బోరుబావుల ఓవర్ఫ్లోకు చెక్.. విద్యుత్, నీటి వృథాకు అడ్డుకట్ట ఆటోమేటిక్ పంప్ కంట్రోలర్ల ఏర్పాటుకు గ్రామ పంచాయ
పున్నమి ప్రతినిధి, బైంసా: హంపొలి. ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బోరుబావుల నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతూ నీటితో పాటు విద్యుత్ వృథా అవుతున్న సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం సాంకేతిక పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. బోరుబావుల మోటార్ల స్టార్టర్లకు ఆటోమేటిక్ పంప్ కంట్రోలర్లు, కట్ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరికరాల ద్వారా నీటి మట్టం లేదా అవసరమైన స్థాయి చేరుకున్న వెంటనే మోటార్లు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. దీంతో అనవసరంగా మోటార్లు నడవకుండా విద్యుత్ ఆదా కావడంతో పాటు భూగర్భ జలాలు వృథా కాకుండా సంరక్షించవచ్చు. అలాగే మోటార్లు ఎక్కువసేపు పనిచేయడం, ఓవర్‌హీటింగ్, వోల్టేజ్ సమస్యల కారణంగా పాడయ్యే ప్రమాదం తగ్గి వాటి జీవితకాలం పెరుగుతుంది. సర్పంచ్ బండారి పోసాని బాయి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న ఈ సాంకేతిక ముందడుగు నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపులో కీలకంగా నిలవడమే కాకుండా ఇతర గ్రామ పంచాయతీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.









