రూ.3 లక్షల విలువైన యంత్రాలు, సామగ్రి అపహరణ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. యలమంచిలి నుంచి సైతారుపేట వెళ్లే ప్రధాన రహదారిలో పెంజెరువు ఎదురుగా ఉన్న విగ్రహాల తయారీ షెడ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి సుమారు రూ.2 నుంచి 3 లక్షల విలువైన మోటార్లు, విగ్రహాల తయారీ అచ్చులు, యంత్రాలు, క్యాష్ టేబుల్‌తో పాటు ఇతర సామగ్రిని వ్యాన్‌లో తరలించినట్లు బాధితుడు డి. లోవరాజు తెలిపారు.తన జీవనాధారమైన వ్యాపారానికి సంబంధించిన సామగ్రి చోరీ కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ పరిసరాల్లో గంజాయి సేవించడం, మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంపై గతంలో పలుమార్లు అభ్యంతరం తెలిపితే బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై యలమంచిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు, దొంగలను గుర్తించి సామగ్రిని తిరిగి ఇప్పించాలని కోరారు. పెంజెరువు పరిసరాల్లో పోలీసుల నిఘా పెంచి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వార్తా మూలాలు
- కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్