విశాఖపట్నం
*ఎస్సీ, ఎస్టీ యువత సివిల్ సర్వీసుల్లో మెరవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష* *రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి *రుషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్స్ శిక్షణా శిబిరం ప్రారంభం *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* ఎస్సీ, ఎస్టీ యువత సివిల్ సర్వీసుల్లో మెరవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని, దానిలో భాగంగా రూ.4.22 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో ఉచిత సివిల్స్ కోచింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బుధవారం రుషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో నూతనంగా ప్రవేశపెట్టిన సివిల్స్ ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఆమె ఈ మేరకు మాట్లాడారు. అట్టడుగు వర్గాల వారిని అభ్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, దానిలో భాగంగా ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రూ.1,300 కోట్లు వెచ్చించి రోడ్లు వేశామని, ఫీడర్ అంబులెన్స్ లను ప్రవేశపెట్టామని, గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో ఆధునిక వసతులతో కూడిన 100 పడకల ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సంకల్పంతో గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రీజియన్లలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగు వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఒక్కో కేంద్రంలో 100 చొప్పున మొత్తం 340 మందికి ఉచిత కోచింగ్‌తో పాటు వసతి, స్టడీ మెటీరియల్, నాణ్యమైన ఆహారం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల సన్నద్ధతను మెరుగుపర్చేందుకు మాక్ టెస్టులు, లైబ్రరీ, అనుభవజ్ఞులైన మెంటార్ల మార్గదర్శనం వంటి అన్ని సదుపాయాలను ఒకేచోట కల్పిస్తున్నామని చెప్పారు. చదువు ద్వారానే అనుకున్న అభివృద్ధి, ఆశించిన పురోగతి సాధ్యమవుతుందని, శిక్షణకు ఎంపికైన విద్యార్థులంతా సమయాన్ని సద్వినియోగం చేసుకొని, అవకాశాలను వినియోగించుకొని ఉత్తమ స్థానాలకు చేరుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. మొబైల్ ఫోన్ ను అనవసరంగా ఉపయోగించవద్దని, సమయం వృథా చేసుకోవద్దని హితవు పలికారు. తన కుమార్తె మెడిషన్ చదువుతోందని, కుమారుడు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడని ప్రసంగంలో భాగంగా మంత్రి పేర్కొన్నారు. తన మాదిరిగానే మిగతా తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను తగిన విధంగా ప్రోత్సహించాలని, ఆడపిల్ల విషయంలో ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని కాకుండా.. జీవితంలో స్థిరపడేలా సహకారం అందించాలని హితవు పలికారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శరత్ చంద్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తేజపరుస్తూ ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి చేరుకోవచ్చని స్పష్టం చేశారు. తాము కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాకే ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా యలమంచలి, విజయనగరం, పాడేరు ప్రాంతాలకు చెందిన జ్యోతి, సోమశేఖర్, తౌడమ్మ స్ఫూర్తిదాయక సందేశం అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే ఉచితంగా సివిల్స్ కోసం కోచింగ్ తీసుకోగలుగుతున్నామని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అభ్యర్థులందరకీ మంత్రి చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ ను అందజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ గ్రేస్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేశ్, ఇతర అధికారులు, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.