పూర్వ విద్యార్థుల సహకారంతో కలువాయి బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్‌కు 140 డ్యూయల్ డెస్కులు
రూ.7.75 లక్షల విలువైన డ్యూయల్ డెస్కులను విరాళంగా అందించిన జీవశాస్త్ర సహాయకులు వావింటపర్తి నారాయణరావు
కలువాయి:
విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలనే సంకల్పంతో కలువాయి బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న జీవశాస్త్ర సహాయకులు వావింటపర్తి నారాయణరావు చేపట్టిన సేవా కార్యక్రమం అభినందనీయం.
తాను చదివిన పాఠశాలపై, విద్యార్థులపై ఉన్న మమకారంతో తన పూర్వ విద్యార్థులను సంప్రదించి వారి సహకారాన్ని సమీకరించిన శ్రీ నారాయణరావు, రూ.7.75 లక్షల విలువైన 140 డ్యూయల్ డెస్కులను పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ డెస్కులను పాఠశాలలో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థుల సౌకర్యార్థం వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ . బాలాజీరావు ముఖ్య అతిథిగా హాజరై డ్యూయల్ డెస్కులను విద్యార్థులకు అంకితం చేశారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్ బాబు మరియు మండల విద్యాశాఖ అధికారులు పీ నవీన్ కుమార్ ఎస్ .జనార్దన రెడ్డి లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. బాలాజీరావు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం వి నారాయణరావు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. తన పూర్వ విద్యార్థులను ఒక్కొక్కరినీ సంప్రదించి, వారి సహకారంతో ఇంత పెద్ద మొత్తంలో విరాళాలను సమీకరించి పాఠశాలకు అందించడం ఎంతో గొప్ప సేవా భావానికి నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
తాను పనిచేస్తున్న పాఠశాల తన కుటుంబం లాంటిదని భావించి, విద్యార్థుల సౌకర్యం కోసం పూర్వ విద్యార్థులను ఒక్కతాటిపైకి తీసుకురావడం అభినందనీయంఅని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ . మహేష్ బాబు, ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, దాతల తరఫున రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చడంలో పూర్వ విద్యార్థుల సహకారాన్ని సమీకరించి, పాఠశాల అభివృద్ధికి తనవంతు బాధ్యతగా భావించి ముందుకు వచ్చిన వావింటపర్తి నారాయణరావును పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, అధికారులు అభినందించారు.
విద్యార్థుల కోసం చేసిన ఈ సేవా కార్యక్రమం కలువాయి బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్‌కు పూర్వ విద్యార్థుల అనుబంధానికి, గురువుల సేవా తత్పరతకు చక్కని నిదర్శనంగా నిలిచింది.
Uploaded Video:


