Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

మానుకోట ముద్దుబిడ్డ.. 12 ఏళ్లకే క్రికెట్‌లో సంచలనం

124 పరుగులతో అదరగొట్టిన గిరిజన బాలుడు లునావత్ సాయి హర్షిత్ హెచ్‌సీఏ సీ డివిజన్ వన్డే లీగ్‌లో అద్భుత ప్రతిభ – మారుమూల తండా నుంచి హైదరాబాద్ క్రికెట్ మైదానం వరకు ఎదుగుదల మహబూబాబాద్, నవంబర్ 27: చిన్న వయసులోనే క్రికెట్‌లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు లునావత్ సాయి హర్షిత్ క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీ డివిజన్ వన్డే లీగ్ 2026–27లో భాగంగా నవంబర్ 26న జరిగిన మ్యాచ్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్‌కు చెందిన ఎలెవన్ మాస్టర్స్ జట్టు తరఫున ఆడుతున్న సాయి హర్షిత్.. అద్నాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 124 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 132 బంతులను ఎదుర్కొని 14 ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే సీనియర్ స్థాయి క్రికెట్ పోటీల్లో ఇలాంటి ప్రతిభ కనబరచడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలెవన్ మాస్టర్స్ జట్టు 50 ఓవర్లలో 413 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాయి హర్షిత్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతని ప్రతిభ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో చోటు సంపాదించడం విశేషం. మారుమూల తండా నుంచి క్రికెట్ మైదానం వరకు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు పరిధిలోని గోలు బోడక తండాకు చెందిన రాములు కుమారుడు లునావత్ సాయి హర్షిత్. మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన ఈ బాలుడు తన పట్టుదల, క్రమశిక్షణ, క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ క్రికెట్ మైదానాల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నాడు. తండ్రి ప్రోత్సాహం.. కుమారుడి ప్రతిభకు అండ సాయి హర్షిత్ క్రికెట్‌లో ఎదగడానికి తండ్రి రాములు అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా నిలుస్తున్నాయి. చిన్న వయసులోనే కుమారుడిలోని క్రీడా ఆసక్తిని గుర్తించి, శిక్షణ పొందేందుకు, పోటీల్లో పాల్గొనేందుకు అండగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకోగలరనడానికి సాయి హర్షిత్ ప్రయాణం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. యువత క్రీడల వైపు అడుగులు వేయాలి సాయి హర్షిత్ వంటి ప్రతిభావంతులైన బాలలను చూసి గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం, క్రమం తప్పకుండా సాధన చేయడం, ఓటములను సైతం పాఠాలుగా తీసుకొని ముందుకు సాగడం ద్వారా క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ప్రతిభలు దాగి ఉన్నాయని, వారికి సరైన శిక్షణ, మైదానాలు, ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని ఈ బాలుడి ప్రతిభ నిరూపిస్తోంది. సాయి హర్షిత్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తన కుటుంబానికి, స్వగ్రామానికి, మహబూబాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని స్థానికులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ బంగ్లా – మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

చిన్నారి ముద్దు మాటలతో అంగన్‌వాడీ టీచర్ నిర్లక్ష్యం బట్టబయలు

కలెక్టర్ ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్లు సమాధానాలు.. చిన్నారి నిజాయితీకి బహుమతి.. టీచర్‌పై చర్యలకు ఆదేశం గంగారం, మండలం కోడిశెలబిట్ట గ్రామం నవంబర్ 26 (మహబూబాబాద్ జిల్లా): ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలు అంగన్‌వాడీ కేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఐఏఎస్ అడిగిన ప్రశ్నలకు ఆ చిన్నారి ఏమాత్రం తడబడకుండా, జరిగిన విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణలోని లోపాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి నిజాయితీకి ముచ్చటపడిన కలెక్టర్ బహుమతి అందించగా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం గంగారం మండలం కొడిశాలమిట్ట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రం ఎప్పుడు తెరుస్తారు? టీచర్ ప్రతిరోజూ వస్తున్నారా? ఇప్పటివరకు ఏం పాఠాలు నేర్పించారు? అంటూ ప్రశ్నించారు. దీనికి చిన్నారి స్పందిస్తూ.. టీచర్ ఈరోజే వచ్చారని, అంగన్‌వాడీ కేంద్రం కూడా ఇప్పుడే తెరిచారని, ఇన్ని రోజులు టీచర్ రాలేదని చెప్పాడు. అంతేకాకుండా తనకు ఇప్పటివరకు ఏబీసీడీ, అ ఆ ఇ ఈ మాత్రమే వచ్చునని, టీచర్ అంతవరకే నేర్పించారని అమాయకంగా సమాధానమిచ్చాడు. కలెక్టర్ అడిగిన ప్రతి ప్రశ్నకు చిన్నారి నిజాయితీగా సమాధానాలు చెప్పడంతో అక్కడున్న అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. చిన్నారి మాటల్లోని నిజాయితీకి, ధైర్యానికి ముగ్ధురాలైన కలెక్టర్ అతడిని అభినందించి బహుమతి అందజేశారు. ఊహించని బహుమతి అందుకోవడంతో ఆ చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మరోవైపు చిన్నారి వెల్లడించిన విషయాలపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అంగన్‌వాడీ కేంద్రానికి సిబ్బంది సక్రమంగా హాజరవుతున్నారా? చిన్నారులకు విధిగా పాఠాలు బోధిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారి నోట పలికిన నిజాలు.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకుంటే వారి విద్యాభివృద్ధి ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఈ ఘటనతో తెరపైకి వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

మహబూబాబాద్

పరువు పేరుతో కన్నకూతురినే కడతేర్చిన కసాయి తండ్రి

*ప్రేమ వ్యవహారం బయటపడిందనే ఆగ్రహం.. నిశ్చితార్థానికి ముందురోజే గొంతు నులిమి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం!* ఆదిలాబాద్, నవంబర్ 26 | పున్నమి; కన్నబిడ్డ భవిష్యత్తుకు అండగా నిలవాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కూతురి ప్రేమ వ్యవహారం కుటుంబ పరువుకు భంగం కలిగిస్తుందనే అహంకారంతో కన్నకూతురి ప్రాణాలనే బలితీసుకున్నాడు. తనకు నచ్చిన వ్యక్తితోనే వివాహం జరగాలన్న కుటుంబ నిర్ణయానికి భిన్నంగా కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకున్న తండ్రి, చివరకు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. *నిశ్చితార్థానికి ముందే విషాదం..* ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సుమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18). ఆమెకు నార్నూర్ ప్రాంతానికి చెందిన మరో యువకుడితో వివాహ సంబంధం ఖరారు చేశారు. నవంబర్ 25న నిశ్చితార్థం జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే నవంబర్ 23న కళ్యాణి దిగులుగా ఉండటాన్ని గమనించిన తండ్రి కైలాస్ కారణం ఏమిటని ప్రశ్నించాడు. ఈ క్రమంలో తనకు సమీప బంధువైన యువకుడితో ప్రేమ సంబంధం ఉందని కళ్యాణి తల్లిదండ్రులకు వెల్లడించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. *నిద్రలోనే గొంతు నులిమి హత్య..* కూతురు ప్రేమ వ్యవహారం తెలుసుకున్న కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. కుటుంబ పరువు పోతుందనే భావనతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 24వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో కళ్యాణి గదిలోకి వెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరివేసినట్లు చిత్రీకరించి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. *అనుమానాలకు తావిచ్చిన అంత్యక్రియలు..* ఉదయం సుమారు 5 గంటల సమయంలో తల్లి సుమిత్ర నిద్రలేచి చూడగా కుమార్తె ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తొలుత కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయడం స్థానికుల్లో అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాలపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. *పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం..* సమాచారం అందుకున్న నార్నూర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. తండ్రి కైలాస్‌ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ పరువు పోతుందనే భయంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు కైలాస్ అంగీకరించాడని నార్నూర్ సీఐ గురుస్వామి వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), సాక్ష్యాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. *పరువు కంటే ప్రాణం ముఖ్యం..* ప్రేమించడం నేరం కాదు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో యువతీ యువకులకు తమ అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని మాట్లాడాల్సిన తల్లిదండ్రులు, కుటుంబ గౌరవం పేరుతో ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం అత్యంత దారుణం. సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో కన్నబిడ్డల జీవితాలనే బలితీసుకోవడం ఏ సంస్కృతికీ, ఏ సంప్రదాయానికీ గౌరవం కాదు. నిశ్చితార్థపు వేడుక జరగాల్సిన ఇంట్లోనే చావు కేకలు వినిపించడం స్థానికులను కలచివేసింది. పరువు పేరుతో ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పున్నమి రిపోర్టర్ | భూక్య రాము నాయక్ | మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

పసిపాపపై అఘాయిత్యం.. తల్లి నిరాకరణతో కక్ష పెంచుకున్న నిందితుడు

వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని దారుణం.. రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్భ బారూచ్ (గుజరాత్), నవంబర్ 26: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా దహేజ్ ప్రాంతంలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ మహిళ నిరాకరించిందనే కక్షతో, ఆమె రెండేళ్ల కుమార్తెపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చిన్నారిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు చేసిన దారుణం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. తల్లి నిరాకరణతో వేధింపులు, బెదిరింపులు పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు సురేంద్రకుమార్ (28) బాధిత చిన్నారి తండ్రికి పరిచయస్తుడు. కొంతకాలంగా చిన్నారి తల్లిని వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధిస్తున్నట్లు సమాచారం. ఆమె అందుకు నిరాకరించడంతో నిందితుడు ఆగ్రహానికి గురై ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. చాక్లెట్ల ఆశ చూపించి చిన్నారిని తీసుకెళ్లి.. ఇంటివద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి తన గదిలోకి తీసుకెళ్లిన నిందితుడు, అక్కడ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో చిన్నారికి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోక్సో చట్టం కింద కేసు.. నిందితుడి అరెస్ట్ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. పున్నమి రిపోర్టర్ | భూక్య రాము నాయక్ | మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల డిసెంబర్ 10 వరకు కొత్త దరఖాస్తులు, అభ్యంతరాలకు అవకాశం మరిపెడ బంగ్లా: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేసింది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గంలో 6,21,086 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 11,89,191 మంది అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు ముసాయిదా జాబితాలో చోటు పొందారు. ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు డిసెంబర్ 10వ తేదీ వరకు కొత్త దరఖాస్తులు, అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఫారం-18 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదై ఉన్నవారు కూడా తాజా జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్: https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ బంగ్లా – మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

మరిపెడలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు – విశేషంగా లింగపూజలు, దీపారాధనలు

కార్తీక దీపాలతో శివాలయం దేదీప్యమానం మరిపెడలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు – విశేషంగా లింగపూజలు, దీపారాధనలు మరిపెడ: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మరిపెడ మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు, శివ స్వాములు, శివ భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించి దీపాలంకరణ చేశారు. ఆలయ పరిసరాలు దీపాల వెలుగులతో దేదీప్యమానంగా మారాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేసి, దీపాలు వెలిగిస్తూ కార్తీక మాస విశిష్టతను చాటారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, లింగపూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వయంగా శివలింగ పూజల్లో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయమంతా శివనామస్మరణ, భక్తి పాటలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో పూజించడం, దీపదానం చేయడం వల్ల అనేక జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణ సంప్రదాయాల్లో గొప్పగా చెబుతారు. భక్తితో వెలిగించిన ప్రతి దీపం శివుని అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తూ భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరిపెడ శివాలయం కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్

53 బంతుల్లో 204 పరుగులు రికార్డుల వేటలో యువ సంచలనం – వైభవ్ సూర్యవంశీ

సిక్సర్ల సునామీ సృష్టించిన సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచం షాక్! దోహా వేదికగా జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన కీలక పోరులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం విశేషం.కేవలం 16 బంతుల్లో అర్ధశతకం, 28 బంతుల్లోనే శతకం, 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసి వన్డే తరహా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఏ జట్టు సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించి ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 15 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసాధారణ ప్రదర్శన చేయడం క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. ముఖ్యంగా 28 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచాడు. ఈ అద్భుత విజయంతో భారత్-ఏ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్

బంగారం కొనుగోళ్లలో తొందర వద్దు.. వెండి ధరలపైనా అప్రమత్తంగా ఉండాలి

బంగారం కొనుగోళ్లలో తొందర వద్దు.. వెండి ధరలపైనా అప్రమత్తంగా ఉండాలి! కొనుగోలుదారులకు CTI సూచన.. ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్ల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపినట్లు ప్రచురితమైన వార్తా కథనం వెల్లడించింది. ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోకుండా లక్షలాది జువెలర్స్, ఇన్వెస్టర్లను కాపాడేందుకు ప్రధాని ముందుచూపుతో వ్యవహరించారని CTI పేర్కొన్నట్లు తెలిపింది. మోదీ చేసిన సూచనల అనంతరం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని, వ్యాపారులు ఆ సూచనలను పట్టించుకోకుండా భారీగా బంగారం కొనుగోలు చేసి ఉంటే కిలోకు సుమారు రూ.65 లక్షల వరకు నష్టం ఎదురయ్యే అవకాశం ఉండేదని CTI అభిప్రాయపడినట్లు వార్తా కథనంలో పేర్కొన్నారు. బంగారం మార్కెట్‌లో ఒడిదుడుకులు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు కొనుగోళ్లకు తొందరపడకుండా, తగ్గినప్పుడు కూడా మార్కెట్ పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వెండి ధరలపైనా పెట్టుబడిదారుల దృష్టి బంగారంతో పాటు వెండి మార్కెట్‌లోనూ గణనీయమైన ధరల హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో వెండికి ఉన్న డిమాండ్, సౌర విద్యుత్ పరికరాల తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగం, అంతర్జాతీయ సరఫరా పరిస్థితులు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో వెండిలో పెట్టుబడులు పెట్టేవారు కూడా మార్కెట్ పరిస్థితులను అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచితూచి కొనుగోలు చేయాలి బంగారం, వెండి కొనుగోలు చేసే సామాన్య ప్రజలు రోజువారీ ధరలను పరిశీలించడంతో పాటు స్వచ్ఛత, హాల్‌మార్క్, తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను గమనించాలి. ధరలు ఒక్కసారిగా పెరిగినా, తగ్గినా ఆందోళనతో నిర్ణయాలు తీసుకోకుండా తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా కొనుగోళ్లు చేయాలని సూచిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో అప్రమత్తతే ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పున్నమి రిపోర్టర్ | భూక్య రాము నాయక్ | మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

తండ్రికి తగ్గ తనయుడు.. హైకోర్టు అడ్వకేట్‌గా భూక్య తేజస్ ప్రమాణ స్వీకారం

తండ్రికి తగ్గ తనయుడు.. హైకోర్టు అడ్వకేట్‌గా భూక్య తేజస్ ప్రమాణ స్వీకారం! గిరిజన హక్కుల పోరాట యోధుడి వారసుడిగా న్యాయరంగంలోకి అడుగు.. మహబూబాబాద్‌కు గర్వకారణం మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్, పద్మ దంపతుల కుమారుడు భూక్య తేజస్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేసి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యను పూర్తి చేసిన తేజస్ ప్రస్తుతం కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం (క్రిమినాలజీ) అభ్యసిస్తూ తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తండ్రి భూక్య నెహ్రూ నాయక్ గతంలో లంబాడి హక్కుల పోరాట సమితిని స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం అనేక ఉద్యమాలు చేపట్టి క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన సమాజ సేవే లక్ష్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి మహబూబాబాద్ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. తండ్రి ప్రజాసేవా మార్గంలో నడుస్తూ, న్యాయవాద వృత్తిని ఎంచుకున్న తేజస్ భవిష్యత్తులో పేదలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులకు న్యాయం అందించే దిశగా ముందుకు సాగాలని పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు. తండ్రి చేసిన సామాజిక పోరాటాలు ఒకవైపు.. కుమారుడు ఎంచుకున్న న్యాయ సేవా మార్గం మరోవైపు.. ఈ కుటుంబం సమాజానికి అందిస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా భూక్య తేజస్ న్యాయరంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. కుమారుడు హైకోర్టు అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ప్రజాసేవా వారసత్వానికి కుమారుడి న్యాయవృత్తి తోడవడంతో మహబూబాబాద్ పట్టణంలో ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తోంది. పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్

వైభవంగా మరిపెడ అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవం

వైభవంగా మరిపెడ అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవం! అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన మరిపెడ.. భక్తులతో కిక్కిరిసిన ప్రధాన వీధులు మరిపెడ బంగ్లా: మరిపెడ మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 27వ వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పట్టణ ప్రధాన వీధుల గుండా వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఊరేగింపు సందర్భంగా భక్తుల అయ్యప్ప నామస్మరణలు, భక్తి గీతాలు, డీజే పాటలు, నృత్యాలతో మరిపెడ మండల కేంద్రం ఆధ్యాత్మిక సందడితో మార్మోగింది. స్వాములు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, భక్తి భావంతో ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీధులన్నీ అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోగా, స్వామివారి ఊరేగింపును వీక్షించేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 27 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తుల ఐక్యతకు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ఆకాంక్షించారు. స్వామియే శరణం అయ్యప్ప! పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా. Uploaded Video: