విశాఖ స్టీల్ ప్లాంట్ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు
గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.










