Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వంటింట్లో ధరల మంటలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వంటింట్లో ధరల మంటలు

వార్త ముఖ్యాంశాలు

  • -పైపైకి బియ్యం ధరలు -ధరలు ఆకాశంలో...
  • సామాన్యులు పాతాళంలో -పరుగులు తీస్తున్న నిత్యావసరాల ధరలు -పట్టించుకోని పౌర సరఫరాల శాఖ -గోదాముల్లో మగ్గుతున్న సరుకులు -నిత్యావసరాల కృత్రిమ నిల్వలు -విజిలెన్స్ దాడులు శూన్యం -లంచాల మత్తులో పౌర సరఫరాల శాఖ -ఎల్‌నినో బూచి చూపుతూ కృత్రిమ సామాన్యుల వంటిళ్లలో ధరల మంటలు ఎగసిపడుతున్నాయి.
  • నిత్యావసరాల ధరలు పరుగులు తీస్తున్నాయి.

-పైపైకి బియ్యం ధరలు
-ధరలు ఆకాశంలో… సామాన్యులు పాతాళంలో
-పరుగులు తీస్తున్న నిత్యావసరాల ధరలు
-పట్టించుకోని పౌర సరఫరాల శాఖ
-గోదాముల్లో మగ్గుతున్న సరుకులు
-నిత్యావసరాల కృత్రిమ నిల్వలు
-విజిలెన్స్ దాడులు శూన్యం
-లంచాల మత్తులో పౌర సరఫరాల శాఖ
-ఎల్‌నినో బూచి చూపుతూ కృత్రిమ
సామాన్యుల వంటిళ్లలో ధరల మంటలు ఎగసిపడుతున్నాయి. నిత్యావసరాల ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా బియ్యం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ధరలు ఆకాశంలోకి ఎగురుతుండగా సామాన్యుడు పాతాళంలోకి కుంగిపోతున్నాడు. ఆయా గోదాముల్లో నిత్యావసర సరుకులు మాత్రం నిల్వలుగా మారి మగ్గిపోతున్నాయి. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులకు కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ధరల భారాలతో విలవిలలాడిపోతున్నారు. విజిలెన్స్ శాఖ దాడులు శూన్యంగా కనిపిస్తున్నాయి. లంచాల మత్తులో పౌర సరఫరాల శాఖ హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎల్‌నినో బూచి చూపుతూ నిత్యావసర వస్తువుల ధరలను, బియ్యం ధరలను వ్యాపారుల సిండికేట్లు పెంచేస్తున్నాయి.
గత రెండు నెలల ముందు కిలో పెసరపప్పు ₹98 కాగా, నేడు అది ₹110 నుంచి ₹120 వరకు కొనసాగుతోంది. రెండు నెలల ముందు కందిపప్పు కిలో ధర ₹107 కాగా, ఇప్పుడు అది ₹130 దాటి కనిపిస్తోంది. ఇక జీలకర్ర ధర చూస్తే గతంలో కిలో ₹300 కాగా, ఇప్పుడు ఆ ధర ₹350 దాటింది. వేరుశనగ పప్పులు ధరలు తినే శనగపప్పు ధరలు , పచ్చి సన్నగా పప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి .ఆవాల విషయానికి వస్తే గతంలో వాటి ధర ₹110 పలికేది. ఇప్పుడు ఆ ధర ₹140 దాటింది. మిరియాల విషయాన్ని పరిశీలిస్తే గతంలో కిలో ₹750 నుంచి ₹770కి అమ్మగా, ఇప్పుడు వాటి ధర ₹900 దాటి ₹1,000కు చేరువలో ప్రయాణిస్తోంది. బెల్లం ధరలను పరిశీలిస్తే గతంలో కిలో బెల్లం ₹60 నుంచి ₹65 వరకు పలికేది కాగా, ఇప్పుడు దాని ధర ₹85 దాటి పరుగులు తీస్తోంది.
ఇక ఎర్రగడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు నెలల ముందు కిలో ₹30 నుంచి ₹35 పలికే పరిస్థితులు ఉండగా, ఇప్పుడు వాటి ధర ₹70 నుంచి ₹75 వరకు ఎగబాకింది. ఉల్లి వాడకాన్ని చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు బాగా తగ్గించారంటే అతిశయోక్తి కాదేమో. ఉల్లిని కోస్తే గతంలో కన్నీళ్లు వచ్చేవి; ఇప్పుడు ఉల్లి ధరలు చూస్తేనే కన్నీళ్లు వస్తున్నాయి.
ఇక బియ్యం ధరలు గత నెల రోజుల నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. 25 కిలోల చీరాల సన్నాల బియ్యం బస్తా ధర గతంలో ₹1,450 ఉండగా, ఇప్పుడు దాని ధర ₹1,750 దాటిపోయింది. ₹1,900 నుంచి ₹2,000కు అమ్మే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖలో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు. సరుకులు సమృద్ధిగా లేక ధరలు పెరగలేదు. వ్యాపారస్తులు సిండికేట్లుగా ఏర్పడి, పౌర సరఫరాల శాఖ అండదండలతో చెలరేగిపోతూ, ఎల్‌నినో బూచి చూపుతూ సరుకుల కృత్రిమ కొరతను సృష్టిస్తూ తాము చెప్పిందే ధరలుగా కొనసాగిస్తున్నారు.
ఇక వంట నూనెల ధరలు చూస్తే అవి వేడి చేయకముందే సలసల కాగిపోతున్నాయి. వంట నూనెల ప్రభావం, నిత్యావసరాల ధరల ప్రభావం హోటళ్ల మీద, టిఫిన్ అంగళ్ల మీద పడుతోంది. దీంతో ఆయా ధరలు కూడా కొండెక్కి కూస్తున్నాయి. అయినా టీడీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ ఎక్కడ ఉందో, ఏం పని చేస్తుందో తెలియడం లేదని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు.
రోజంతా కష్టపడి పది వేళ్లతో పని చేసి, రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి పది పావులు సంపాదిస్తే, ఐదు వేళ్లతో నోట్లోకి ముద్ద పోవడం లేదని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. నలుగురు, ఐదుగురికి పైగా ఉన్న కుటుంబాల్లో ఒక వ్యక్తి పని చేస్తే, ఆ వ్యక్తి తెచ్చే డబ్బులు నలుగురి ఆకలి తీర్చేందుకు కూడా సరిపోవడం లేదని పేదలు నిట్టూర్పులు విడుస్తున్నారు.
వైసీపీ హయాంలో ఇలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ అంటూ గొంతు చించుకుని బావురుమన్నారు. ఇప్పటి ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో అప్పట్లో ధరల పెరుగుదలపై గంటల గంటలు ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఇప్పుడు పెరిగిన ఈ ధరలు, సామాన్యుల కష్టాలు ఆ నేతలకు పట్టవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు పేదల ధరల భారాలు పట్టడం లేదని సామాన్య ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు, మంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ వరకు నిద్ర లేచి ధరల పెరుగుదలను అదుపులో పెట్టాల్సి ఉంది. రైతు బజార్ల ద్వారా ఉల్లి, తదితర నిత్యావసరాలను విక్రయించాల్సి ఉంది. గోదాముల్లో నిల్వ చేసిన కృత్రిమ నిల్వలపై విజిలెన్స్ దాడులు జరపాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *