Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరులో దిగజారుతున్న పారిశుధ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోవూరులో దిగజారుతున్న పారిశుధ్యం

వార్త ముఖ్యాంశాలు

  • -పట్టించుకోని అధికారులు, పాలకులు -వీధుల్లో మురుగుతున్న చెత్త -సిల్ట్ తీసి ఎండినా నెలల తరబడిగా తొలగించని వైనం -స్వచ్ఛతలో నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కోవూరు -కానరాని స్వచ్ఛత నియోజకవర్గ కేంద్రం అయిన కోవూరు పట్టణంలో పారిశుధ్యం రోజురోజుకీ దిగజారిపోతుంది.
  • పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.
  • వీధుల పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉంటుంది.

-పట్టించుకోని అధికారులు, పాలకులు
-వీధుల్లో మురుగుతున్న చెత్త
-సిల్ట్ తీసి ఎండినా నెలల తరబడిగా తొలగించని వైనం
-స్వచ్ఛతలో నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కోవూరు
-కానరాని స్వచ్ఛత
నియోజకవర్గ కేంద్రం అయిన కోవూరు పట్టణంలో పారిశుధ్యం రోజురోజుకీ దిగజారిపోతుంది. పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. వీధుల పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ వరకు స్వచ్ఛత గురించి నిత్యం ప్రకటనలు ఇస్తున్నా, నియోజకవర్గ కేంద్రం అయిన కోవూరులో మాత్రం ఆ స్వచ్ఛత ఆనవాళ్లు అసలే కనిపించడం లేదు. పంచాయతీ అధికారులు పారిశుధ్యం గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోవూరు పట్టణంలోని ప్రధాన వీధుల్లో మాత్రమే పారిశుధ్యం కొంతమేర మెరుగుగా ఉంటుండగా, మారుమూల సందుల్లో, చిన్న చిన్న వీధుల్లో పారిశుధ్యం దిగజారి కనిపిస్తుంది. వారాల తరబడిగా ఎత్తని చెత్త గుట్టలు మురిగి కంపు కొడుతున్నాయి. ఈ చెత్త గుట్టలపై ఈగలు, దోమలు, పురుగులు చేరి మరింత దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అనేక చోట్ల మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో ఆ కాలువలలో సిల్ట్ పేరుకుపోయి దోమల హేచరీలుగా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల మురుగునీటి కాలువల గుండా మురుగు ముందుకు పోకుండా నిలిచిపోతుండడంతో వీధులెక్కి పారుతున్న దృశ్యాలు కూడా దర్శనమిస్తున్నాయి.
మురుగునీటి కాలువలలో సిల్ట్ తీసినా, ఆ సిల్ట్ ఎండిపోయిన తర్వాత కూడా దాన్ని అక్కడి నుంచి డంపింగ్ యార్డులకు తరలించకుండా నెలల తరబడి అక్కడే నిల్వ ఉంచడంతో ఆయా వీధులు అసహ్యంగా మారుతున్నాయి. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఆమెకు కోవూరు పారిశుధ్యం గురించి సరైన అవగాహన లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు పారిశుధ్యంపై దృష్టి పెట్టడం లేదు. ఎమ్మెల్యే వారు కోవూరు పట్టణాన్ని నెలకోసారైనా ఆకస్మిక తనిఖీలు చేస్తే క్షేత్రస్థాయిలో ఉన్న పారిశుధ్య వ్యవహారాలు బయటపడగలవు. సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యం, పనితీరు అర్థం కాగలదు.
ముఖ్యంగా పాత పడుగుపాడు నుంచి మార్కెట్‌కు వెళ్లే మెయిన్ రోడ్డులో మురుగు కాలువ నుంచి సిల్ట్ తీసి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఆ ఎండిన సిల్ట్‌ను అధికారులు తొలగించిన పాపాన పోవడం లేదు. మసీదు రోడ్డు, కాపు వీధి, గుమ్మళ్ల దిబ్బకు వెళ్లే రోడ్లలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. శాంతినగర్, పెళ్లకూరు కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్యం అధ్వానంగా మారి ఉంది. ఇక రైల్వే ఫీడర్స్ రోడ్డుకు కూడా ఇందులో మినహాయింపు ఏమీ లేదు.
పట్టణంలో పారిశుధ్యం రోజురోజుకీ దిగజారిపోతుండడంతో మసక పడితే చాలు కోట్ల సంఖ్యలో దోమలు ఉత్పత్తి అయి ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. దోమల బాధతో కోవూరు ప్రజలు నిద్రలేని జాగారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కోవూరు పట్టణ పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కోవూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *