Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ ఎన్నికల్లో చరిత్ర పునరావృతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మున్సిపల్ ఎన్నికల్లో చరిత్ర పునరావృతం

వార్త ముఖ్యాంశాలు

  • – నాడు జరిగిందే నేడు జరుగుతోంది – ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు – ఎవరికి వారే తాము సచ్ఛీలురమంటూ గొప్పలు – పరిశీలనల వద్దనే అన్యాయాలంటూ నిలదీస్తున్న గొంతులు ఈ నెల 28న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి చరిత్ర పునరావృతమవుతోంది.
  • నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన చరిత్ర నేడు మళ్లీ ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా పునరావృతమవుతోంది.
  • నాడు అన్యాయాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరదీసి దారి చూపిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు టీడీపీ హయాంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను చూసి గుండెలు బాదుకుంటున్నారు.

– నాడు జరిగిందే నేడు జరుగుతోంది
– ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు
– ఎవరికి వారే తాము సచ్ఛీలురమంటూ గొప్పలు
– పరిశీలనల వద్దనే అన్యాయాలంటూ నిలదీస్తున్న గొంతులు
ఈ నెల 28న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి చరిత్ర పునరావృతమవుతోంది. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన చరిత్ర నేడు మళ్లీ ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా పునరావృతమవుతోంది. నాడు అన్యాయాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరదీసి దారి చూపిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు టీడీపీ హయాంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం ‘‘నాడు మీరు చేసిందే ఇప్పుడు మేము చేస్తున్నాం’’ అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.

అయితే, అప్పట్లో వైసీపీలో ఇలాంటి వ్యవహారాలు సాగించిన వారే నేడు జెండాలు, కండువాలు మార్చుకొని టీడీపీలో కొనసాగుతున్నారు. దీంతో అలనాటి వ్యవహారాలు నేడు టీడీపీలో కూడా కొనసాగుతున్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా నిలబడుతున్న వైసీపీ వారికి ఇప్పటికే అనేక బెదిరింపులు వస్తున్నట్లు తెలియవస్తోంది. అయితే, అధికారం చేతిలో ఉండటంతో వైసీపీ వారిపైనే తగు సాక్ష్యాధారాలతో నిందలు మోపుతూ, సభ్య సమాజంలో వైసీపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అధికారులు, పోలీసులు అక్కడక్కడా అధికార పార్టీకి సహకరిస్తున్నట్లు సైతం ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఇప్పుడు కొత్తగా టీడీపీ చేస్తున్నది పెద్దగా ఏమీ లేదు. గతంలో వైసీపీ వారు చేసిందే వీరు చేస్తున్నారు. వారు చూపిన దారిలో వీరు నడుస్తున్నారు. నెల్లూరు నగరంలోని సంతపేటకు చెందిన ఓ టీడీపీ నాయకుడు తాజాగా వైసీపీలో చేరగా, అతన్ని బెదిరించి నగరంలోనే లేకుండా తిరుపతికి పంపినట్లు తెలియవస్తోంది. అతనికి సంబంధించిన ఒక భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో, దీన్ని బూచిగా చూపి ఆ సంతపేట నాయకుడిని బెదిరించినట్లు ఆ నోటా ఈ నోటా వినవస్తోంది.

ఇక పరిశీలనల విషయానికి వస్తే, పరిశీలనలో అధికారులు కూడా ఒకింత మొగ్గు అధికార పార్టీ అభ్యర్థుల వైపే చూపిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు టీడీపీ కార్పొరేటర్‌గా ఉండి, తాజాగా వైసీపీలో చేరి, 72వ డివిజన్‌కు చెందిన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ షఫియా బేగం విషయంలో పరిశీలన పేరుతో అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వారు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి బకాయిలు లేకపోయినా, వారికి కార్పొరేషన్‌కు చెందిన ఓ సామాజిక భవనాన్ని లీజుకు ఇచ్చినట్లు చూపుతూ, దానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు బకాయి ఉన్నట్లు చూపడంతో షఫియా బేగం అభ్యర్థిత్వం సంకటస్థితిలో పడింది. దీంతో వారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పుకోవడంతో, ఆయన హుటాహుటిన సంబంధిత నామినేషన్ల అధికారిని కలిశారు. ఎంత నిలదీసి అడిగినా అక్కడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో షఫియా బేగం మద్దతుదారులు ఇక్కడ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

ఇక 27వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నూకరాజు మదన్‌రెడ్డి, తనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి నామినేషన్ వేసిన సందీప్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను, విలువలను సక్రమంగా చూపలేదని, ఎన్నికల ఫారంలో అనేకం పూర్తి చేయలేదని ఆరోపిస్తూ ఎన్నికల అధికారి వద్ద నానా యాగీ చేశారు. ఈ విషయంలో ఎన్నికల అధికారి తన వాదనలను తేలికగా కొట్టివేశాడని ఆయన ఎన్నికల అధికారిపై ఆరోపణలు గుప్పించారు.

ఇలా అనేక మంది అభ్యర్థుల పరిశీలనల వద్ద చిన్నచిన్న అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన వారి ఎన్నికల నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు, టీడీపీకి సంబంధించిన పత్రాల పరిశీలనలో తేలిగ్గా తీసుకున్నట్లు వైసీపీ నుంచి ఆరోపణలు వినవచ్చాయి.

ఇదిలా ఉండగా, సీట్ల సర్దుబాటులో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి పార్టీల మధ్య అభిప్రాయభేదాలు కూడా తలెత్తినట్లు నెల్లూరు నగరంలో సమాచారం. జనసేనకు చెందిన కొట్టె వెంకటేశ్వర్లు, టీడీపీకి చెందిన గణేశం వెంకటేశ్వర్లురెడ్డి ఇరువురూ ఒకే డివిజన్‌లో నామినేషన్లు వేయడంతో, ఈ టికెట్ కోసం వారిద్దరి మధ్య ‘‘నీకా.. నాకా’’ అన్న పోటీ నెలకొంది.

జనసేన నేతలు ఈ విషయంలోనూ, అలాగే 2వ డివిజన్ తదితర విషయాల్లోనూ జనసేన పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలియవస్తోంది. అయితే, అధిష్ఠానం ‘‘మీరు ముందు నామినేషన్లతో కొనసాగండి. పోటీ నుంచి ఉపసంహరణలు చేయవద్దు. రెండు రోజుల్లో పరిస్థితులు సరిదిద్దుతాం. లేకపోతే జనసేన వారికి అన్యాయం జరిగితే, సామరస్యంగా స్నేహపూర్వక పోటీలోనైనా ఉండే అవకాశాలను పరిశీలిస్తాం. ఆ విధంగా ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని హామీలు ఇచ్చినట్లు తెలియవస్తోంది.

దీంతో జనసేన వారు కొంత ఆవేదనకు గురైనా, పార్టీ అధిష్ఠానం చెబుతున్న ఊరడింపు మాటలతో తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే టీడీపీలో టికెట్లు రావు అనుకున్న వారు ఇండిపెండెంట్లుగానైనా కొనసాగేందుకు సంసిద్ధంగా ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *