Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం

వార్త ముఖ్యాంశాలు

  • – అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న వైనం – ప్రచారంలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థి రూప్‌కుమార్ – ఆరు అడుగుల వెనుకలో వైసీపీ అభ్యర్థి ఆనం ఈ నెల 28న జరిగే నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు…
  • కూటమి మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న పొలుబోయిన రూప్‌కుమార్ ప్రచారంలో ఇప్పటికే దూకుడు పెంచారు.
  • ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రచారంలో ఆరు అడుగులు వెనుక ఉన్నట్లు తెలియవస్తోంది.

– అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న వైనం
– ప్రచారంలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థి రూప్‌కుమార్
– ఆరు అడుగుల వెనుకలో వైసీపీ అభ్యర్థి ఆనం
ఈ నెల 28న జరిగే నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న పొలుబోయిన రూప్‌కుమార్ ప్రచారంలో ఇప్పటికే దూకుడు పెంచారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రచారంలో ఆరు అడుగులు వెనుక ఉన్నట్లు తెలియవస్తోంది. అయితే, ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ విషయం మాత్రం దడ పుట్టిస్తోంది. ఇరువురు అభ్యర్థులకు వారి వారి బలాలు, బలహీనతలు ఉండగా, ఏ బలహీనత తమ కొంప ముంచుతుందోనని వారు మనసుల్లో మథనపడుతున్నట్లు తెలియవస్తోంది.
అయితే, పరిశీలనలు ఇంకా పూర్తి కాకమునుపే, 72 డివిజన్లలో అభ్యర్థులు ఖరారు కాకముందే రూప్‌కుమార్ యాదవ్ ప్రచారంలో తన దూకుడు పెంచారు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా నగరాన్ని చుట్టేస్తూ, ముఖ్య నేతలను స్వయంగా కలిసి మద్దతు కూడగడుతున్నారు. మరికొంతమందికి స్వయంగా ఫోన్లు చేసి వారి మద్దతును అభ్యర్థిస్తున్నారు. అలకలు తీరుస్తూ, బుజ్జగింపులు చేస్తూ, ఆగ్రహావేశాలను చల్లారుస్తూ రూప్‌కుమార్ తనదైన శైలిలో దూసుకుపోతుండగా, వైసీపీ అభ్యర్థి విజయకుమార్‌రెడ్డి పరిశీలనల అనంతరం ప్రచార పర్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలియవస్తోంది. అయితే, విజయకుమార్‌రెడ్డి కూడా తనకు మద్దతు కోరుతూ ఆయా నేతలతో విరామమెరుగకుండా ఫోన్ సంభాషణలు చేస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు నగరంలో ఆనం కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. దీంతో వారికి నగర పరిధిలో వేలాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, విజయకుమార్‌రెడ్డి సోదరుడు రామనారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తుండగా, విజయకుమార్‌రెడ్డి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబ అభిమానులు ఈ ఎన్నికల్లో ఇరువురు సోదరుల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో, వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

నగరంలో కొందరికి ఇప్పటికే అధికార పార్టీ నుంచి బెదిరింపుల పర్వం కూడా ప్రారంభమైనట్లు తెలియవస్తోంది. వ్యాపారస్తులు, బిల్డర్లు, రియల్టర్లు తదితరులకు ‘‘మీ పిలక మా చేతిలో ఉంది. ఏమైనా డ్యాన్సులు ఆడితే తోకలు కత్తిరిస్తాం. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా, రానున్న రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండేది మా ప్రభుత్వమే. కనుక ఆలోచించుకోండి’’ అంటూ అధికార పార్టీ నుంచి బెదిరింపులు కొనసాగుతున్నట్లు తెలియవస్తోంది.

ఇదిలా ఉండగా, ఓసీ జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టిన విషయాన్ని రెడ్డి సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఆ సామాజికవర్గం ఏ పార్టీలో ఉన్నా ఈ విషయంలో మాత్రం ఒకే అభిప్రాయానికి వస్తున్నట్లు తెలియవస్తోంది. అయితే, ఓసీ జనరల్ సీటులో బీసీ అభ్యర్థిని కూటమి నిలబెట్టినా, బీసీల్లో మాత్రం కనిపించాల్సినంత సామాజిక చైతన్యం కనిపించడం లేదు.

మరోవైపు, రెండు పార్టీల నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులు ‘‘మీకు నచ్చితే కార్పొరేటర్లుగా మాకు ఒక ఓటు, మేయర్ అభ్యర్థికి మరో ఓటు వేయండి. అలా కాకపోతే మాకు మాత్రం కచ్చితంగా ఒక ఓటు వేయండి’’ అంటూ లోపాయికారిగా అభ్యర్థిస్తున్నట్లు తెలియవస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ‘‘మేమే గొప్ప, మాతోనే అభివృద్ధి సాధ్యం’’ అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు.

ప్రతిపక్ష వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు, 72వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షఫియా బేగం కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని కూడా బెదిరింపులు వచ్చినట్లు వారి కుటుంబ సభ్యులే బహిరంగంగా చెబుతున్నారు.

ఇక ప్రచార పర్వం మొదలు కానుండగా, ప్రలోభాలు, తాయిలాలు అందించేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక బలాలను సమకూర్చుకుని సిద్ధంగా ఉన్న రెండు పార్టీలు ఆయా నగదు మొత్తాలను నగరంలోని నాలుగు మూలల ప్రాంతాల్లో తమ నమ్మకస్తుల వద్ద డంప్ చేసి ఉంచినట్లు తెలియవస్తోంది.

ఇరువురు మేయర్ అభ్యర్థులపై అక్కడక్కడా అసంతృప్తులు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్రాస్ ఓటింగ్ బాగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా, సగటు ఓటరును ప్రసన్నం చేసుకుని, ఆ ఓటును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇరు పార్టీలు తమవంతు కృషి కొనసాగిస్తున్నాయి.

మరోవైపు, ముస్లిం మైనారిటీల్లో, దళిత వర్గాల్లో అసంతృప్తి కానవస్తోంది. మేయర్ అభ్యర్థిత్వం విషయంలో తమ సామాజికవర్గాలకు అన్యాయం జరిగిందని వారు బలంగా వాదిస్తున్నారు. అలాగే, డివిజన్ల హద్దులు నిర్ణయించడంలో, పునర్విభజనలో సైతం కొన్ని అవకతవకలు జరిగినట్లు ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు, ముస్లిం మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉండే జెండా వీధి వంటి ప్రాంతాలను పునర్విభజనలో చీల్చి తమకు అన్యాయం చేసినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆగ్రహావేశాలు కూడా క్రాస్ ఓటింగ్‌కు కారణమయ్యే అవకాశాలుగా కనిపిస్తున్నాయి.

అలాగే, నెల్లూరు నగరంలో టీడీపీలో ఉన్న ముఖ్య నేతలను సైతం సంప్రదించకుండా మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతులు చక్రం తిప్పి కూటమి అభ్యర్థిని నిర్ణయించారన్న బాధ సంబంధిత టీడీపీ నేతల్లోనే అంతర్లీనంగా కనిపిస్తోంది. ఇవన్నీ క్రాస్ ఓటింగ్‌కు తెరతీసే అవకాశాలు లేకపోలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *