్టు అసోసియేషన్‌లోని మిగతా సభ్యులు స్పష్టం చేశారు.

