నిర్మల్
పున్నమి ప్రతినిధి :నిర్మల్‌లో ట్రాఫిక్ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు నిర్మల్: పట్టణంలోని పలు షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మార్టుల వద్ద సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చందనా బ్రదర్స్, చెన్నై షాపింగ్, మాంగల్య తదితర వాణిజ్య సంస్థల వద్ద వాహనాలను రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నిలిపివేయడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోందని, అంబులెన్సులు, పాఠశాల బస్సులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాల్స్ ముందు రోడ్లపై ప్రకటన బోర్డులు, వస్త్ర స్టాండ్లు, ఇతర సామగ్రి ఏర్పాటు చేయడంతో పాటు పండుగల సమయంలో టెంట్లు, లైట్లు ఏర్పాటు చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. పార్కింగ్ నిబంధనలపై పట్టణంలోని అన్ని మాల్స్, మార్టులపై సమగ్ర సర్వే నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని కోరారు. అవసరమైతే ట్రేడ్ లైసెన్సులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించాలని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారులపై మాత్రమే కాకుండా పెద్ద వాణిజ్య సంస్థల ఆక్రమణలపైనా సమానంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు ప్రతులను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), నిర్మల్ జిల్లా ఎస్పీకి కూడా సమర్పించినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు మీర్జా షోయేబ్, షేక్ ఇంతియాజ్ అహ్మద్, మొహమ్మద్ మినాజ్, మొహమ్మద్ మొఖీమ్, మహమ్మద్ ఫసి తెలిపారు.