Blog
నంద్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జాతీయ వినియోగదారుల వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు అమీర్‌బాషా అధ్యక్షతన నంద్యాల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వారోత్సవాల ముంగిపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల రాజేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.వెంకటరమణ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు, లీగల్ మెట్రాలజి జిలాని బాషా, డీఈఓ జనార్ధన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారి రవిబాబు, డీటఓ శివారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా జేసీ కొల్లాబత్తుల రాజేష్ మాట్లాడుతూ సేవలు పొందే సమయంలో, వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని తక్కువ ధరలకు వస్తువులను అందిస్తామన్న వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నాణ్యత కలిగిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అమ్మకాలు జరిపే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేడు డిజిటల్ న్యాయపాలన ద్వారా వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అందువల్ల విద్యార్థి దశ నుండే డిజిటల్ పాలన, ఈ ఫైలింగ్‌పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత, కొలతలలో తేడా ఉన్నట్లయితే అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చన్నారు. అలా పరిష్కారం కాని ఫిర్యాదులపై వినియోగదారులు జిల్లాస్థాయి వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చన్నారు. అలాగే రంగులు వేసిన, టేస్టెడ్ సాల్ట్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు, నాసిరకం పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన పడే అవకాశం ఉందని అటువంటి ఆహార పదార్ధాలను తినకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. వస్తువు కొనుగోలు చేసే సయయంలో ప్యాకింగ్‌పై ఉన్న తయారీ తేది, ఎక్స్‌పైరీ తేది తదితర వివరాలను పూర్తిగా చదివి వస్తువును కొనుగోలు చేయాలని అలాగే తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. అనంతరం వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు , వినియోగదారుల సంఘం సభ్యులకు జాయింట్ కలెక్టర్ ప్రశంసా పత్రాలు, జ్జాపికలను అందజేశారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, వినియోగదారులు సంఘం సభ్యులు శ్రీనివాసులు, రజనీకాంత్, మరియదాస్ తదితరులు పాల్గొన్నారు.