Monday, 21 September 2026

Tag: Asifabad

ASIFABAD

మిషన్‌ భగీరథ నీళ్లు కరువు.. సోలార్‌ ట్యాంక్‌తో ఇంద్రానగర్‌ ప్రజల అవస్థలు

హ్యాండ్‌పంప్‌ తొలగించడంతో తాగునీటి కష్టాలు..! ట్యాంక్‌ నీటి నాణ్యతపై గ్రామస్తుల ఆందోళన ఆసిఫాబాద్, ఆగస్టు 20: వాంకిడి మండలం బంబారా గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్‌, గోండు కొసరా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని స్థానికులు చెబుతున్నారు. హ్యాండ్‌పంప్‌ తొలగించడంతో ఇబ్బందులు ఇంద్రానగర్‌ వాసులకు గతంలో తాగునీటికి ప్రధాన ఆధారంగా ఉన్న హ్యాండ్‌పంప్‌ను తొలగించి, దాని స్థానంలో సోలార్‌ ట్యాంక్‌ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. అయితే సోలార్‌ ట్యాంక్‌ నిర్వహణ, పరిశుభ్రతపై సరైన శ్రద్ధ లేకపోవడంతో నీటి నాణ్యతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్‌ నీటిని వినియోగిస్తున్న కొందరికి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేని సమయంలో హ్యాండ్‌పంప్‌ కొంతవరకు ఉపశమనం కలిగించేదని, దానిని తొలగించడంతో ప్రత్యామ్నాయ నీటి వనరు లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. గోండు కొసరాలోనూ నీటి కష్టాలు గోండు కొసరా ప్రాంతంలో కూడా మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా అందకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. వేసవి కాలంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని, అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. హ్యాండ్‌పంప్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ సోలార్‌ ట్యాంక్‌ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ట్యాంక్‌లోని నీటి నాణ్యతపై అధికారులు పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇంద్రానగర్‌లో తొలగించిన హ్యాండ్‌పంప్‌ను తిరిగి ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు హ్యాండ్‌పంప్‌ను అందుబాటులో ఉంచాలని, సోలార్‌ ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరిచి సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇంద్రానగర్‌, గోండు కొసరా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ASIFABAD

ఖిరిడీ దారిలో కుంగిన కల్వర్టు

బస్టాప్‌ సమీపంలో ప్రమాదకర పరిస్థితి.. పట్టించుకోని అధికారులు! ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న గ్రామస్థులు వాంకిడి, ఆగస్టు 19, (పున్నమి ప్రతినిధి): వాంకిడి మండలం ఖిరిడీ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఖిరిడీ బస్టాప్‌ సమీపంలోని కల్వర్టు ఒకవైపు పూర్తిగా కుంగిపోవడంతో రహదారి అంచు ప్రమాదకరంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖిరిడీ గ్రామానికి రాకపోకలు సాగించే ప్రజలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యవసాయ వాహనాలతో పాటు ఇతర వాహనాలు కూడా ఇదే దారిలో ప్రయాణిస్తున్నాయి. రహదారి అంచు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షం వస్తే మరింత ప్రమాదం వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కల్వర్టు వద్ద కోత మరింత పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికే రహదారి పక్కభాగం బలహీనపడగా, మరోసారి భారీ వర్షం కురిస్తే రహదారి కొంతభాగం పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఖిరిడీ గ్రామానికి రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. హెచ్చరిక బోర్డులైనా ఏర్పాటు చేయరా? ప్రమాదకరంగా మారిన ప్రాంతంలో కనీసం హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోందని, చీకట్లో గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తాత్కాలిక పనులతో ప్రయోజనం లేదంటున్న ప్రజలు ప్రతి వర్షాకాలంలో కల్వర్టు వద్ద ఇదే సమస్య తలెత్తుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా మట్టి, కంకర పోసి చేతులు దులుపుకోవడం కాకుండా కల్వర్టును పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించాలి ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రమాద ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కల్వర్టును శాశ్వతంగా పునర్నిర్మించాలని కోరుతున్నారు. వర్షాలు మరింత ఉధృతమయ్యేలోపే చర్యలు తీసుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం వల్ల ప్రయోజనం ఉండదని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం ముంచుకొచ్చేలోపే మరమ్మతులు చేయాలి ఖిరిడీ బస్టాప్‌ సమీపంలోని కల్వర్టు దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని గ్రామానికి చెందిన వాహనదారుడు బైరాగోని తిరుపతి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో కల్వర్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కల్వర్టును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. చిన్న సమస్యగా భావించి జాప్యం చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంటుందని, ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ASIFABAD

ఆసిఫాబాద్‌లో రాజస్థానీ హోటల్‌లో చోరీ

తేదీ: 19-08-2026 | ఆసిఫాబాద్(పున్నమి ప్రతినిధి) ఆసిఫాబాద్ పట్టణంలో బుధవారం ఓ రాజస్థానీ హోటల్‌లో అజ్ఞాత దొంగలు చోరీకి పాల్పడ్డారు. హోటల్ వెనుక భాగంలో ఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదును అపహరించి పరారైనట్లు హోటల్ యజమాని తెలిపారు. హోటల్ యజమాని నారాయణ్ లాల్ దేవాసీ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు హోటల్‌లోని సుమారు రూ.10,000 నగదును తీసుకెళ్లారు. ఇదే హోటల్‌లో గతంలో కూడా రెండు, మూడు సార్లు చోరీలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. వరుసగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో హోటల్ యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో భద్రతా చర్యలు మరింత పెంచాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు. చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

ASIFABAD

వాట్సాప్ చాట్‌బాట్‌కు ఏఐ అనుసంధానం

విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువగా టీజీ ఎన్పీడీసీఎల్ ఏఐ తేదీ: 18-08-2026,పున్నమి రిపోర్టర్,ఆసిఫాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోందని కుమురంభీమ్ ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడె తెలిపారు. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ సేవలను 24 గంటలు, 7 రోజులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యుత్ ఫిర్యాదులు, బిల్లింగ్, కొత్త విద్యుత్ సర్వీసు కనెక్షన్, సోలార్ తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పొందవచ్చన్నారు. వాట్సాప్ చాట్‌బాట్ నంబర్: 87124 81489 వినియోగదారులు ఈ నంబర్‌ను తమ మొబైల్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్ వివరాలు, కొత్త విద్యుత్ కనెక్షన్, సోలార్ సేవలు తదితర అంశాలపై సులభంగా సమాచారం పొందవచ్చన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 1912, ఏఐ వాట్సాప్ చాట్‌బాట్, మొబైల్ యాప్, వెబ్‌సైట్ వంటి ఆధునిక సేవా మార్గాలను సంస్థ మరింత బలోపేతం చేసిందని ఎస్ఈ తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు, పరిష్కార ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. “వినియోగదారుల సంతృప్తే సంస్థకు అత్యంత ప్రాధాన్యత. ప్రతి విద్యుత్ వినియోగదారుడికి వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తున్నాం” అని ఎస్ఈ ఉత్తమ్ జాడె తెలిపారు. విద్యుత్ వినియోగదారులు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సులభంగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. “సాంకేతికతతో సేవలు.. వేగవంతమైన స్పందనతో పరిష్కారం.. వినియోగదారుల సంతృప్తే టీజీ ఎన్పీడీసీఎల్ లక్ష్యం” అని ఎస్ఈ స్పష్టం చేశారు.

ASIFABAD

చింతల మాదారం వాటర్‌ఫాల్స్‌లో అధిక ఫీజులు.. పర్యాటకులపై భారం

కొమురంభీం ఆసిఫాబాద్ పున్నమి రిపోర్టర్ | తేదీ: 17-08-2026 తిర్యాణి: పని ఒత్తిడితో సతమతమయ్యే ప్రజలు ఆదివారాలు, సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులు, పిల్లలతో విహారయాత్రలకు వెళ్లి కాస్త సేదతీరాలని భావిస్తారు. అయితే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదారం వాటర్‌ఫాల్స్ వద్ద వసూలు చేస్తున్న ఎంట్రీ, వాహన ఫీజులు పర్యాటకులకు భారంగా మారుతున్నాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఫీజుల భారం పడుతోందని, కుటుంబ సభ్యులతో కలిసి వస్తే ఖర్చులు మరింత పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. విహారయాత్రకు వచ్చి రిలాక్స్ కావాల్సిన పరిస్థితిలో అధిక ఫీజుల కారణంగా ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నామని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు. సదుపాయాలు కరువు చింతల మాదారం వాటర్‌ఫాల్స్‌ వద్ద పర్యాటకుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు, మూత్ర విసర్జన సదుపాయాలు, ఇతర అవసరాలకు అనువైన సౌకర్యాలు అందుబాటులో లేవని వారు చెబుతున్నారు. కుటుంబాలతో, చిన్నారులతో వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం సరికాదని సందర్శకులు అంటున్నారు. పర్యాటకుల భద్రత, పరిశుభ్రతతో పాటు మహిళలు, చిన్నారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల డిమాండ్ చింతల మాదారం వాటర్‌ఫాల్స్ వద్ద వసూలు చేస్తున్న ఎంట్రీ, వాహన ఫీజులను తగ్గించాలని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులను నిర్ణయించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, పరిశుభ్రత, విశ్రాంతి ప్రాంతాలు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. “విహారానికి వచ్చే ప్రజలపై ఆర్థిక భారం కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి” అని పర్యాటకులు అధికారులను కోరుతున్నారు.

ASIFABAD

గ్రామ సభలకు పరిమితమైన 2వ, 4వ వార్డు సభ్యులు.. ఓటర్ల సమస్యలు గాలికి?

వ్యక్తిగత అవసరాల పనుల కోసం ప్రశ్నించిన వారిపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు వాంకిడి, ఆగస్టు 16: వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలోని 2వ, 4వ వార్డుల సభ్యుల తీరుపై ఆయా వార్డుల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ సభలకు అప్పుడప్పుడు హాజరవుతున్నప్పటికీ, తమ వార్డుల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభల్లో ప్రస్తావించి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు తదితర సమస్యలు ఉన్నప్పటికీ వాటిని గ్రామ సభల్లో బలంగా ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన వార్డు సభ్యులు తమ వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన పనులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే బెదిరింపులా? వార్డు సమస్యలపై ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రశ్నించిన వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కొందరు ఓటర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వార్డు సభ్యుల వివరణ తెలియాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఓటరుకూ ఉందని, ప్రజల సమస్యలను వినడం, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఓట్లతో గెలిచినవారు.. ఓటర్లను పట్టించుకోరా? ఎన్నికల సమయంలో ఓటర్లను కలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు, ఎన్నికల అనంతరం అదే ప్రజల సమస్యలపై స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా 2వ, 4వ వార్డు సభ్యులు తమ పరిధిలోని ప్రజల సమస్యలను గుర్తించి గ్రామ సభల్లో అధికారికంగా ప్రస్తావించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల గొంతుకగా నిలవాల్సిన వార్డు సభ్యులు వ్యక్తిగత వ్యవహారాలకు పరిమితం కాకుండా వార్డుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ASIFABAD

మట్టి, తడకల ఇంట్లోనే బతుకు…

రెండో జాబితాలోనైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి పున్నమి రిపోర్టర్ | తేదీ: 15-08-2026 కెరమెరి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఖైరి గ్రామపంచాయతీ పరిధిలోని ఖైరి గ్రామానికి చెందిన మొహార్లే సవిత తన దుస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. మొదటి జాబితాలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన తాను కనీస వసతులు లేని మట్టి, తడకల ఇంట్లోనే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నానని సవిత తెలిపారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఇంటి పరిస్థితి చూసి ప్రతిరోజూ భయంతో జీవిస్తున్నామని కన్నీళ్లతో వాపోయారు. పేదరికం కారణంగా సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకునే స్థోమత తనకు లేదని, ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లే తమ కుటుంబానికి ఏకైక ఆధారమని తెలిపారు. “మా పరిస్థితిని చూసైనా కనికరించండి” తమ ఇంటి పరిస్థితిని అధికారులు స్వయంగా పరిశీలించి, తన అర్హతను గుర్తించి న్యాయం చేయాలని సవిత విజ్ఞప్తి చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలోనైనా తన పేరును చేర్చి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, తమలాంటి అర్హులైన పేద కుటుంబాలకు కూడా అవకాశం కల్పించాలని ఆమె అధికారులను వేడుకున్నారు. పేద కుటుంబం కన్నీటి వేడుకోలు.. రెండో జాబితాపైనే ఆశలు!

ASIFABAD

సమస్యల సుడిగుండంలో కిష్టాపూర్.. కలెక్టర్ సందర్శించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

రోడ్లు, డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక, వీధి దీపాలు, అంగన్‌వాడీ సమస్యలతో అవస్థలు అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ తేదీ: 14 ఆగస్టు 2026 | పున్నమి రిపోర్టర్ రెబ్బెన: కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మౌలిక వసతులు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీతో ఇబ్బందులు కిష్టాపూర్ గ్రామంలో పలు ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు రోడ్లపైకి చేరే పరిస్థితి ఏర్పడుతోందని మరియు చెత్త తీయడం లో నిర్లక్ష్యం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక సమస్యలు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నిర్వహణతో పాటు స్మశానవాటికకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి అవసరమైన వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీధి దీపాలు లేక రాత్రివేళ ఇబ్బందులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాల సమస్య ఉందని, రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో తగినంత వెలుతురు ఉండేలా స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసి, పనిచేయని లైట్లను వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. అంగన్‌వాడీపై కూడా దృష్టి సారించాలి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నారులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. “కలెక్టర్ ఒక్కసారి గ్రామాన్ని సందర్శించాలి” గ్రామంలోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా కిష్టాపూర్ గ్రామాన్ని సందర్శించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు గ్రామంలో పర్యటిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని, సమస్యల తీవ్రతను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక, వీధి దీపాలు, అంగన్‌వాడీ తదితర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కిష్టాపూర్ గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ASIFABAD

సరండి గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలు ఏర్పాటు

గ్రామ భద్రతకు పెద్దపీట.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్, కార్యదర్శి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు: సర్పంచ్ మొహార్లే బాపూజీ తేదీ: 14 ఆగస్టు 2026 | పున్నమి రిపోర్టర్ వాంకిడి: గ్రామాభివృద్ధితో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ మొహార్లే బాపూజీ, పంచాయతీ కార్యదర్శి సోనం తెలిపారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రదేశాల్లో నిఘా ఉండేలా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో జరిగే కార్యకలాపాలపై పర్యవేక్షణతో పాటు ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్నప్పుడు వివరాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో భద్రతా వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో భద్రతపై నమ్మకం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ బాపూజీ తెలిపారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శన సీసీ కెమెరాల ఏర్పాటు అనంతరం సర్పంచ్ మొహార్లే బాపూజీ, కార్యదర్శి సోనం గ్రామంలోని పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిమాణం, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం పాఠశాల సందర్శనలో భాగంగా సర్పంచ్ బాపూజీ, కార్యదర్శి సోనం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారితో కలిసి భోజనం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి చదువు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం ఎంతో అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. భోజనం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాల సమస్యలపై ఆరా పాఠశాల పరిసరాలను పరిశీలించిన సర్పంచ్, కార్యదర్శి విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, తరగతి గదులు తదితర సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాల వాతావరణాన్ని మెరుగ్గా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సాధ్యమైనంత సహకారం అందిస్తామని సర్పంచ్ బాపూజీ వెల్లడించారు.

ASIFABAD

వర్షపు నీటిలో పత్తి పంట.. రైతు కన్నీటి వేడుకోలు

తేదీ: 14 ఆగస్టు 2026 | పున్నమి రిపోర్టర్ సర్పంచ్‌ను వేడుకున్నా ఫలితం లేదని రైతు ఆరోపణ.. పోలీసులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వాంకిడి: పంట చేతికొచ్చే సమయంలో వర్షపు నీరు పొలంలో నిలిచిపోవడంతో పత్తి పంట దెబ్బతింటోందని వాంకిడి మండల కేంద్రానికి చెందిన రైతు ఇటన్కార్ బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి శివారులోని తన వ్యవసాయ పొలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరి రోజుల తరబడి బయటకు వెళ్లడం లేదని తెలిపారు. పక్క పొలానికి ఏర్పాటు చేసిన కట్ట కారణంగా వర్షపు నీటి ప్రవాహం అడ్డుకుపోయి తన పొలంలో నీరు నిలిచిపోతోందని బాపురావు ఆరోపించారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడటంతో పత్తి మొక్కలు బలహీనపడుతున్నాయని, ఎంతో ఆశతో సాగు చేసిన పంట కళ్లముందే దెబ్బతింటుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. పెట్టుబడి మొత్తం నీటిపాలు అయ్యే పరిస్థితి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పంట సాగు చేశానని బాపురావు తెలిపారు. ప్రస్తుతం పొలంలో నీరు నిలిచిపోవడంతో పంట నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. మరోసారి భారీ వర్షం కురిస్తే పత్తి పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ను కలిసినా పరిష్కారం కాలేదని ఆరోపణ పొలంలో నిలిచిన నీరు బయటకు వెళ్లేందుకు మార్గం కల్పించాలని పక్క పొలం రైతును పలుమార్లు కోరినా సమస్య పరిష్కారం కాలేదని బాపురావు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. దీంతో చివరకు వాంకిడి పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వాపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ఇది వ్యక్తిగత గొడవగా కాకుండా రైతు పంటను కాపాడాల్సిన అత్యవసర సమస్యగా అధికారులు పరిగణించాలని బాపురావు కోరారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి, వర్షపు నీరు సహజంగా వెళ్లే మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల రైతులతో మాట్లాడి ఎవరికీ నష్టం కలగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. “నా పంటను మాత్రమే కాపాడండి” “ఎవరికీ నష్టం చేయాలని లేదు. గొడవ కూడా వద్దు. నా పంటను మాత్రమే కాపాడాలి. పంట పూర్తిగా నష్టపోయిన తర్వాత పరిహారం కోసం తిరగడం కంటే ముందుగానే నీటి సమస్యను పరిష్కరించాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలి” అంటూ బాపురావు కన్నీటి పర్యంతమయ్యారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి రైతు పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.