Sunday, 26 April 2026

Blog

తిరుపతి

మహిళా విద్యార్థినులకు ఆత్మరక్షణలో నైపుణ్యం – శ్రీకాళహస్తిలో శిక్షణ ఘన ముగింపు

శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గత 40 రోజులుగా నిర్వహించిన పీఎం ఉషా సాఫ్ట్ కాంపోనెంట్స్‌లో భాగమైన బాలికల స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది. విద్యార్థినుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించిన ఈ శిక్షణకు విశేష స్పందన లభించింది. ముగింపు సందర్భంగా నిర్వహించిన బెల్ట్ టెస్ట్‌లో విద్యార్థినులు ప్రతిభ కనబరచగా, ఇద్దరికి గ్రీన్ బెల్ట్‌లు, ఎనిమిది మందికి ఆరెంజ్ బెల్ట్‌లు, మిగిలిన వారికి యెల్లో బెల్ట్‌లు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. బి. రాజశేఖర్ మాట్లాడుతూ…ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థిని ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అత్యవసరమని, ఇవి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఫిజికల్ డైరెక్టర్ నరసింహరావు సమన్వయం చేయగా, రవి మాస్టర్, సరిత మాస్టర్ శిక్షణ అందించారు. పీఎం ఉషా కోఆర్డినేటర్ వీ.కే. దీనదయాల్, నర్రా లక్ష్మీతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

తిరుపతి

భూమన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన శ్రీకాళహస్తి టిడిపి నేతలు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, టిటిడి పాలకమండలి అధ్యక్షుడు బి.ఆర్. నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తిరుమల, తిరుపతి వంటి పవిత్ర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. టిటిడిలో గతంలో జరిగిన అవకతవకలను బయటపెడుతున్న నేపథ్యంలో బి.ఆర్. నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేయడం, దాడులకు యత్నించడం అనేది అనుచితమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పరకామణి వద్ద జరిగిన విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్ల చోరీ ఘటనల్లో భూమన పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుపతి నగర ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొంతమంది నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో టిటిడి వ్యవహారాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతోనే ఈ విధమైన ఆరోపణలు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తదితరులుటిడిపి పాల్గొని భూమన వ్యాఖ్యలను ఏకగ్రీవంగా ఖండించారు.

తిరుపతి

కారాకొల్లులో రోడ్డుపై బహిరంగ కల్లు విక్రయాలు–మహిళల భద్రతపై ఆందోళన

తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు గ్రామానికి వెళ్లే రహదారిపై బహిరంగంగా కల్లు విక్రయాలు జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోడ్డుపైనే విక్రయాలు జరుగుతుండటంతో మందుబాబులు మహిళలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు మహిళలు వాపోతున్నారు. ఇంతకుముందు గ్రామ శివారు ప్రాంతాల్లో జరిగే ఈ విక్రయాలు ప్రస్తుతం ప్రధాన రహదారిపైకి మారడంతో సమస్య మరింత తీవ్రతరమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి కారాకొల్లు గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించే మహిళలు రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి రోడ్డుపై బహిరంగంగా జరుగుతున్న కల్లు విక్రయాలను అరికట్టి మహిళల భద్రతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

యువకుడు అదృశ్యం – ఆచూకీ కోసం కుటుంబసభ్యుల విజ్ఞప్తి

తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రౌతు సూరమాల గ్రామానికి చెందిన కుమార్ (28) అనే యువకుడు గత పది రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి రాలేదని, బంధుమిత్రుల వద్ద కూడా ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఎటువంటి సమాచారం లభించలేదు. ఇతని ఆచూకీ తెలిసిన వారు దయచేసి 9177299395 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు వినతిచేస్తున్నారు.

తిరుపతి

ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ – మార్చి 31 వరకు ప్రత్యేక అవకాశం

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు మునిసిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో పాత బకాయిలపై 50 శాతం వడ్డీ మినహాయింపు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రాయితీ పథకం 2026 మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని, గడువు ముగిసిన అనంతరం వడ్డీతో పాటు జరిమానాలు పూర్తి స్థాయిలో విధించబడతాయని హెచ్చరించారు. అందువల్ల ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్షణమే తమ బకాయిలను చెల్లించాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి ఆస్తి పన్ను కీలక వనరుగా ఉంటుందని పేర్కొన్న కమిషనర్, ప్రతి పౌరుడు తన బాధ్యతగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

తిరుపతి

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపె కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎస్.వి.ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, కెరీర్ అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా సెట్విన్ సంస్థ సౌజన్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. నరసింహ వర్మ అధ్యక్షత వహిస్తూ, విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటేనే విజయం సాధ్యమవుతుందని సూచించారు. అనంతరం సెట్విన్ తిరుపతి జిల్లా సీఈఓ మోహన్, కెరీర్ గైడెన్స్ మోటివేటర్ ఎన్.ఎస్. రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ..వ్యక్తిత్వ వికాసం, పాజిటివ్ థింకింగ్, లక్ష్య నిర్ధేశం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పింస్తూ.. విద్యార్థులకి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో లభించే వివిధ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా స్పందించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డా. రమేష్ బాబు సమన్వయం చేయగా, అధ్యాపకులు డా.వి. మునయ్య, రాజేంద్రుడు, డా. చంద్రమౌళి, డా. సతీష్, డా. సాయి వెంకటేష్, రామ సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు

ఏపీలో గ్యాస్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు

*ఏపీలో ఎంత గ్యాస్ ఉంది.. ఎన్ని రోజులు సరిపోతుంది.? వివరాలు వెల్లడించిన చంద్రబాబు* ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. దీంతో దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ.. వినియోగదారులు మాత్రం పానిక్ బుకింగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ నుంచి గ్యాస్ సరఫరా అంశంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో పాటుగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ప్రస్తుతం14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి వస్తోందని.. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజలకు తక్షణమే అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాల గురించి అధికారులు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్ పెంచాలని ఆదేశించారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ ఈ కేవైసీ, ఓటీపీల ద్వారా చేపట్టాలని చంద్రబాబు గ్యాస్ ఏజెన్సీలు, కంపెనీలకు స్పష్టం చేశారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. గ్యాస్ కంపెనీలు కొన్నిరోజులు ఉత్పత్తిని పెంచాలని.. మెరుగైన పంపిణీ చేపట్టాలని సూచించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే సహజవాయువును పైప్డ్ నెట్‌వర్క్ ద్వారా సరఫరా చేసే అంశాన్ని ఆలోచన చేయాలని సూచించారు. అలాగే సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ వినియోగం పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు నాయుడు సమీక్ష సందర్భంగా అధికారులకు సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు జాబ్ మేళా విజయం – 1075 మందికి ఉద్యోగ అవకాశాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మనుబోలులో రూ.2000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చారని, ఇందుకు 240 ఎకరాలు భూమి పరిశీలనలో ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో నేడు విశేష హోమాలు.. అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు!

చిట్వేల్ మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో నేడు (బుధవారం) అమావాస్య పుణ్యదినాన్ని పురస్కరించుకుని భక్తుల సంక్షేమం కోసం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. హోమాలు విఘ్నేశ్వర అనుగ్రహం కోసం గణపతి హోమం. గ్రహ దోష నివారణార్థం నవగ్రహ హోమం.శక్తి స్వరూపిణికి భద్రకాళీ హోమం. లోక కల్యాణం కోసం శ్రీ వీరభద్ర స్వామి హోమం.అభిషేకం హోమం అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా కళాశాభిషేకం నివేదన:స్వామివారి దర్శనం అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం మరియు తీర్థప్రసాద వినియోగం.స్వామివారి ఆశీస్సులతో రాత్రి 8:00 గంటల నుండి భక్తులందరికీ మహా అన్నప్రసాదం (అన్నదానం) ఏర్పాటు చేయబడింది.ఈ పవిత్ర అమావాస్య రోజున నిర్వహించే హోమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలిలో కార్డన్, సెర్చ్

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీసులు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, కొత్తగా ప్రాంతానికి వచ్చిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.