Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

నెట్ జీరో క్లీనప్ డేలో అల్లూరి విద్యాసంస్థల విశేష స్పందన

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నెట్ జీరో క్లీనప్ డే కార్యక్రమాన్ని శనివారం విస్తృతంగా నిర్వహించారు. ప్రభుత్వం, ఫారెస్ట్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా 11 కేజీబీవీలు, 10 ఆశ్రమ పాఠశాలలు, 29 గురుకుల పాఠశాలలు పాల్గొన్నాయి. అరకు, చింతపల్లి క్లస్టర్లలోని 21 విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 5,545 మంది పాల్గొని 717.46 కిలోల వ్యర్థాలను సేకరించారు. వీటిలో 495 కిలోల తడి, 189.80 కిలోల పొడి, 32.66 కిలోల ఇతర వ్యర్థాలు ఉన్నాయి. డుంబ్రిగూడ ఈఎంఆర్ఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పరిమళ పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ఈ-వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల వేర్పాటు, పునర్వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, గ్రామాల్లోనూ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను పాటించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

అల్లూరి సీతారామరాజు

మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యాలు మెరుగుపర్చాలి

పాడేరు, నవంబర్ 21: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్, భారత్‌నెట్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సిగ్నల్ అందని గ్రామాలు, నెట్‌వర్క్ అంతరాయాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య, డిజిటల్ లావాదేవీలు, అత్యవసర సమాచార మార్పిడికి మొబైల్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. ప్రతి మారుమూల గిరిజన ఆవాసానికి నాణ్యమైన నెట్‌వర్క్ అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం డీజీఎం, భారత్‌నెట్ ఏజీఎం, పాడేరు పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో తొలిరోజు 54 నామినేషన్లు

అరకులోయ, నవంబర్ 21 (పున్నమి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో తొలిరోజు మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో సర్పంచ్ స్థానాలకు 20, వార్డు సభ్యుల స్థానాలకు 34 వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు మాడగడలో అత్యధికంగా ఆరు నామినేషన్లు పడ్డాయి. సుంకరమెట్టలో మూడు; బస్కి, మాదల, పద్మాపురంలో చెరో రెండు వచ్చాయి. వార్డు సభ్యులకు బొండంలో ఎనిమిది; బస్కి, మాదలలో చెరో ఆరు; పెదలబుడులో ఐదు; మాడగడలో నాలుగు దాఖలయ్యాయి. గన్నెల, ఇరగాయి, లోతేరు, సిరగాంలో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: టీడీపీ లో చేరిన సాగర వైసీపీ, కాంగ్రెస్ నాయకులు

డుంబ్రిగుడ, నవంబర్ 21 (పున్నమి): డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకు ఆనందరావు, పాలకి రఘు, తామర్ల సంజీవరావు, తామర్ల కుజాన్న, గెమ్మెలి సీతన్న, గెమ్మెలి మల్లన్న, తామర్ల ప్రసాద్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు

పేలుడు ఘటనలో దెబ్బతిన్న 12 ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం

అనంతగిరి మండలం పీచుమామిడి గ్రామంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో దెబ్బతిన్న 12 నివాస గృహాల మరమ్మతుల కోసం బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గురువారం పాడేరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ టి. నిషాంతి బాధితులకు నగదు అందజేశారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గత వర్షాలకు ముందే బాధితులకు తార్పాలిన్లు అందించామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అక్వాన్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

అక్వాన్ తుఫాను ప్రభావంతో ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కోత కోసిన వరి పనలను ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలించి టార్పాలిన్లతో కప్పాలని, నూర్పిడి చేసిన ధాన్యాన్ని తేమ తగలకుండా భద్రపరచాలని కోరారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. పంట నష్టం జరిగితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు పాడేరు వ్యవసాయ సహాయ సంచాలకులు బి. ప్రభాకర్, వ్యవసాయ అధికారి ఇ. శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు పార్వతి, నాయుడు వణుగుపల్లి, కందమామిడి గ్రామాల్లో పర్యటించి రైతులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: చొంపి జంక్షన్ హైవే కింద వాగులో యువతి మృతదేహం

అరకులోయ సమీపంలోని చొంపి జంక్షన్ హైవే బ్రిడ్జి కింద వాగులో బుధవారం ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల పంచాయతీ జాకరవలసకు చెందిన కిల్లో మీనాక్షిగా గుర్తించారు. మీనాక్షి అరకు ఆర్ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతోంది. మృతదేహం వద్దకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కారకులను కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అరకులోయ ఏరియా ఆసుపత్రి నుండి పోలీసు స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

అల్లూరి సీతారామరాజు

నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్

అరకు మండలం సుంకరమెట్ట గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పరిసరాలు, భవనాలను పరిశీలించి పోలీసు, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అరకు సీఐ ఎ. కోటేశ్వరరావు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

జీడీసీ మహిళా కళాశాలలో జనరేటివ్ ఏఐపై అవగాహన వర్క్‌షాప్

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌పై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ డైరెక్టర్ అలిస్టర్ రొసారియో విద్యార్థులకు ఏఐ వినియోగంపై అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్ హేమ సుందర్ ప్రాంప్ట్‌ల రూపకల్పన, సమాచార సేకరణ, కంటెంట్ తయారీపై ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించారు. ఏఐ సాంకేతికతను విద్యాభ్యాసం, పరిశోధన, ఉద్యోగావకాశాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి. చలపతిరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె. శశికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

రేపు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు.. 20న జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు, 20న జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి తెలిపారు. ఎంపీపీ ఎన్నికలు సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో, జెడ్పీ ఎన్నికలు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం 1 గంటకు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏకైక అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.