Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Andhra Pradesh News

ప్రకాశం

పాకల బీచ్‌లో విషాదం.. ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరు గల్లంతు! కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామంలో విషాదఛాయలు

కనిగిరి: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తూ ఉధృతమైన అలల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాదంలో చిక్కుకున్న మరో ముగ్గురిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు రక్షించారు. పోలేరమ్మ జాతర అనంతరం సముద్ర స్నానానికి.. కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన సుమారు 70 మంది గ్రామస్థులు పోలేరమ్మ జాతర ముగించుకుని సంప్రదాయం ప్రకారం సముద్ర స్నానాల కోసం పాకల బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అల వారిని లోపలికి లాక్కెళ్లినట్లు బాధితులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానిక మత్స్యకారులు, పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బంది పడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు మృతి.. ఇద్దరి కోసం గాలింపు ఈ ప్రమాదంలో పాలడుగు తేజ (20), బత్తుల మహేష్ బాబు (22) మృతిచెందారు. దేవల విష్ణు, దేవల నారాయణ గల్లంతయ్యారు. మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్‌తో పాటు కందుకూరులోని కోటారెడ్డి ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. గల్లంతైన యువకుల కోసం డ్రోన్లు, మత్స్యకారుల పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కందుకూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను అధికారులు పరామర్శించి, వైద్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డి. హిమవంశి తదితర అధికారులు పాల్గొన్నారు. బీచ్‌కు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్నానాలకు దిగడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. పర్యాటకులు, సందర్శకులు భద్రతా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి గొంతుకల కోవూరు

నెల్లూరు జిల్లాలో చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం కోవూరు. ఒకప్పుడు ఎర్రజెండాలు ఎగిరిన ఈ నేల కార్మిక, కర్షక ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచింది. దక్షిణ భారత ఉద్యమ సూర్యుడిగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన అలగానిపాడు ఈ నియోజకవర్గంలోనే ఉంది. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి వంటి ప్రముఖులకు కూడా కోవూరు ప్రాంతంతో అనుబంధం ఉంది. పచ్చని మాగాణులు, సారవంతమైన పంట పొలాలు కోవూరు ప్రత్యేకత. పెన్నా నది, పైడేరు, మాలిదేవి వాగులు ఈ ప్రాంత వ్యవసాయానికి జీవనాధారాలుగా నిలుస్తున్నాయి. ఆక్వా సాగు, చేనేత, మత్స్యకార వృత్తులు కూడా ఇక్కడి జీవన విధానంలో కీలకం. జొన్నవాడ, రామతీర్థం, గంగపట్నం వంటి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక గుర్తింపును తెచ్చాయి. ఇందుకూరుపేట ప్రాంతం పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. తమలపాకు, అరటి పంటలు, పాటూరు చీరలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. జాతీయ రహదారి, రైల్వే మార్గం, సాగర తీరం కోవూరుకు అదనపు బలం. ఉద్యమాలు, వ్యవసాయం, సాహిత్యం, రాజకీయం, ఆధ్యాత్మికత కలగలిసిన కోటి గొంతుకల నేల కోవూరు.