వార్త ముఖ్యాంశాలు
- మేడ్చల్ జిల్లా పున్నమి రిపోర్టర్ కీసర, అక్టోబర్ 11: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ బిక్కి రమేష్ సూచించారు.
- పండుగ సెలవుల్లో ఇళ్ల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో కోరారు.
- ప్రయాణానికి వెళ్లే ముందు ఇంటి తలుపులకు బలమైన తాళాలు వేయాలని, కిటికీలు సక్రమంగా మూసివేయాలని సూచించారు.
మేడ్చల్ జిల్లా పున్నమి రిపోర్టర్
కీసర, అక్టోబర్ 11:
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ బిక్కి రమేష్ సూచించారు. పండుగ సెలవుల్లో ఇళ్ల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో కోరారు.
ప్రయాణానికి వెళ్లే ముందు ఇంటి తలుపులకు బలమైన తాళాలు వేయాలని, కిటికీలు సక్రమంగా మూసివేయాలని సూచించారు. ఇంటి ముందు వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా వాటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. అవి పేరుకుపోతే ఇల్లు ఖాళీగా ఉందనే విషయం దొంగలకు సులభంగా తెలిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఊరికి వెళ్తున్న విషయాన్ని నమ్మకమైన పొరుగువారికి తెలియజేయాలని, అవసరమైతే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రయాణ వివరాలను సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని సూచించారు.
కాలనీలు, గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని బిక్కి రమేష్ కోరారు. చుట్టుపక్కల ఇళ్లపై నిఘా ఉంచుతూ అనుమానాస్పద కదలికలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
దసరా పండుగను ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని, ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ పోలీసు శాఖకు సహకరించాలని ఇన్స్పెక్టర్ బిక్కి రమేష్ విజ్ఞప్తి చేశారు.