రామవరంలో ఘనంగా 9వ జాతీయ పోషణ మాసం
గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, అక్టోబరు 8 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలోని కర్రి జట్లా రెడ్డి కళ్యాణ మండపంలో 9వ జాతీయ పోషణ మాసం–2026 ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అంగన్వాడీ వ్యవస్థ కీలకమని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహారం అందించడంతో పాటు గర్భిణులకు ఆరోగ్యకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల సహకారం అవసరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల హాజరు, పోషకాహార పంపిణీ సక్రమంగా జరిగేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమాలను కేవలం మొక్కుబడిగా నిర్వహించకుండా గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యులకు సంపూర్ణ అవగాహన కల్పించేలా చేపట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.









