Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

‌మన సంస్కృతికి మనమే శత్రువులం

నైటీలే అసలుకు ఎసరు చీరకట్టు ఎవరు కట్టినా అందంగా ఉంటుంది మందు తాగని వారు వెధవలంటున్న కుర్రకారు ప్రపంచీకరణ(గ్లోబలైజేషన్‌) ‌వల్ల ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెల్సిపోతోంది. ఇంతవరకు ఇబ్బందిలేదు. మనం ఇప్పుడు ప్రపంచ పౌరులం. ఇది గొప్ప భావన. ఎవరూ కాదనలేనిది. మానవత్వంతో బతకడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అన్నది మహనీయుని మాట. ఇప్పుడు విదేశాల సంగతి దేవుడెరుగు స్వదేశంలోనే మనల్ని మనం మరచిపోయాం. అద్భుతమైన సంస్కృతిని ధ్వంసం చేసుకుంటున్నాం. మన ఆచారాలు, ఆహారపు అలవాట్లు, పండుగలు, కట్టు బొట్టు ఇదంతా మన సంస్కృతి. మన వారసత్వం. తరతరాలుగా లభించిన గొప్ప సంపద. తరగని ధనం. మనం తెలుగువాళ్లం. గొప్ప సంస్కృతికి వారసులం. కులమేదైనా మతమేదైనా మనమంతా ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడున్నా మన ఆచారాలు, పండుగలు ప్రత్యేకం. ఏమిటి ప్రత్యేకత: తెలుగు సంస్కృతి గురించి అంతగా బాధపడాల్సిన అవసరం ఏమిటి?. ఏముంది ఇందులో అని కొందరు ప్రశ్నించినా ఆశ్యర్యం లేదు. నాగరికత ముసుగులో మన సంస్కృతి ధ్వంసమవుతోంది. పాతికేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే మనం చాలా మారిపోయాం. ఏవిధంగా అనేది పరిశీలిద్దాం. ఇప్పుడు మన కట్టుబొట్టూ మారిపోయింది. పట్టణాల్లోగాని, పల్లెటూళ్లలోగాని చక్కటి చీరకట్టు, లంగావోణిలు కనిపించేవి. మరిప్పుడో చీర మరుగున పడిపోయి పంజాబి డ్రస్సులు, నైటీలే కనిపిస్తున్నాయి. పంజాబి డ్రస్సుల వల్ల నష్టమేమిలేదు. నైటీలే అసలుకు ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఇవి పాశ్చాత్యులు రాత్రి మాత్రమే ధరిస్తారు. పగలు నిషిద్ధం. మరి మనమో పగలు కూడా ఇవే ధరిస్తున్నాం. ఇది కేవలం నగరాలు, పట్టణాలకే కాదు పల్లెలకూ సోకింది. ఇప్పుడు ఏ నీళ్ల పంపు దగ్గర చూసినా , ఏ నలుగురు ఆడంగులు చేరినా ఎక్కువ మంది నైటీలు ధరించే కనబడుతున్నారు. ఇది చూస్తే మనస్సు కలుక్కు మంటోంది. ఏమిటిది మనం ఎక్కడికి చేరిపోయాం, ఎటువైపు పయనిస్తున్నామో అర్థం కావడం లేదు. చీరకట్టు ఎవరు కట్టినా అందంగా ఉంటుంది. అదే నైటీ ఊబకాయులు, వృద్ధులు ధరిస్తే వికారంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనో, అది ఇంటి వరకైతే కొంతమేలే. కాని వీధుల్లో అదీ పగలు దర్శనమిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఇదిప్పుడు సర్వసాధారణంగా మారుతోంది. చక్కటి చీరకట్టుకు లంగావోణికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది మనసును కలచివేసే విషయం. మన కట్టూబొట్టూ సంస్కృతిపై దాడి. ఈసందర్భంగా ఒక ముఖ్యమైన నా గతాన్ని చెప్పాలి. నేను ప్రాధమిక పాఠశాల బిట్రగుంటలో చదువుకున్నాను. అప్పుడు మా స్కూలు చుట్టు ఆంగ్లో ఇండియన్స్ ఇళ్లుండేవి. వాళ్లు రాతుళ్లు నైటీలు, పగలు గౌన్లు ధరించేవాళ్లు. అవి మా చిన్న్నికళ్లకు విచిత్రంగా కనిపించేవి. మేము ఉదయాన్నే స్కూలుకు వెళ్లేటప్పటికి వాళ్లు నైటీలపైనే ఉండే వాళ్ల వేషధారణ గురించి మా వయసులో ఉన్న వాళ్ల పిల్లల్ని మేము వెక్కిరించేవాళ్లం. వాళ్లు పాపం ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది వాళ్ల సంస్కృతి. వాళ్లేం చేస్తారు. కాని మస సంస్కృతి అది కాదే. మన చీరకట్టు అద్భుతమైనది. లంగావోణి ప్రశస్తమైంది. మనకా సంగతి తెలియడం లేదు. పగలు నైటీలేంటంటే సుఖంగా ఉందని కొందరు చెబుతున్నారు. నెల్లూరు మూలాపేటకు చెందిన సుబ్బమ్మ అనే ఒకావిడను ప్రశ్నిస్తే ఏం చెప్పిందంటే అది సుఖం కాదు బాబు వళ్లు బద్దకమని. ఇక తాగుడు: గతంతో పోలిస్తే ఇప్పుడు మద్యం వినియోగం బాగా పెరిగింది. ఇది మన సంస్కృతిలో లేనిది. పండుగలు పబ్బాలకు కల్లు, కాచిన సారానే తాగేవాళ్లం. అదీ అరుదు. గిరిజన తెగలను మినహాయిస్తే మిగతావారు తాగితే అతన్ని తక్కువ భావనతో చూసేవారు. తాగుబోతని పిలిచేవారు. పిల్లనిచ్చేవారు కాదు. మరిప్పుడు దీనికి ఎవరూ అతీతులు కాదన్నట్లు మారిపోయింది. ప్రభుత్వాలకు డబ్బులు కావాలి, జనం నాశనమైనా పర్వాలేదు. ఆ వచ్చిన డబ్బులతో వారికి అభివృద్ధి చేస్తారట. తాగుబోతుల కుటుంబాల్లో ఇల్లాలు, పిల్లలు పడే బాధలు ఇప్పటి నేతలకు ఎలా అర్థమవుతాయి.వారు పడే నరకయాతనను ఎలా విలువ కడతారు. షేక్‌ ‌ఫయాజ్‌ ‌బాషా, నెల్లూరు

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

పిల్లలు – తల్లిదండ్రులు

పిల్లల పై మనకి ఉన్నది హక్కా? పిల్లలను గౌరవించాలంటే ముందు తన పై తనకు గౌరవం వుండాలి. ముఖం మీద కొట్టినట్లుగా రియాక్ట్ అవ్వటం పిల్లలను మీ నుంచి దూరం చేస్తుంది. ఎంతో ప్రేమతో పెంచి, ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను గౌరవించలేని సమాజం ఎందుకు తయారవుతుది? ఎంతో ప్రేమగా పెంచిన పిల్లలు అనామకులతో లేచిపోయేది ప్రేమ కోసమా లేక తల్లిదండ్రుల పై పగ కోసమా? పిల్లల పై మనకి ఉన్నది హక్కా? బాధ్యతా అని ప్రశ్నించుకుంటే బాధ్యత మాత్రమే. హక్కు అన్నది భ్రమ మాత్రమే. కానీ మీరు ఏది ఇవ్వాలి అన్నది మీ చేతుల్లో లేదు. మీ దగ్గర ఉన్నది మాత్రమే మీరు ఇతరులకు ఇవ్వగలరు. అసలు మీ దగ్గర ఉన్నది ఏమిటో మీకు తెలియాలిగా? పిల్లలను గౌరవించాలంటే ముందు తన పై తనకు గౌరవం వుండాలి. సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌తక్కువ ఉన్నవారే పిల్లల పై చీటికి మాటికీ గొంతు పెంచుతుంటారు. పిల్లలు దేముళ్ళని చెప్పే పెద్దలే ఇన్ని తిట్లు తిడుతుంటే, ఇక వారిలోని దైవత్వాన్ని మిగులుస్తారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన విధంగా మీ పిల్లల్ని పెంచలేరు. ఎందు కంటే ఆ తరం వారు పిల్లలంతా మంచి వారుగా ఉండాలని తాపత్రయ పడేవారు. బాగా చదువు కోవడం, ఎదురు సమా ధానాలు చెప్పక పోవడం, చెప్పిన మాట వినడం, బుద్ధిమం తుల లక్షణంగా భావిం చే వారు. ఎవరైనా అలా లేనప్పుడు, వీడు ఎందుకూ పనికిరాడు పక్కవారిని చూసి బుద్ధి తెచ్చుకో, నిన్ను చూస్తే మాకు సిగ్గే స్తుంది లాంటి తిట్లతో తిట్టడం వల్లే ఈ నాడు కోట్లాది మంది తమది కాని పనిలో బతుకు బండి లాగిస్తూ తమ అసలైన తత్వం ఏదో తెలియకుండానే జీవించి ఉండగానే మరణించేస్తున్నారు. పిల్లలు చెపుతున్నది వినిపించుకోకుండా, వెంటనే మీ తీర్పు ప్రకటించటం, ముఖం మీద కొట్టినట్లుగా రియాక్ట్ అవ్వటం పిల్లలను మీ నుంచి దూరం చేస్తుంది. వారు స్కూళ్లో జరిగినదేదైనా చెప్పినప్పుడు నువ్వే ఏదో చేసుం టావు అని ప్రతిపక్షంలా అనుమానించటం కాకుండా, పూర్తిగా సావధానంగా వినాలి. ఒక వేళ పిల్లలదే తప్పయితే, అంతా విన్న తర్వాత, ఆవేశపడిపోకుండా, మంచి చెడులు వాటి పర్యవసానాలు వివరించాలి. ‘మేం క్లాసు ఎగ్గొట్టి సినిమాకి వెళ్లాం అనగానే, మీ కోపం నషాళానికి చేరడం వల్ల, వాళ్ళు రేపట్నించి అటువంటి పనులు చేయడం మానరు… కానీ మీకు చెప్పడం మానేస్తారు. పిల్లల్ని విమర్శించడం, నిందించడం, ఖం డించడం, ఫిర్యాదులు చేయడం చేయ నప్పుడు మీతో అన్నీ చెప్పడానికి ఇష్టపడతారు. పిల్లలకు తప్పు, ఒప్పులు మధ్య వ్యత్యాసాన్ని వివరించ డానికి వారు తప్పు చేసినప్పుడు గొప్ప అవ కాశం లభిస్త్తుంది. భవిష్యత్‌లో నేడు చేసే పనుల పర్యవసానాలని వివరించడమే పిల్లలు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. పిల్లలకు క్రమశిక్షణ బలవంతంగా అలవాటు చేయడం సాధ్యమవ్వని పని. మనం దరికి ఏది వద్దంటే అదే చేయాలనిపించడం సహజం. మీరు కోతి గురించి ఆలోచించకండి అనగానే కోతి మదిలో దర్శనమిస్తుంది. పిల్లలను గైడ్‌ ‌చేయాలి, కంట్రోల్‌ ‌చేయ కూడదు. ఎవరూ వేరే వారి నియంత్రణకు లోబడి పని చేయడాన్ని ఇష్టపడరు. ఎవరైనా తమను ప్రోత్సహించే వారిని, తమ విజయానికి తోడ్పడేవారిని, ఓటమిలో నిల బడే వారిని, అతిగి విమర్శిం చని వారిని ఇష్ట పడతారు. మీరే దైనా తప్పు చేస్తే మీ పై బాసు ఎలా ప్రవర్తించాలని కోరుకుం టారో, అలాగే పిల్లలు తప్పు చేసి నప్పుడు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే వారి హృదయా లను గెలువ గలుగుతారు. బద్దిపూడి శీనయ్య, నెల్లూరు  

Featured ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్

కాంట్రాక్టు ఉయోగాలకు పెరిగిన ఆదరణ ( కోవిడ్ లాక్ డవున్ తరువాత )

” క్యారీర్ నిర్వహణ ” మనలో చాలా మంది స్వయం ఉపాధి కంటే , చిన్న వ్యాపారానికంటే , చిన్నదో పొన్నదో , నెలకింత వచ్చే ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తాం . ఇది తప్పు కానే కాదు , దీనికి కారణం లేక పోలేదు . మనకి నెలవారీ ఖర్చులు , ఇంటి అద్దె, పాలు, పేపరు , వెచ్చాలు, కూర గాయలు, పిల్లల ఫీజులు , అన్నీ , నెలకింత అని ఫిక్సెడ్ గా ఉంటాయి . కాబట్టి నెలకింత అని వస్తే, ఖర్చులకు కేటాయించి , మిగిలినా మిగలక పోయినా, అదో మనశ్శాంతి పెళ్ళి కాని యువకులకు కూడా, స్వయం ఉపాధి / చిన్న వ్యాపారం అంటే, పిల్లను ఇవ్వడం కూడా కష్టమే ! ” బిజినెస్సా ? వద్దులే ! ఉద్యోగస్తుడిని చూడండి డ్యాడీ ! ” అనే అమ్మాయిలు కూడా ఎక్కువే. కానీ, ఇదంతా, కరోనా ముందరి వ్యవహారం ! మానవ జాతి ఇటీవలి చరిత్ర ను ‘ కరోనా కి ముందు, తరువాత ‘ అని విభజించుకోవాల్సిన పరిస్తితి . ఇప్పుడు పనులు లేవా ? అంటే ఉన్నాయి . కానీ , ఉద్యోగాల రూపం లో కాక,  కాంట్రాక్టు పనుల ‘ రూపం లో ఉన్నాయి . దీనిని ఇటీవలి ఇంగ్లీష్ లో ‘ గిగ్ వర్క్ ‘ అంటారు . కాంట్రాక్టుల మీద పెద్ద ఆర్ధిక వ్యవస్థే ఉంది . లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి . దీనిని ‘ గిగ్ ఎకానమీ ‘ అంటున్నారు .ప్యాండమిక్ తరువాత, ఈ కాంట్రాక్టు పనులకు, అనగా, ఈ గిగ్ వర్క్ లకు గిరాకీ పెరిగిందట .దాదాపు 20% నుంచి 25% పెరిగిందట . ఎలాంటి పనులకు ? చూద్దాం . ఉదాహరణ కి ఒక వ్యక్తి సేల్స్ ఆఫీసర్ గా పని చేస్తూ , ఉద్యోగం కోల్పోయారు అనుకోండి , కరోనా వల్ల .మరొక కంపెనీ లో సేల్స్ / మార్కెటింగ్ ఉద్యోగం కోసం అప్లయి చేసీ చేసి, వేచి ఉండి సుదీర్ఘ కాలం నిరీకించే కంటే , ఏదో ఒక కంపెనీ వారితో మాట్లాడి , తాను అమ్మ గలిగిన ప్రాడక్టు ని ‘ కమిషన్ బేసిస్ ‘ మీద తీసుకుంటే మంచిది . చిరుద్యోగాలూ దొరకడం కరువైన వేళ, నిరుద్యోగం తో బాధ పడడం కంటే, ఇలా కమిషన్ ఆధారిత సంపాదన కోసం చూడడం మంచిది. కొంత కంప్యూటరు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి , కాంట్రాక్టు పనుల గిరాకీ పెరిగింది . ఉదాహరణకి వెబ్ డిజైనరు లు , కంటెంట్ రాసే వారు , డాటా అనాలిసి స్ చేసే వారు , డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ , యాప్ లు డెవలప్ చేసే వారు , సైబర్ సెక్యూరిటీ చూసే వారు , మరియు కోడింగ్ చేసే వారు వీరికి డిమాండు పెరిగింది . కాంట్రాక్టు పనుల రూపంలో. గిగ్ వరకు చేసే వారికి మరో సౌకర్యం కూడా ఉంది . ఉద్యోగం లో ఉండే ఆరోగ్య బీమా , ఇతర భత్యాలు అలవెన్సు లు లేనప్పటికీ  – ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు . రోజు ఆఫీసు కి వెళ్లే పని లేదు . పెళ్లి అయి పిల్లలు ఉంది ,  ఉద్యోగం సంపాదన అవసరం ఉన్న మహిళలకు కాంట్రాక్టు పనులు సూట్ అవుతాయి .అలానే, ఒక మంచి ఐ టి కంపెనీ లో అకౌంటెంటు గా ఉండి, ప్యాండమిక్ కారణం గా  ఉద్యోగం  కోల్పోయిన మిత్రుడు , జి ఎస్ టీ , టాక్సేషన్ పనులు నేర్చుకుని , ఒక పది షాపు లకు ఆ గి ఎస్ టి పనులు చేస్తున్నాడు. 3 నెలలకు ఒక సారి ఫీజులు ఇస్తారు . ప్రయివేటు స్కూలు / కాలేజీ ఉపాధ్యాయ బృందం , ట్యుషన్ లు చెప్పడం ప్రారంభించారు. కాబట్టి,  ఈ ప్యాండమిక్ కారణం గా మీరు ఉపాధి కోల్పోయి ఉంటే, అదే పనిని ఉద్యోగ రూపం గా కాకుండా , గిగ్ వర్కు రూపం లో చేయ గలరేమో ప్రయత్నించండి . ఇది ఉద్యోగానికి ప్రత్యామ్నాయం కాదు కానీ, నిరుద్యోగం కంటే మేలు.వ్యాపారం పెట్టిన వారి దృష్టి నుంచి ఆలోచిస్తే, లాభం వచ్చినా రాకున్నా , నెలకింత అని ఇవ్వాలంటే  వారికీ కష్టం . పని జరిగితే నే, ఆ పని ద్వారా ఆదాయం ఉంటేనే, పేమెంటు – అనే పద్ధతి వారికీ ఆమోద యోగ్యం కావచ్చు.ఇప్పుడున్న పరిస్థితులలో మన ప్రిఫరెన్సులు పక్కన పెట్టి, ఏ పని దొరికినా స్వీకరించడం మేలు. పని లో పని గా , కొత్త నైపుణ్యాలను పెంపొందిచు కోవడం కూడా.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

పరోపకారం సహజంగా పుట్టాలి

పరోపకారం సహజంగా పుట్టాలి మేఘము దగ్గర నీరు లేనప్పుడు, సము ద్రుని వద్దకు వెళ్ళి నీటిని తెచ్చి లోకానికి వర్షమును ఇస్తుంది. అలాగే పరోపకారం చేసి తీరాలనే కోరికగల దాత, తన దగ్గర లేకపోయినా ఏదో ఒక విధంగానైనా దానం చేసి తీరు తాడు. అంటే తాను కష్ట సమ యంలో ఉన్నప్పుడు కూడా అడిగిన వారికి లేద నక ఇవ్వడమే నిజమైన దాత లక్షణం. కర్ణుడికి గొప్ప దాత అని పేరు రావడం గమనించిన దుర్యోధనుడు తన భవనం ముందు కూడా ఒక దాన ఘంటను కట్టించాడు. దానిని మోగించిన వారికి ఏమి కావా లంటే వాటిని సమకూరుస్తానని ప్రకటించాడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు దుర్యో ధనుని దర్శించి, తన కూతురు పెండ్లికి అవసర మయ్యే వంట చెరకును అనుగ్ర హించమని ప్రార్థించాడు. బంగారాన్నో, ధనాన్నో కోరక కేవలం బండెడు కట్టెలను అడిగిన ఆ వెర్రి బాపని అవివేకానికి నవ్వు కొన్న దుర్యోధనుడు వెంటనే తీసుకు వెళ్ళమన్నాడు. అందుకా బ్రాహ్మణుడు ‘‘ మహారాజా! మా ఇల్లు చిన్నది. అందువలన నిలువ చేసుకొనే సౌకర్యం లేదు. అవసర మైనపుడు నేనే వచ్చి తీసుకు పోతాను. ప్రస్తుతానికి తమ మాట చాలు’’! అని చెప్పి సెలవు తీసుకున్నాడు. కొన్ని నెలలు గడిచి పోయాయి. దుర్యోధనుడు ఈ విషయం పూర్తిగా మరిచిపోయాడు. వర్షాకాలం ప్రారంభమైంది. విడవకుండా కురుస్తున్న వర్షాల వలన ఏరులన్నీ ఏకమైనాయి. ఎక్కడా ఎండు కట్టెలన్న మాట కూడా వినబడని పరిస్థితిలో ఈ బ్రాహ్మణుడు ప్రత్యక్షమై, తన బండెడు ఎండు కట్టెలను ఇప్పించమని ప్రార్థించాడు. నివ్వెరపోయిన దుర్యోధనుడు, ‘బ్రాహ్మణోత్తమా! వాతావరణ పరిస్థితిని గమనించావు కదా! కొంచెం ఎండ వచ్చేంత వరకు ఓపిక పట్టు. నీ కోరిక తప్పక నెరవేరు స్తాను’’ అని చెప్పాడు. కానీ అతడు తన కూతురి పెళ్ళి కోసం అప్పుడే వంట చెరకు అవసరమని చెప్పడంతో దుర్యోధనుడు నిస్సహాయుడైనాడు. అక్కడ నుండి సరాసరి కర్ణుని మందిరం చేరుకున్న విప్రుడు తన కథ నంతా వినిపించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న కర్ణుడు వెంటనే పనివారిని పిలిపించాడు. తన రాజభవనంలో కొంత భాగాన్ని పగులగొట్టించాడు. భవన నిర్మాణానికి వాడిన మంచి చందనం, టేకు దూలాలను, తలుపులను ఒక బండి పై పేర్పిం చాడు. అవి తడవకుండా వాటి పై ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేయించాడు. ఆ బండిని క్షేమంగా బ్రాహ్మణుని ఇల్లు చేర్చమని భటులను పురమాయించాడు. ఆనందంగా బండితో ప్రయాణిస్తున్న బ్రాహ్మణుని చూచిన దుర్యో ధనుడు విషయాన్ని కనుగొన్నాడు. కర్ణుని దాన శీలతకు ఆశ్చర్య పోయి, మనసారా అభినం దించాడు. ‘దాన గుణం అనేది సహజంగా పుట్టవలసినదే కాని ఒకరిని చూచి అనుకరించేది కాదని గ్రహించి, తన వాకిట కట్టిన ఘంటను విప్పి వేయించాడు. నిజానికి దుర్యోధనుని దగ్గర ఉండే ఏ వాడని గుర్రపుశాలో, గోశాలో చాలు బ్రాహ్మణుని అవసరం తీరడానికి! కానీ ఆ ఆలోచనే అతనికి రాలేదు. అందుకనే అందరూ దాతలు కాలేరు. ఆ ఘనత కొంత మందికే దక్కింది. పేరు కోసం, గొప్ప కోసం, పోటీల కోసం దానాలు చేసే మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టి, పరోపకారానికి దానం చేసే బుద్ధిని పెంపొందించుకొందాం. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనంత గుప్తంగా పరులకు సహాయం చేద్దాం. ఆ ఆర్తుల రూపంలో వున్న నారాయణునికి సమర్పిస్తున్నామన్న భావ నను కలిగివున్నప్పుడు తప్పక ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమౌతాం. టి.వి.శ్రీధర్‌, ‌గూడూరు.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

చరిత్రలో శ్రీనివాస మంగాపురం

తనివితీరా స్వామివారిని దర్శించుకోవాలంటే మంగాపురం వెళ్లాల్సిందే ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. వేంకటాద్రి పర్వతానికి సమానమైనది బ్రహ్మాండలోకాల్లో లేదనని, శ్రీవారికి సమానమైన దేవుడు గతంలో కాని, భవిష్యత్‌లో కాని ఉండరని పెద్దలంటారు. అంతటి మహిమగల భగవానుణ్ణి దర్శించుకోవడం అంత తేలిక విషయం కాదు. వ్యయ ప్రయాసల సంగతులటుంచి, తృప్తి తీరా దర్శనం చేసుకునే వీలువుండదు. గంటల కొద్ది క్యూలో నిలబడ్డ తర్వాత దర్శనం లభించేది కొద్ది క్షణాలు మాత్రమే. ఆ క్షణాల్లోనే భక్తులకు అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది. పడిన శ్రమంతా మరిచిపోతారు. మళ్ళీ ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా? అని ఎదురుచూస్తుంటారు. వీలు చిక్కగానే మళ్ళీ తిరుమలకు ప్రయాణం కడుతుంటారు. అయితే తృప్తిదీరా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే మార్గం వుంది. అదేమంటే వేంకటాద్రి పర్వతాన్ని తాకుతున్నట్టుగా శ్రీవారి పాదాల చెంత, శ్రీవారికి ప్రతి రూపంగా వున్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వుంది. మూలవిరాట్టు ముందు నిలబడి నిలువెత్తు సుందర మైన ఆ విగ్రహాన్ని ఎంత సేపైనా దర్శించుకోవచ్చు. అదే శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీపద్మావతిదేవితో నారాయణ వనంలో వివాహం జరిగిన పిమ్మట ఈ ప్రాంతంలో శ్రీనివాసుడు కొంత కాలం నివసించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. పరిణయ అనంతరం కళ్యాణ వేంకటేశ్వరుడైన శ్రీవారు పద్మావతితో కలిసి వస్తూ తొండవాడ ఆశ్రమంలో వున్న ఆగస్త్య మహామునిని దర్శించారు. అగస్త్యుని దర్శించుకున్న నవ దంపతులు కొండ ఎక్కడానికి వెళ్తుండగా అగస్త్యుడు పసుపు గుడ్డలతో కొండ ఎక్క కూడదని చెప్పాడు. అగస్త్యుని సలహా ప్రకారం ఆ కొత్త దంపతులు శ్రీనివాసమంగా పురం అనే ప్రాంతంలో ఆరు మాసాల పాటు నివసించారు. ఈ ‌సమయంలో వారు ప్రతి రోజు అగ స్త్యుని దర్శించుకునే వారు. గడువు పూర్తయిన పిమ్మట శ్రీవారు నడిచి వెళ్ళి తిరుమల చేరా రు. శ్రీనివాసుడు నివసించిన ఈ ప్రాంతం తర్వాత శ్రీనివాస మంగాపురం అయింది. అంతకు ముందు దాని పేరు సిద్దకూటమి. శ్రీవారు కొండపైకి నడిచిన దారి శ్రీవారి మెట్టు అయింది. కళ్యాణం తర్వాత ఆయన ఇక్కడ నివసించినందున కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధమైంది. దీన్ని ఎవరు కట్టించారన్నది ఇతమిద్ధంగా తెలియదు. అయితే ఈ ఆలయం శిధిలావస్థలో వున్నప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడైన చిన తిరుమలయ్య పునరుద్దరించారు. తిరిగి 1967లో టిటిడి వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1981 నుంచి టిటిడి వారే స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇటీవల ప్రహరీగోడ నిర్మించడం జరిగింది. ఆలయం ఎదుట కోనేరు నిర్మా ణం, ఆంజనేయస్వామి ఆలయం కట్టారు. రధాన్ని శాశ్వితంగా ఉంచడానికి ఒక షెల్టర్‌ ‌నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో రాళ్ళను పరిపించారు. టిటిడి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో కళ్యాణ మండపం కూడా నడు స్తోంది. తిరుపతి, మదనపల్లి రహదారిని ఆనుకొని శ్రీవారి ఆలయం ఉంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ ఊరికి బస్సులు నడుస్తు న్నాయి. చంద్రగిరి నుంచి కూడా మరొక మార్గం వుంది. శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. 500 రూపాయల రుసుము చెల్లించి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రశాంత వాతావరణం, విశాలమైన ఆవరణం, అద్భు తమైన శిల్ప సంపద ఈ ఆలయ ప్రత్యే కతలు. ఆలయ నిర్మాణానికి పెద్ద పెద్ద బండ రాళ్ళను వాడారు. పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఉపయోగించారు. ఈ స్తంభాల పై పురాణ గాధలను దేవతామూర్తులను చెక్కారు. అన్నమాచార్యుల వంశం వారి శిల్పాలు కూడా స్తంభాల పై కనిపిస్తాయి. నిలువెత్తు ద్వార పాలకుల విగ్రహాలు గర్భగుడి ముందు దర్శనమిస్తాయి. అన్నమాచార్యుల వారి పూజా సామాగ్రి, ఆయన పూజించే దేవతా విగ్రహాలు ఈ ఆలయంలో ఇటీవల వరకు ఒక చెక్క బోషాణంలో వుండేవి. ఇప్పు డు అవి టిటిడి వారి ఆధీనంలో వున్నాయి. ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ఎక్కువగా విజయనగర ప్రభువుల కాలంలో అభివృద్ధి జరిగినట్లు తెలుస్తుంది. సూర్యచంద్రులు, హంస లాంటి శిల్పా లు స్తంభాల పై కన్పిస్తాయి. హైదరాలీ దాడిని ఈ దేవాలయం 17వ శతాబ్దంలో ఎదుర్కొని నిలబడింది. ఈ ఆలయం పై దాడి తరువాత హైదరాలి అనారోగ్యంతో మరణించాడని చెప్తుంటారు. తొండవాడ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతులతో, అద్భుతమైన అలంకరణలతో వేంకటేశ్వర స్వామి విగ్రహం అలరారుతూ వుంటుంది. ఎంత సేపు దర్శించుకున్నా తనవి తీరని సౌందర్యం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారిది. ప్రశాంతంగా ఎక్కువ సేపు స్వామి వారి ముందు నిలబడి ధ్యానించు కోవాలన్న కోరిక వున్నవారు ఈ ఆలయాన్ని తరచూ దర్శించుకొని తన్మయత్వం పొందవచ్చు. డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌, ‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు. సెల్‌ : 9441895343

Featured ఆంధ్రప్రదేశ్ సక్సెస్ స్టోరీస్

సాధించాలనే తపన ఉంటే అన్నీ సాధ్యమే

  మనిషి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా బద్దకాన్ని వదిలివేయాలి ఎవరి జీవితం స్ఫూర్తిదాయ కమో ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వదమో అతడే విజేత. తపన లేకుండా ఏ ఒక్కరు ఏ పనిని సాధించలేరు చేయాలనే పట్టుదల, సాధించాలనే తపన మనిషిని దేన్నయినా సాధించే స్థాయికి తీసుకెళ్తాయి. దాదాపు 100 సం।। క్రితం గాలిలో ఎగరడం అసాధ్యం. మరి ఆనాడు గాలిలో ఎగరాలన్న ప్రయత్నం రైట్‌ ‌సోదరులు చేయకుండా అసాధ్యం’ అని సరిపెట్టుకుని ఉంటే ఈ రోజు మానవుడు విమానంలో ప్రయాణించ గలిగేవాడా. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన ‘ఎడిసన్‌’ ఇక బల్బు కనిపెట్టలేము అనుకుని ఉంటే ప్రపంచం ఇప్పటికీ అంధకారంలో ఉండదా ఇవి ఉదాహరణలు మాత్రమే. ప్రయోగాలు-శాస్త్రవేత్తలు అన్ని మీకు తెలిసినవే ఇక్కడ మన ఉద్దేశ్యం శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు కాదు. ఆచరణ-ఆశయసాధన. మనిషి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా బద్దకాన్ని వదిలివేయాలి ఏదైనా ఒక దానిని సాధించాలనే తపనను మనసులో ఉంచుకోవాలి. దానిపై సాధిస్తామనే నమ్మకం పెట్టుకోవాలి. దాని కోసం కృషిచేయాలి శ్రమిం చాలి పని పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఫలితం కోసం ఎదురు చూడాలి. బ్రతికున్న వారం దరిలో కెల్లా నేను తెలివైనవాడిని ఎందుకంటే నాకు ఒక విషయం తెలుసు అదేమిటంటే- నాకు ఏమీ తెలియదని’’ అన్నాడు సోక్రటీస్‌. ‌నేర్చుకోవాలన్న ప్రతి మనిషి, ముందుగా నాకు ఏమీ తెలియదనుకోవాలి. తెలుసుకునే మార్గాన్ని అన్వేషిస్తాడు తెలుసుకుంటాడు. సాధిస్తాడు. 19వ శతాబ్దపు బెసి స్టేన్లీ అనే కవయిత్రి విజయం గురించి ఈ విధంగా చెప్పింది ‘‘ విజయం సాధించే వాడు ఎవరంటే, బాగా జీవించినవాడు, ఎక్కు వగా నవ్విన వాడు, ప్రేమించబడినవాడు, మేధావులచే గౌరవింపబడినవాడు చిన్న పిల్లల ప్రేమ పొందినవాడు,తన మూల ప్రతిభకు సానపెట్టి అనుకున్నది సాధించినవాడు. ఈ భూమిని తను పుట్టినప్పటి కంటే మెరుగైన ప్రదేశంగా మార్చిన వాడు, భూలోక సౌంద ర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేనివాడు,ఇతరుల్లో ఉత్తమమైన దానికోసమే చూసి తన వద్ద ఉన్న ఉత్తమమైనదే వారికిచ్చినవాడు ఎవరి జీవితం స్ఫూర్తిదాయ కమో ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వదమో అతడే విజేత. జీవితాన్ని సార్ధకం చేసే ఒక పని అర్ధా న్నిచ్చే పని మీలో ప్రాణశక్తినిరగిల్చే పని సవాళ్ళు ఎదుర్కొనే సమయంలో కూడా మీ అసలైన తత్వాన్ని వ్యక్త పరిచేదే, అదే మీ అస లైన హృదయ సంబంధమైన పని అదే మీ తపన ప్రతి ఒక్కరిలో వారికే తెలియని ఒక గొప్ప టాలెంట్‌ ఉం‌టుంది. మీకు నిజ మైన ఆసక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మీకు ఏది సరియైనదో తెలియజెప్పే మీ మనస్సాక్షి యొక్క వాణిని మీరు వినగలగాలి మీలో తపనను జ్వలిపంజేసే ఒక పనిలో మీరు నిమగ్నమవ్వాలి ఆ పనిపట్ల మీలో తపన కలిగి ఉండాలి. తపనతో జీవించే వారు చైతన్య వంతమైన వ్యక్తిత్వంతో శోభిల్లు తారు. తపన లేకుండా ఏ ఒక్కరు ఏ పనిని సాధించలేదని గుర్తుంచుకోండి. అన్నింటి కంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఏదైనా సాధ్యం.  బద్దిపూడి శీనయ్య, నెల్లూరు

Featured ఆంధ్రప్రదేశ్ భక్తి

చరిత్రలో గుడిమల్లాం

భారతదేశ అతి ప్రాచీన శివాలయాల్లో ఇది ఒకటి పురుష లింగాకారంలో వుండే శివలింగం ఇక్కడి ప్రత్యేకత ప్రపంచంలోనే అరుదైన శివలింగం రేణిగుంటకు 15 కి.మీ. దూరంలో ఆలయం వుంది చిత్తూరు జిల్లాలో అతి ప్రాచీన శైవ క్షేత్రం గుడిమల్లాం. గుడిపల్లం కాలక్రమేణా గుడి మల్లాంగా మారింది. నెల్లూరు జిల్లాలో తిరుగుడుపల్లం కాలక్రమేణా తిరుగుడు మల్లాంగా మారి ప్రస్తుతం మల్లాంగా పిలవ బడుతున్నది. గుడి పల్లంలో వుండడం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చింది అని కొందరంటే పల్లవుల కాలం నాటి గుడి గనుక గుడిపల్లం అనే పేరువచ్చిందని మరికొందరంటారు. ఈ గ్రామం ఏర్పేడు మండలంలో వుంది. రేణిగుంటకు 15 కి.మీ.దూరంలోను, పాపా నాయుడు పేటకు 3 కి.మీ.దూరంలోను వుంది. ఇందులో వున్న ఆలయం పేరు పరశురామేశ్వర ఆలయం. భారతదేశంలో వుండే అతి ప్రాచీన శివాలయాల్లో ఇది ఒకటని చరిత్రకారుల అభిప్రాయం. ఇలాంటి ఆలయం నేపాల్‌లో కూడా ఒకటి వుందంటారు. క్రీ.పూ.రెండు శతాబ్దాలకు ముందర ఈ ఆలయం నిర్మించబడింది. క్రీ.పూ.50వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించబడి క్రీ.శ.1125లో పూర్తి చేయబడింది. ఈ ఆలయం శాతవాహనులకు సామంతులైన బాణులు కట్టారని కొందరి అభిప్రాయం. పల్ల వులు, చోళులు, యాదవులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. అప్పటి రాజభాషలైన ప్రాకృతము, పాళి భాష శాసనాలు ఈ ఆలయంలో నిలువెత్తు రాళ్ళ మీద కనిపిస్తాయి. ఆలయ గర్భగుడి గజపృష్ఠ ఆకారంలో కనిపిస్తుంది. గజపృష్ఠ అంటే ఏనుగు యొక్క వెనుక భాగం. దీనిని బట్టి కొందరు ముందు ఈ దేవాలయం బౌద్ద ఆరామంగా వుండి వుండవచ్చునని ఊహి స్తున్నారు. అంతేగాక పల్లంలో వున్న శివ లింగం చుట్టూ బౌద్ద నిర్మాణాలను పోలిన కట్టడాలున్నాయి. అందువల్ల బౌద్ద ఆరామంగా దీనిని ఊహిస్తున్నారు. మొత్తం మీద ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఎంతో పరి శోధన జరగవలసి వుంది. అప్పుడు గాని ఈ ఆలయాన్ని గురించిన పూర్తి వివరాలు తెలియవు. ఈ ఆలయ ప్రత్యేకత శివలింగం. మామూలు శివాలయాల్లో వున్న శివ లింగానికి ఈ ఆలయంలో వున్న శివలింగా నికి చాలా తేడా వుంది. అచ్చు మానవ పురుష లింగం ఆకారంలో ఈ శివలింగం చెక్కబడింది. ఎందుకలా జరిగింది అనేది అంతుపట్టని విషయం. ఈ విచిత్రమైన విషయాన్ని విన్న ప్రముఖ చరిత్రకారులు రాహుల్‌ ‌సాలంకృత్యాయన్‌ ఈ ఆలయాన్ని సందర్శిం చారు. ఇక్కడి నిర్మాణ శైలికి అచ్చెరు వొందారు. పడమటి వైపున గోడలో నగలు దాచ డానికి ఏర్పాటు వుంది. రాయిని జరిపితే లోపల పెట్టెలాగా కనిపిస్తుంది. అక్కడ అలాంటి నిర్మాణం వుందని ఎవరైనా చెబితే కాని మనం కనుక్కోలేము. దైవ ఆభరణాలను దాచడానికి శిల్పి చేసిన చమత్క ృతి అది. ఆలయంలో అనేక చిన్నచిన్న గుడులున్నాయి. వాటిలో సూర్య నారాయణ స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, పార్వతీ దేవాలయం మొదలైనవి ముఖ్య మైనవి. మన రాష్ట్రంలో అరసవెల్లి తరువాత సూర్య నారా యణ విగ్రహం ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది మరియు అనాదిగా ఆరాధనలను అందు కొంటుంది. ఇటీవల వరకు ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి రాజులు పోషిస్తూ వుండేవారు. ఉత్సవాలు జరు పుతూ వుండే వారు. ఈ మధ్య కాలంలో పురావస్తు శాఖ వారు ఆలయాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి పరుస్తున్నారు. ఆలయానికి వెనుక పెద్ద కోనేరు, ఉత్త రము వైపున వున్న బావి చాలా పురాతన మైనవి. ముప్పై ఏళ్ళ క్రిందట ఈ బావి నీటితో పొంగి ఆ నీరు గర్భగుడిలోకి వచ్చిందంటారు. శివలింగం మీద పరశురాముడు గండ్రగొడ్డలి చేతబూని కనిపిస్తాడు. ఆ దిగువన బ్రహ్మ చెక్కబడి వున్నాడు. మహాశివరాత్రి ఉత్సవాల ను, కార్తీక సోమవారం, శ్రావణ శుక్రవారం అభిషేకాలను ప్రస్తుతం జరుపుతున్నారు. దేశం లోని పలు ప్రాంతాల నుంచి ఈ వింత ఆలయాన్ని చూడడానికి జనం వస్తుంటారు. ఆల యంలో డమరుక శబ్దం వినపడుతూ వుంటుం దని, మూలవిరాట్‌ ‌దగ్గర అర్ధరాత్రి గజ్జెల శబ్దం వినిపిస్తుందని, ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలో వింత శబ్దం వినపడుతుందని స్థానికులు కథలు కథలుగా చెపుతుంటారు. ఒకసారి ఆలయాన్ని శుద్ధి చేయడానికి పురావస్తుశాఖ వారు రసాయనాలు చల్లారు. ఆ విషయం తెలియని భక్తులు కర్పూరం వెలిగించారు. పెద్ద అగ్ని ప్రమా దం ఆలయంలో జరిగింది. ఆ ప్రమా దంలో నలుగురు చనిపోగా మరికొంత మంది గాయపడ్డారు. ఇది ఆలయ చరి త్రలో ఒక విషాదం. మొత్తం మీద ఒక గొప్ప చారిత్రక నేపథ్యం గల ఆలయం గుడిమల్లాం పరశురామేశ్వరాలయం. ఇంత మారుమూల గ్రామంలో అప్పుడు ఇంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని ఎందుకు నిర్మించారా? అని సందేహం కలుగుతుంది ఎవరికైనా! ఈ ప్రశ్నకు జవాబుగా ఒకప్పుడు స్వర్ణముఖి నది ఒడ్డున వున్న పెద్ద పట్టణం ఈ ఊరని స్థానికులు అం టారు. ఇది నిజమే అయివుండవచ్చని అనిపిస్తుంది. డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌, ‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు. సెల్‌ : 9441895343

Featured

జాతీయ యువజన దినోత్సవం :కెప్టెన్ GS యుగంధర్ రెడ్డి

10 ఆంధ్రనావల్ యూనిట్ NCC కమాండింగ్ ఆఫీసర్, కెప్టెన్ GS యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ” జాతీయ యువజన దినోత్సవం జరిగినది కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12- 01 – 2021 న ర్యాలీ నిర్వహించాము ,ఈ ర్యాలీ VR కళాశాల నుండి గాంధీ బోమ్మ వరకు తిరిగి VR కళాశాల కుచేరుకున్నది 10ఆంథ్రా నావల్ యూనిట్ NCC క్యాడెట్స్ పాల్గొన్నారు .NCC నావల్ క్యాడెట్స్ ను ఉద్దేశించి లెఫ్టినెంట్ డాక్టర్ N.ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్నన్ని ప్రపంచ దశ దిశలా చాటిన , భారతీయ యువతకు దశ దశా నిర్దేశం చేసిన స్వామి వివేకానంద జన్మదినాన్ని జనవరి 12 న భారతీయులు ప్రతిసంవత్సరం జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకొంటారన్ని , స్వామి వివేకానంద ను యవత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈకార్యక్రమంలో VR కళాశాల, సర్వోదయ కళాశాల, 10 ఆంధ్ర నావల్ యూనిట్ NCCక్యాడెట్స్ ,మరియు NCC ఆఫీసర్ ,లెఫ్టినెంట్ డాక్టర్ N.ప్రభాకర్ , .PI స్టాప్ ,రజనీష్ కుమార్ సింగ్,వీరభద్రారెడ్డి పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

‘‘‌లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ ‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పున్నమి ప్రత్యేక కథనం ‘‘ఇనుప నరాలు,ఉక్కు కండ రాలున్న వంద మంది యువకు లను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ పక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవా్య ప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందే హంగా స్వామి వివేకానందు డిదే. ఆధు నిక భారతదేశం ప్రపంచం లోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. ప్రజ్ఞలో, మేధా సంపత్తిలో భారతీ యులు మరెవరికి తక్కువ కాదని నిరూపించడం ద్వారా,ముఖ్యంగా భార తీయ యువతరంలో చైతన్యంనిం పడా నికి, ఆత్మ విశ్వాసం కలిగించ డానికి ఆయన తన జీవితమంతా కృషి చేశారు. ఆలోచన పటిమ, నిర్ణయ సామర్ధ్యం, వెనుదిరగని ఆచరణ, ధైర్యంతో ఫలితా లను స్వీకరించగలిగే ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్ఠించడానికి వివేకా నంద ఎంత గానో ప్రయత్నించారు. భావి భారతీయ తరాలకు ఎన్నటికీ తరగని కార్యదక్షత, స్ఫూర్తిని అందజేయడం కోసం ఆయన అలుపెర గని పరిశ్రమ చేశారు. ఏ ‌దేశంలోనైనా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరంలేదని, యువ జనులంతా మనస్ఫూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యమౌతుందని వివేకానందుని భావన. ప్రపంచ దేశాలను తిరిగిన ఆయన వివిధ దేశాలలోని యువతరానికి భారతీ య యువ తరానికి ఆలోచన విధానం లోను, మనస్తత్వంలోను ఉన్న భేదాలను ప్రస్ఫుటంగాగమనించారు.భారతదేశం ఎదుర్కొంటు న్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమ స్యల కంటే అతి పెద్ద సమస్య ఇక్కడి యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవ డమేనని వివేకానంద భావించారు. ఆయన తన ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరా న్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. ఓటమిని జీర్ణిం చుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరా శకు గురై కృంగిపో యే భారతీయ యువతరాన్ని వివేకా నంద తన బోధ నలతో చైతన్యపర్చారు. పరాజయాల నుండి గుణపాఠాలు నేర్చు కోవాలని, ఓటమి అనేది అపకారి కాదని, అవి జీవితానికి మెరుగులు దిద్దుతుందని ఆయన భావన.ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడ మే మేలని, నిరం తంరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందని యువతకు ఆయన ప్రబోధించారు. ధీరులు అపజయాలను చూసి కుంగి పోరని, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించక పోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలని అనేవారు. ఓటమి కంటే విజయం బాధ్యతను పెంచుతుని, విజేతలు ఏవిధంగా ఉండా లో కూడా వివేకానంద తెల్పారు. విజయం సాధించామని విర్రవీగరాదని, విజయం నుండి వినయాన్ని నేర్చు కోవాలని సందే శాన్నిచ్చారు. అట్లే లక్ష్య సాధనలో పరాజి తులు విజయాన్ని ఎలా కైవసం చేసుకో వాలో కూడా ఆయన యువతరానికి తెల్పారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాస క్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించా లని, విజయానికి అసలు రహస్యం ఇదేన ని అన్నారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగిన వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడిం చలేదనేది ఆయన భావన. ఉత్సాహంతో శ్రమించడం,అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయాన్ని కాంక్షి ంచే వారికుండే ప్రాథమిక లక్షణాలని అనేవారు. ఒక్కరోజులో దేనిని సాధించలే మని, పట్టుదల వదలకుండా చేసే ప్రయ త్నం విజయాన్ని చేకూర్చుందనే సత్యాన్ని యువత గుండెల్లో నాటుకునేలా నొక్కి చెప్పారు. నిరాశ కమ్ముకున్న ప్రతిక్షణాన ‘‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ అని వివేకా చెప్పిన సూక్తే యువతరా న్ని చైతన్య పథం వైపుకు అడుగులు వేయి స్తుంది. భార తీయ యువతరంలో ఆయన గమ నించిన ప్రధాన లోపం భయం. మనిషి పతానికైనా-పాపానికై నా భయ మే ప్రధా నకారణమని, భయంలోనే చావు ఉందనే అభిప్రాయాన్ని వివేకానం దుడు వ్యక్తం చేశారు. ‘బలమే జీవనం. బల హీనమే మరణం’’అని ఆయన ఇచ్చిన సందేశం మానవజాతికే అతి గొప్ప సం దేశం. మనిషి శరీరాన్ని ధరించినప్పు డు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధ లను అనుభవించి తీరాల్సిందేనని, అం దుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండని ఉద్భోదించా రు. అత్యున్నత మైన ఆదర్శాన్ని కలిగి యువతరం ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఈర్ష్యాను స్వార్ధాన్ని వదిలి పెడితే ప్రపంచాన్నే కదిలించవ చ్చునని ఆయన బలంగా నమ్మేవారు.బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకునే వారు. ‌చేసేది చిన్న పనైనా శ్రద్ధతో సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్నిస్తుందని, కావున ప్రతి వ్యక్తి తాను చేయగల పని చిన్నదైనా శ్రద్ధతో నిర్వహించాలని ప్రబో ధించారు. సమాజాన్ని సంస్కరించాలనుకునే వారు ముందుగా తమను తాము సంస్కరించుకో వాలని ఆయన తెల్పారు. యువత సచ్ఛీ లత కలిగిఉండాలని ఆయన ప్రతిసారి చెబుతూ ఉండేవారు.భారతీయ యువతరం యెక్క శక్తి సామర్ధ్యాలపై వివేకా నందునికి అంచంచలమైన విశ్వాసం ఉంది. భావి భారత భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందని, దేశ తల రాతలు మార్చగలిగే సత్తా వారికే మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మారు. అలాంటి యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా చైతన్యపర్చడానికి ప్రయత్నించా రు. వివేకానందుని బోధనలు, సూ క్తులు కేవలం భారతీయ యువతరానికి మాత్రమే పరిమితం కాదు. ‌ప్రపంచంలో నిరాశ, నిస్పృహలతో సతమతమవు తున్న యువతరానికి ఆయన సూక్తులు చైతన్య ప్రబోధాలు.‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు’’ అని యువత రానికి వివేకానందుడు ఆధునిక భగవద్గీ తను బోధించారు. వివేకానందు డు నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రబో ధాలు, సూక్తులు సజీవంగా యువతరా నికి ప్రేరణ కలుగజేస్తూనే ఉంటాయి. యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న వివేకానందుడు జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

వైద్యం పవిత్రమూ కాదు! వైద్యుడు దేవుడు కాదు!!

‘‘‌వైద్యం చాలా పవిత్రమైనది’’ ‘‘వైద్యుడు నారాయణుడితో సమానం’’ అందరి భావన. ‘‘డాక్టరు-పేషంటు’’ మధ్య సంబంధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోవాలి డాక్టర్లంతా మేధావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు వుంటారు.   ‘‘‌వైద్యం చాలా పవిత్రమైనది’’ ‘‘వైద్యుడు నారాయణుడితో సమానం’’ ఇవి వారసత్వంగా కొనసాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారుతున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చెయ్యాలంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇవ్వటం కుదరదు ఇస్తే జనం ఒప్పుకోరు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇం కొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్స రాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటి నుంచి రోగి కోలుకొనే వరకూ కేవలం డాక్టరు సమర్ధతే చాలదు. సమస్య తీవ్రత, రోగి శరీరం తట్టు కొనే తీరు, మందుల ప్రభావం, వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరి స్థితి ఒక రకంగా ఉంటుంది. రోగి దాన్ని అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది.  జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయానికి అన్నీ అమరినట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకుడదు. త్వరగా జబ్బు తగ్గిపోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు. రోగి ఆశించినట్టు వైద్య సేవలు అందించాలంటే డాక్టరు పూర్తిగా సమర్ధుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చుకోవాలి, కొత్త కొత్త పోకడల్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమయిన ‘‘కాన్ఫెరెన్స్’’‌లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినప్పుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్నళ్ళుకు చందా కడుతూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువుతూనే ఉండాలి. రోగం చేయటంలో ఏమయినా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావొద్దూ? ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు. మరో వైపు డాక్టరుకి సామాజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చింగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు, లాయర్లకూ, చార్టెడు అకౌంటెట్లకూ ఇలా ఒకరనేం ఎవరికీ సామాజికి బాధ్యతని జనం గుర్తు చేయరు. ఐ.ఐ.టీ.లో, ఐ.ఐ.ఎం.లో ప్రజల డబ్బుతో చదివిన వారిని సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా? కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువుతారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవలో తరించాలా? వైద్యుల మీద చర్చవచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి. కొన్ని వాస్తవాలు కూడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టుకొనే జనం వైద్యంలో ఎక్కడైనా తేడా వస్తే ఊరకనే వుం డరు. అదే ‘‘దేవుడు’’ తిట్లు తినాలి. కొన్ని సార్లు తన్నులు తినాలి. మంచి సిటిజను అయితే ఇవేమీ చేయకుండా కోర్టుకు తిప్పుతాడు. మంచి డాక్టరుగా తయారవ్వమని ఆదేశించమని కాదు. నాకు డబ్బులు కట్టించమని. వైద్యులకూ, డాక్టర్లకూ మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావ టానికి కారణం ఏమిటంటే ‘‘డాక్టరు-పేషంటు’’ మధ్య సంబం ధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక అంశాలలో మార్పులు అని వార్యం. వాటి తో పాటే మానవ సంబంధాలు మారిపోతాయి. పూటకూళ్ళ వారి ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్టు, సత్రాలు స్టారు హోట ళ్ళు అయి నట్టు, వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే సేవగా గుర్తించ కుండా పవిత్రమైనదిగా, డాక్ట రును దేవు డిలా, దయామయుడిలా, శాంత మూర్తిగా, రోగ పీడత దరిద్ర నారాయణులను ఆదుకొనే అవ తార మూర్తిగా భావించి నైతిక తను ఆశిస్తే ఎలా కుదురుతుందీ? జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధ తులు మారి, వైద్యానికి సంబంధించి మగతా అన్ని మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం. మారిన కాలంతోపాటు. డాక్టర్లూ మారు తారు. వారు చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగుతుంది. మార్పులన్నీ సామాజంలో వచ్చే మొత్తంలో భాగంగానే వుం టుంది. ఈ దృష్టిలో ఉంచుకొని డాక్టరు- పేషంటు సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావుగానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానంతోనే కలిసి నడవాలి. మిగతా వారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనపడని కోణం కూడా ఉంది. అదేమి టంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్ట రుతో ప్రత్యక్ష సంబంధం అవసరం. అలాగే ప్రత్యక్ష చెల్లిపు కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో ‘‘ఆయిష్టమైన చెల్లింపు’’ ఎలానో చూద్దాం. రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించుకోవటమూ తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చక పోయినా డాక్టరు దగ్గరకో, ఆసుపత్రికో వెళ్ళి చూపించుకొని వైద్యం చేయించు కోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు డాక్టరు-రోగి సంబంధం అనివార్యమూ, అవసరము. మనిషి అవసరాలు మొత్తం రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మన కు కావాల్సినవి, మనం ఇష్టపడేవి, మనకు ఆనం దాన్ని ఇచ్చేవి. వీటికోసం మనమే వెంపర్లా డుతాం. ఖరీదు అయిన టీవీని కొనటం, ఆరు రెట్లు ఎక్కువ ధర చెల్లించి మనకు నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం, దాహం వేసినప్పుడు కోకకోలా తాగటం, మందు తాగటం. ఇవి ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంత ఖర్చు అయిందనే దానితో లెక్క లేదు. రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి అవి తీరాలి. కోర్టులో కేసు, రోగం వచ్చినప్పుడు వైద్యం. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అవుతాయికానీ నిజానికి మనమేం కోరుకోలేదు. ఇందులో లోతుపాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం తప్పని సరిగా కావాలి. వారికి డబ్బు చెల్లించాలి. కాబట్టి వీటి మీద ఖర్చు పెట్టటానికి అయిష్టంగానే ఉంటుంది. నెలకు పదివేల రూపాయలు ఆలో చించకుండా ‘మందు’కు ఖర్చుపెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు అయిదు వేలు కట్టటానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగుతున్నాడని లోలోన మధనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు. తీవ్రంగా గాయ పడ్డప్పుడు వైద్యం చేయిం చుకోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు ఎక్కడా? త్వర గా రాడే? ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా వుంటుంది. డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ వుంది. ఫరవాలేదు. ఇప్పుడు బాగుంది. ‘‘బిల్లు ఎంత అవుతుందో?’’ రోగి అను మానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ‘‘అమ్మ బాబోయ్‌ ఇం‌తా? ఈ డాక్టర్లుకు కరుణ లేదు. దారుణంగా దోచేసుకుంటు న్నారు’’ ఏం పెద్ద ఊడబొడిచారనీ’’ ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని ‘అవసరం’ కోసం చెల్లిం చాల్సి రావటమే. రోగికి డాక్టరు, ప్రాణం పోయేట ప్పుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహి తుడిగా, బిల్లు కట్టించుకొనేటప్బుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకు వచ్చింది.చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు రోగి మనసులో ‘‘అవసరము- అయిష్టత’’ పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు ‘‘సేవ-ప్రతిఫలం’’ అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే డాక్టరు-రోగి మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బ తింటుంది. రోగి-డాక్టరు మధ్య సంబంధాలను వ్యా పార సంబంధాలుగా పరిగణించి ‘‘వినియోగ దారుల చట్టం’’ పరిధిలోకి తెచ్చాక కూడా ‘‘సేవ- దయ’’ అనే పాత పునాదుల పై నుండి వైద్యాన్ని చూడటం సరికాదు. ‘‘సేవకు తగ్గ చెల్లింపు’’ రోగికి ఉండాలి. అలాగే ‘‘చెల్లించిన దానికి నాణ్యమైన సేవ’’ను డాక్టర్లు అలవరుచు కోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. నాణ్యత ‘‘సర్వీసు ప్రొవైడరు’’ అయి ఉండాలి. సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి రోగి- వైద్యుడు రెండు పట్టాల్లాంటి వారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండో దాన్ని అదుపు తప్ప కుండా బాగుండమని ఆశించటం సాధ్యం కాదు. ఈ ‌నేపథ్యంలో వినియోగదారుడు వైద్యుల పట్ల తమ దృక్పధం మార్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి., 1. వైద్య వృత్తి పవిత్రమయినది కాదు. కట్టిన డబ్బుకు అందించే వినిమయ సేవ మాత్రమే. 2. డాక్టరు గొప్పవాడేం కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టరు కూడా కేవలం వృత్తి నిపుణుడు మాత్రమే. 3. డాక్టర్లంతా మేధావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు వుంటారు. 4. డాక్టరు చదువును దృష్టిలో ఉంచుకొని వైద్యం నాణ్యతను ఆశించాలి. ప్రతి డాక్టరుకు అన్నీ తెలిసి ఉండవు. 5. ఒకే డిగ్రీ చదివిన స్పెషలిస్టులకు మధ్య కూడా నక్కకూ, నాగలోకానికి మధ్య వున్నంత తేడా వుంటుంది. 6. సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థలోనూ, వైద్యుల్లోనూ ఉంటాయి. 7. ప్రభుత్వ డాక్టర్లు ధర్మంగానో, దయతోనో వైద్యం చేయటం లేదు. వారికి ప్రజల తరుఫున ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. డాక్టర్‌ ‌పి. శ్రీనివాసతేజ  

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.