Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ఉప్పెన గా రావాలి :గాలిపెల్లి కుమార్

పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి జన సైనికుడు అభిమాని కదలిరావాలి గాలిపెల్లి కుమార్ పిలుపు పిఠాపురంలో ఈనెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం జనసైనికులు, అభిమానులు భారీగా కదలి రావాలని జనసేన భవిష్యత్తును తట్టిలేపే ఈ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని సమాజ సేవకులు మెగా డిజిటల్ టీం కరీంనగర్ అధ్యక్షుడు గాలిపెల్లి కుమార్ పిలుపునిచ్చారు. పార్టీకి ఐలం చేకూర్చాలంటే ప్రతి కార్యకర్త, అభిమాని ముందుకు రావాలని జనసేన పార్టీ ప్రజల భవిష్యత్తు కోసం, మార్పు కోసం పోరాడుతోందని ఆ పోరాటంలో ప్రతి జన సైనికుడు భాగస్వామి కావాలని గాలిపెల్లి కుమార్ హితవు పలికారు. “ఇది కేవలం ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు, జనసేన బలాన్ని, మన అంకితభావాన్ని నిరూపించే వేదికని పసుపులేటి రాము అన్నారు. వెనుకడుగు వేసే అవకాశం లేదని ప్రతి కార్యకర్త, అభిమాని ఓ సైన్యం లా పిఠాపురం వైపు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఛలో పిఠాపురం మహాసభలో పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని అందుకే ఒక్కొక్కరుగా కాకుండా వేలాదిగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరావాలని పసుపులేటి రాము సూచించారు. ఈ సభను అఖండ విజయంగా మలిచి జనసేన శక్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. జనసేన అధినేత “పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నూతన రాజకీయ మార్గం సిద్ధమవుతోందని ఆ మార్పుకు మనం భాగస్వాములం కావాలని ఛలో పిఠాపురం మహాసభకు హాజరై జనసేన గళాన్ని మరింత బలంగా మార్చాలని గాలిపెల్లి కుమార్ స్పష్టం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

సోము వీర్రాజుకు MLC పదవి పై హర్షం”: ముక్కు రాధాకృష్ణ గౌడ్

” బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేరును కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా నుంచి ఓబీసీ మోర్చా కోస్తా ఆంధ్ర జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ , బిజెపి కోపరేటివ్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ కోట వెంకటేశ్వర్లు మరియు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర తదితరులు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయము నందు ఆయనను కలసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోము వీర్రాజు చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ విద్యార్థి దశలో ఏబీవీపీ అలాగే యువమోర్చా నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలై రాష్ట్ర జాతీయ పదవులను నిర్వహించి వాటికి వన్నెతెచ్చారని. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారని అటువంటి నాయకునికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీ ని కేటాయించడం ప్రతి కార్యకర్త గర్వించదగినటువంటి విషయమని అన్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ని ప్రకటించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని నిజమైన కార్యకర్తకు గౌరవం దక్కిందని ఆనందిస్తున్నారని ఇది కేవలం బిజెపి పార్టీలో మాత్రమే జరుగుతుందని మిగతా రాజకీయ పార్టీలలో సాధ్యం కాదనితెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

తెలుగు తమ్ముళ్ళు బాధ అంత ఇంత కాదు????

తొమ్మిది నెలలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,చోటా నాయకులు..పార్టీ అధికారంలోకి వస్తే..తమను అందలం ఎక్కిస్తారని, తాము చేసిన పోరాటాలకు గుర్తింపునిస్తారని, తమను అధినేత, ఆయన కుమారుడు నెత్తినపెట్టుకుని చూసుకుంటారని, రాష్ట్రం బాగుంటుందని, అభివృద్ధి చెందుతుందని, తమను అవమానించిన, హింసించిన వారికి తగిన గుణపాఠం నేర్పుతారని, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఊహలన్నీ క్రమంగా చెరిగిపోతూ ఉన్నాయి. తమను హింసించిన వారిని, తమ కార్యకర్తలను హత్యలు చేసినవారి, దోపిడీకి పాల్పడిన వారిని, అధికార మదంతో..ఊరేగిన వారిని, హత్యా రాజకీయాలతో చెలరేగిన ఉన్మాదులను ‘చంద్రబాబు’ శిక్షస్తారని వారు అనుకుంటే..అవేమీ జరగకపోగా…వారు దర్జాగా రోడ్లపై కాలరెగెరేసి తిరుగుతుంటే..‘ఈయన రాజకీయం ఇంతేలే..’ అంటూ చాలా చోట్ల సరిపెట్టుకుంటున్నారు. అయితే..ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయం వల్ల నిన్నటి దాకా..అధినేతను, టిడిపి పార్టీనీ, అధినేత బంధువులను పిచ్చితిట్లు తిట్టినవారికి ఎమ్మెల్సీ సీట్లు వస్తుండడంతో..కార్యకర్తలు తీవ్ర నిరాశ,నిస్రృహ,నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఇచ్చిన ఎమ్మెల్సీసీట్లలో ‘జనసేన’, ‘బిజెపి’లు నిర్ణయించిన అభ్యర్థులపై ‘టిడిపి’ కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘జనసేన’ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ‘పవన్‌ కళ్యాణ్‌’ సోదరుడు ‘నాగబాబు’కు మొదటి నుంచి ‘టిడిపి’కి వ్యతిరేకమే. గతంలో ఆయన ‘చంద్రబాబు’ను, ఆయన బావమరిది ఎమ్మెల్యే ‘బాలకృష్ణ’ను నానా తిట్లు తిట్టారు.నోటికి పట్టరాని విధంగా దూషించారు. సరే..‘పవన్‌కళ్యాణ్‌’ కోసం ఈ ఎంపికపై ‘టిడిపి’ కార్యకర్తలు నోరు మెదపకపోయినా..ఇప్పుడు ‘బిజెపి’ నిర్ణయించిన ‘సోము వీర్రాజు’పై మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘సోము’కు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ..పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఆయన సగం..‘బిజెపి’…సగం ‘వైకాపా’ అని..అటువంటి వ్యక్తిని ఎలా ఎమ్మెల్సీని చేస్తారంటూ..వారు అధినేత ‘చంద్రబాబు’ను నిలదీస్తున్నారు. టిడిపి, బిజెపి పొత్తును వ్యతిరేకించిన ‘వీర్రాజు’ ఇప్పుడు పొత్తులో భాగంగా సీటు ఎలా తీసుకుంటారని ధ్వజమెత్తుతున్నారు. తమ రెక్కల కష్టంతో అధికారంలోకి వస్తే..ఇలా టిడిపి వ్యతిరేకులను నెత్తికెక్కించుకోవడం ఏమిటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే..వారు ఎంత మొత్తుకున్నా..ఆవేదన వ్యక్తం చేసినా..ఇక్కడ ‘చంద్రబాబు’చేసే దేమీ లేదని, కూటమి పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు సీట్లు ఇచ్చారని, వారు వారి పార్టీలో ఎవరికి కేటాయించినా..అడిగే అధికారం ‘టిడిపి’కి, ‘చంద్రబాబు’కు లేదంటున్నారు. గతంలో ‘చంద్రబాబు’ ‘మోడీ’పై విమర్శలు చేశాడు..కదా..మరి ఇప్పుడు ‘చంద్రబాబు’కు సిఎం పదవి వద్దంటే..సరేనా..? అంటూ ‘బిజెపి’లో ‘సోము’ను సమర్థించే నేతలు వాదిస్తున్నారు. గతంలో ఎన్నో విమర్శలు చేసుకున్నా..అది అప్పటి పరిస్థితుల్లోనేనని..ఇప్పుడు అవి వర్తించవని వారు అంటున్నారు. కూటమి సజావుగా సాగాలంటో..ఇలాంటివి తప్పవని..దీన్ని ‘టిడిపి’ శ్రేణులు అర్థం చేసుకోవాలని వారు చెబుతున్నారు. కాగా..తమను, తమ అధినేతను దూషించిన వాళ్లే..ఇప్పుడు అందలం ఎక్కడంపై ‘టిడిపి’ శ్రేణులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

Featured ఆంధ్రప్రదేశ్

బీద శ్రమ ఫలించింది

తెలుగుదేశం పార్టీ అధినేత ‘నారా చంద్రబాబునాయుడు’ మరోసారి తన పాత పద్దతులనే అవలంభించారు. ఆఖరి నిమిషం వరకూ అభ్యర్ధులను ప్రకటించకుండా..నాన్చి…నాన్చి..చివరకు అభ్యర్థులను ప్రకటించే తన పాత వ్యూహాలనే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో పాటించారు. ఎన్నికలు ఏవైనా..టిడిపి అధినేత ‘చంద్రబాబు’ తన అభ్యర్థులను ఆఖరి నిమిషం వరకూ టెన్షన్‌ పెడతారు. ఎన్నో ఆశలతో రంగంలోకి దిగిన వారంతా ఆఖరి నిమిషం వరకూ తమకు అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తుంటారు. చివరకు ఏవో కారణాలతో..వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పడంతో వారంతా నిరుత్సాహానికి గురవుతారు. ఇప్పుడు పాత పద్దతినే ‘చంద్రబాబు’ పాటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ‘చంద్రబాబు’ ఆఖరి నిమిషంలో ఎవరూ ఊహించని వారిని ఎంపిక చేసి..పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంతెచ్చారు. చివరకు కొన్ని కులాలు కూడా షాక్‌ ఇచ్చారు. మ్మెల్సీ నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ‘కమ్మ’, ‘కాపు’ సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని భావించగా, ‘చంద్రబాబు’ మాత్రం వారిని వదిలేసి ‘బీసీ’లకు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఉంటే..దీనిలో ఒకటి ‘జనసేన’కు పోయింది. ఈ సీటును ‘జనసేన’ ‘పవన్‌ కళ్యాణ్‌’ సోదరుడు ‘నాగబాబు’కు కేటాయించింది. ‘నాగబాబు’ ఒకటిపోగా..మిగతా నాలుగూ ‘టిడిపి’కి వస్తాయని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే..ఈ నాలుగులో మరో సీటు ‘బిజెపి’కి కేటాయించారు. దీంతో..ఇప్పుడు ‘టిడిపి’కి మూడు సీట్లు మాత్రమే మిగిలాయి. అయితే..ఈ మూడు సీట్లలో ఒకటి ‘కమ్మ’ సామాజికవర్గానికి, మరోటి ‘కాపు’ సామాజికవర్గానికి, ఇంకోటి ‘బీసీ’లకు ఇస్తారని పార్టీ శ్రేణులతో పాటు, విశ్లేషకులు భావించారు.ముఖ్యంగా ‘కమ్మ’ల్లో విపరీతమైన పోటీ ఉంది. ఈ సామాజికవర్గంలో దాదాపు పది మంది ఎమ్మెల్సీ సీటు కోసం పోటీపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ‘దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురామ్‌’ల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఖరారైందని ప్రచారం సాగింది. వీరితో పాటు ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన ‘వంగవీటి రాధాకృష్ణ’కు కూడా అవకాశం ఉందని భావించారు. వీరు కాకుండా ‘పీఠాపురం’ మాజీ ఎమ్మెల్సీ ‘వర్మ’ ‘టిడి.జనార్థన్‌లకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే..ఈ పేర్లేమీ లిస్టులో లేవు. ఎవరూ ఊహించని విధంగా మాజీ స్పీకర్‌ ‘ప్రతిభాభారతి’ కుమార్తె ‘గ్రీష్మ’కు ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. ఈమె ఇప్పటికే ఓ నామినెటేడ్‌ పోస్టులో ఉంది. కాగా ‘నెల్లూరు’కు చెందిన ‘బీద రవిచంద్ర’, ‘బిటి నాయుడు’లకు అవకాశం ఇచ్చారు. వీరిలో ‘గ్రీష్మ’ ఎస్సీ  కాగా, మిగతా ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు. బీసీపార్టీగా చెప్పుకునే ‘టిడిపి’ బీసీలకు మంచి అవకాశాలనే ఇచ్చింది. అయితే..ఇప్పటికే నామినెటెడ్‌ పోస్టులో ఉన్న ‘గ్రీష్మ’కు సీటు ఇవ్వడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా ‘చంద్రబాబు’ తన నిర్ణయాలతో అటు స్వంత పార్టీ నాయకులే కాకుండా సోషల్‌ మీడియా, ప్రధాన మీడియాకు షాక్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియా కానీ, ప్రధాన మీడియా కానీ..ఈరోజు ఎమ్మెల్సీగా ఎంపిక అభ్యర్థులను సూచనా మాత్రంగానైనా అంచనా వేయలేకపోయింది.  మరోవైపు ఎంపికై ముగ్గురు ‘లోకేష్‌’ వర్గానికి చెందిన వారనే ప్రచారం జరుగుతోంది. ‘లోకేష్‌’ టీమ్‌ అయినందువల్లే వీరికి అవకాశం వచ్చిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Featured

గొప్ప పరిశోధకుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ——————— రచన-ఫయాజ్ ——————— (పున్నమి    భలే జ్ఞాపకాలు) “ఏమయ్యా కొండయ్య?, నేను ఇచ్చిన కాటుక పెట్టుకున్నావా? ఇప్పుడు కళ్ళకు ఎలా కనిపిస్తోంది?” “చాలా బాగా కనిపిస్తుంద య్యా, ఇంతకు ముందు నా కళ్ళ ముందు రెండు తెరలు అడ్డంగా ఉండి ప్రతి వస్తువు లీలామాత్రం గానే కనిపించేది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా” ఈ సంభాషణ మీకు అర్థం కాలేదు కదూ? 70 ఏళ్ల కిందట ఉదయగిరిలో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తికి రెండు కళ్ళకు కేటరాక్ట్ వచ్చింది. వెంటనే ఉదయగిరి లోని గొప్ప వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ను సంప్రదించాడు. ఆయన ఒక కాటుకను తయారు చేసి ఇచ్చారు. దాని మూలంగా కంటి ముందు ఉన్న కాటరాక్ట్ పొరలు తొలగి పోయాయి. చూపు స్పష్టంగా వచ్చింది. మరో సంఘటన “ఏమమ్మా రసూల్ బి?, నువ్వు అడిగిన దానికి మందిచ్చా గదా. అది పని చేసిందా?, మళ్లీ ఎందు కొచ్చావు?” “అయ్యా మీరిచ్చిన మందు చాలా బాగా పని చేసింది. నా బిడ్డకు కడుపునిండా పాలివ్వగలుగుతున్నా. అయితే పాలిచ్చిన తర్వాత కూడా పాలు ఆగడం లేదు. నా రవిక తడిసిపోతోంది.ఏం చేయాలి”?. “సరే రేపు రా. దానికి పరిష్కారం చెబుతా.” ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన ఈ మహిళకు కాన్పు తర్వాత పాలు రాలేదు. అందుకని ఆమె ఉస్తాద్ ను సంప్రదించారు. ఇలా ఉదయగిరి పట్టణంలోనూ, చుట్టుపక్కల బద్వేలు, కనిగిరి, కావలి, ఆత్మకూరు తాలూకాల్లో ఇతర ప్రాంతాల్లో అంతు పట్టని ఏ రోగమొచ్చినా ఉస్తాద్ (గురువు గారు) ని సంప్రదించి ఉచితంగా వైద్యం పొందేవారు. అరుదైన రోగాలకు సైతం ఆయన మందులిచ్చేవారు. ఈ విషయంలో ఆయన కొన్ని పరిశోధనలు సైతం చేశారు. తాను చేసిన పరిశోధనా ఫలితాలను పుస్తకాల రూపంలో రాశారు. ఆయన మూలికల కోసం ఉదయగిరి దుర్గం మీద రెండు మూడు రోజులు ఉండేవారట. కొన్ని పుష్పాలు అర్ధరాత్రి తర్వాత వికసిస్తాయని వాటిని అప్పుడే గుర్తించి సేకరించగలమని చెప్పేవారట. గొప్ప పఠనాభిలాషి. కొన్ని వందల పుస్తకాలను సేకరించారు. ఎన్నో వైద్య గ్రంథాలనూ సేకరించారు. ఆయన పేదవాడైనా వైద్యానికి ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. దిలావర్ భాయి వంశానికి చెందిన సత్తార్ హుస్సేన్ కుమారుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్. ఉస్తాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఉర్దూ పండితుడు. తెలుగు, సంస్కృతం, అరబ్బీ, పార్సి భాషల్లోనూ మంచి ప్రవేశముండేది. ఉర్దూ, తెలుగుల్లో కవితలు, గీతాలు రాసేవారు. వాటికి తానే స్వరకల్పన చేసేవారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ఒకే సమయంలో అటు ఉర్దూలోనూ ఇటు తెలుగులోనూ అశువుగా కవిత్వం చెప్పేవారు. మొదట ఉర్దూలో చెప్పాక అక్కడ తెలుగు వారుంటే అదే భావాన్ని తెలుగు కవితా రూపంలో చెప్పేవారు. ఇందులో కొన్నిసార్లు విమర్శ లుండేవి. ఆ విమర్శలు చేసేటప్పుడు ధనిక, పేద తేడా లేదు. మనసుకేమనిపిస్తే ఉన్న పళంగా చెప్పేవారు. ఆయన ఏం చెప్పినా తిరుగు ప్రశ్నించే ధైర్యముండేది కాదు. నీతి, నిజాయితీ, ఆత్మగౌరవంతో ఉండేవారు. ఆయన మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా ఎవరైనా మాట్లాడితే చీల్చి చెండాడేవారు. ఆయన కోపం లో తిట్టినా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఆనాటి జమీందారులు, షావుకారులూ మినహాయింపు కాదు. ఆయనపై చాలా గౌరవభావం ఉండేది. దానికి తోడు ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలవారు. ఆకలితో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. మంచి వక్త, టీచర్ ఉదయగిరి లోని దిలావర్ భాయి వీధిలోని సత్రంలో ఉస్తాద్ పాఠాలు చెప్పేవారు. ఉర్దూ, తెలుగు, లెక్కలు బోధించేవారు. ఈ పాఠశాల సాయంత్రం నడిచేది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనేవారు. ఊళ్లో అందరూ చదువు కోవాలని భావించేవారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర చదువుకున్న ఒకరిద్దరు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఉస్తాద్ గొప్ప రచయిత ఉస్తాద్ గొప్ప కవి. సంగీత, సాహిత్య ప్రియుడు. రచయిత. ఉర్దూలో, తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. ఏ భాషలో రాసినా అక్షరాలు ముత్యాల్లా ఉండేవి. ఆకులు అలములతో ఇంకును, పాళీలను తయారు చేసుకునేవారు. అది ఎలా తయారు చేయాలో కూడా రాసి పెట్టారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు. ఈయన నాటక రచయిత. వీరి కలం పేరు ఖాక్సర్. ఉదయగిరిలో మొదట ఉర్దూలో నాటకాన్ని రాసి తన శిష్యులతో ప్రదర్శించారు. అలాగే వీధి ప్రదర్శనలు చేసేవారు. ముఖ్యంగా మీలాద్- ఏ- నబి (మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి) రోజున ఆయనపై స్తోత్రాలు రాసి బాణీలు కట్టి శిష్యులతో పాడించేవారు. హజరత్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సా వలి దర్గా వద్ద జరిగే ఉరుసు లోనూ, మొహరం వేడుకల్లోనూ వీధి ప్రదర్శనలు సాగేవి. ఇందులో “కర్బలా ధర్మ యుద్ధం” ఎలా జరిగిందో ఆయా పాత్రధారులతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించేవారు. ఇది కరుణ రసంతో నిండి ఉండేది. ఉదయగిరి జమీందారు ఛాబు సాబ్ దీన్ని చూసి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని బహుమతులు కూడా ఆయన బృందానికి అందజేశారట. ఉస్తాద్ మంచి గాయకుడు. గాత్ర శుద్ధి ఉండేది. స్వరకర్త. సంగీతంపై మంచి అవగాహన ఉండేది. ఈయన పిల్లలకు సంగీత పాఠాలు నేర్పేవారు. మొదట రాగం పేరు చెప్పి ఎలా పాడాలో పాడి వినిపించేవారు. తర్వాత దానిని అనుసరించమని చెప్పేవారని ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన గౌస్ బాషా (89) తెలిపారు. ఆయన రాగాల పేర్లు చెబుతుంటే ఆయనకంతటి సంగీత జ్ఞానం ఎలా అబ్బిందో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. మేము ఈ పాటలను మొహరం సందర్భంలో పాడే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ఉస్తాద్ శిల్పి, చిత్రకారుడు ఎటువంటి పదార్థాలతో నైనా బొమ్మలను తయారు చేసేవారు. ఆయన ఏ రూపం అనుకుంటే ఆ రూపాన్ని తనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే వారు. ఉస్తాద్ మంచి చిత్రకారుడు. ఎన్నో చిత్రాలను గీశారు. తను రాసిన చాలా పుస్తకాల్లో చిత్రాలను గీసి వాటికి వివరణ ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో ఈయన చిత్రాలను గీసేవారు. అవి అందర్నీ అబ్బురపరిచేవి. ప్రస్తుతం కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉస్తాద్ వృత్తిరీత్యా గుర్రపు నాడాల తయారి, చెక్క నగిషీ పనులు చేసేవారు. ఆయన గుర్రపు నాడాను, మేకులను తయారు చేస్తే మెషిన్ లో తయారు చేసినట్లే ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటారు . చెక్క పై నగిషీ చెక్కడం లో నేర్పరి. ఆయన ఏ పని చేసినా అందులో మాస్టర్ (ఉస్తాద్). అయితే వృత్తిని ప్రవృత్తి మించిపోయేది. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ప్రవృత్తిగా ఉన్న వైద్యం, మూలిక వైద్య పరిశోధనలపై ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఆయనకు శరీర ధర్మ శాస్త్రం (అనాటమి)పై గొప్ప అవగాహన ఉండేది. దీనికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఉర్దూలో రాశారు. అందులో కొన్ని రేఖా చిత్రాలను కూడా గీశారు. శరీరంలో ఏ అవయవం, ఏ పని చేస్తుందో అందులో రాశారు. అక్కడ సమస్యలొస్తే ఏ విధమైన వైద్యం చేయాలో కూడా వివరించారు. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మనిషిని చూస్తే అతనికొచ్చిన రోగమేమిటో ఇట్టే కనిపెట్టేవారు. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు తమ బాధేమిటో చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అరుదుగానే కొన్ని ప్రశ్నలడిగేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు తారసపడిన వ్యక్తుల్లో రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని చెప్పేవారు. చిన్నదైతే దానికి సంబంధించిన చిట్కాలు తెలిపేవారు. పెద్దదైతే మందు తయారు చేసిచ్చేవారు. ఆయన వెళ్లే దారిలో ఎవరైనా ఉమ్ము ఊసి ఉంటే అక్కడే నిలబడి పోయేవారు. ఆ ఉమ్మును చూసి ఆ మనిషికి వచ్చిన రోగమేమిటో పక్కనున్న వారికి చెప్పేవారు. కొంతమంది రోగులొచ్చినప్పుడు పరిస్థితి చేయి దాటిందని భావిస్తే మందిచ్చేవారు కాదట. ఆ కాలంలోనే కుష్టు వ్యాధికి మందును కనిపెట్టారు. ఆ మందును ఎలా తయారు చేయాలో రాసి ఉంచారు. ఆయన గొప్ప సైకాలజిస్ట్ కూడా. మనోవ్యాధికి మందు లేదనేది పాత సామెత. అయితే కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని కిటుకుల ద్వారా దీనిని నయం చేయవచ్చునని నమ్మేవారు. అదే విషయాన్ని ఆయన గ్రంథస్తం చేశారు. ఆ వ్యాధులను ఎలా నయం చేయాలో ఆచరించి చూపారు. కొన్ని వందల వ్యాధులకు ఆయన దగ్గర చికిత్స ఉండేది. ఎప్పటికప్పుడు వాటిని రాసి ఉంచుకున్నారు. పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు తన వైద్యంతో సంతాన ప్రాప్తి కలిగేట్లు చేశారు. ఆయన మనవడు హుస్సేన్ భాష ఆయన రాసి ఉంచిన పుస్తకాలను అనుసరించి ఇప్పుడు వైద్యం చేస్తున్నారు. ఆర్.ఎం.పి సర్టిఫికెట్ తో పాటు ఆయుష్ లైసెన్స్ కూడా పొందారు. తాత గారి బాటలోనే ఇప్పటి దాకా మందు ఖరీదైనది అయితే సామగ్రిని తెప్పించుకొని తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. గొప్ప కవి ఉర్దూలో ఆయన రాసిన కవిత్వం(భక్తి) ఇప్పటికీ ఖసీదాల (భక్తి గేయాల) రూపంలో ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. తెలుగులోనూ కొన్ని రచనలు చేశారు. కొంతమంది శిష్యులు ఆయన మరణాంతరం పుస్తకాలను తీసుకెళ్లారు. ఆయన సంతానం పుస్తకాలను భద్రపరచడంలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అవి అందుబాటులో లేకుండా పోయాయి. ఉస్తాద్ పలు భక్తి గీతాలను రాయడమే కాకుండా స్వరాలను కూర్చారు. అవి ఏ సినిమా పాటలకు అనుసరణ కాదు. అందులోని అర్థం ఇప్పటికీ ప్రశంసనీయమే. ఇస్లామిక్ పండితుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ఇస్లామిక్ పండితుడు. ఖురాన్ (అల్లా వాక్కు) హదీస్ లు (మహా ప్రవక్త మహమ్మద్ స. అ.వ. స. వారి వాక్కు) లను ఇతర ముస్లిం గ్రంథాలను క్షుణ్ణంగా చదివారు. అంతేకాదు భారత, భాగవతాలను కూడా చదువుకున్నారు. ఉర్దూ పండితులతో పాటు తెలుగు పండితులను కూడా కలిసి చర్చించేవారు. ఆనాటి ఉదయగిరి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువర్యులు హజరత్

Featured ఆంధ్రప్రదేశ్

APGEA నేతృత్వంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) జిల్లా శాఖ సహకారంతో, మహిళా ఉద్యోగుల స్వచ్చంద భాగస్వామ్యంతో మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నగరంలోని APSRTC వద్ద గల శ్రీ ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణమండపం నందు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి శ్రీమతి డాక్టర్ వి.సుజాత, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీమతి డి.తులసి, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి లు హాజరై మహిళా ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు. తదుపరి అతిథులను మహిళావిభాగం మెమెంటో లు మరియు దుశ్శాలువాలతో ఆత్మీయంగా సత్కరించింది. అలాగే కుటుంబ భారాలు, ఉద్యోగ ఒత్తిడులు మరచి ఉద్యోగినులు ఆటపాటల్లో సేదదీరారు. ఆపై ఆటపాటల విజేతలకు బహుమతిప్రధానం జరిగింది. అనంతరం ఈ వేడుకల నిర్వహణలో విశేష కృషి చేసినవారికి గౌరవ జ్ఞాపికలతో సత్కరించారు.వేడుకలకు హాజరైన ప్రతి ఉద్యోగినికి చక్కని స్నాక్స్, రుచికరమైన భోజనాలతో పాటు APGEA మహిళావిభాగం ఆత్మీయకానుకలు ఇవ్వడం విశేషం. APGEA మహిళావిభాగం చైర్ పర్సన్ శ్రీమతి సుజాతా బాయి మరియు కన్వీనర్ సువర్ణ కుమారిల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో అన్ని శాఖల మరియు అన్ని స్థాయిల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఘనంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం*_

*నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం – ఘనంగా జరిగిన వాకథాన్*   _*- ఘనంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం*_ _*- వార్షికోత్సవం సందర్భంగా వాకథాన్ నిర్వహణ*_ ‘చికిత్స కంటే నివారణ మేలు ’ అనే నినాదంతో సాగిన వాకథాన్ _*- వాకథాన్ ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్*_ _*- పదేళ్ల విజయ ప్రస్థానంపై ప్రత్యేక వ్యాసం*_ (ఆరోగ్య పున్నమి) నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటయ్యి పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎంతో మంది ఆరోగ్యకరమైన జీవితాలను పొందడం మరింత సంతోషంగా ఉందని అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్ వెల్లడించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాకథాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ బాలరాజు ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘చికిత్స కంటే నివారణ మేలు ’ అనే నినాదంతో నగరంలో వాకథాన్ కార్యక్రమం జరిగింది. విఆర్సీ నుండి తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. విఆర్సీ నుండి ప్రారంభమైన ఈ వాకథాన్ రామలింగాపురం మీదుగా చిల్డ్రన్స్ పార్కు వరకూ సాగింది. ఈ వాకథాన్ లో అపోలో హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఈఓ నవీన్ మాట్లాడుతూ అపోలో హాస్పిటల్స్ నెల్లూరులో ప్రారంభమయ్యి 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదేళ్ల ప్రస్థానంలో వైద్యపరంగా ఎన్నో విజయాలను సాధించామని, వేల మంది రోగులు తిరిగి ఆరోగ్యవంతులుగా మారి నూతన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, నూతన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మెట్రో సిటీల్లోని కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను తీర్చిదిద్దామని, వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచామని నవీన్ తెలియజేశారు. _*నెల్లూరు అపోలో హాస్పిటల్ 10 ఏళ్ల విజయ ప్రస్థానం… !*_ నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ను 2015 మార్చి 8వ తేదీనా ప్రారంభించారు. అప్పటికీ అపోలో సంస్థలో అది 50వ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో నిరంతరం 850 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. _*అవార్డులు మరియు గుర్తింపులు…. !*_ న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క 7వ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును పొందింది. గ్రూప్ బి విభాగంలో వ్యవస్థాపక దినోత్సవ సదస్సులో అపోలో హాస్పిటల్ క్లినికల్ ఎక్స్ లెన్స్ అవార్డును దక్కించుకుంది. రోగి యొక్క ఆరోగ్య సంరక్షణ మరియు భద్రత విషయంలో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ( NABH ) గుర్తింపును కూడా అపోలో హాస్పిటల్ పొంది ఉంది. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే డిప్లొమేట్ నేషనల్ బోర్డు ( DNB ) గుర్తింపును కూడా పొందింది. కొవిడ్ సమయంలో విశేషమైన వైద్య సేవలు అందించినందుకు గానూ నెల్లూరుజిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ – 2022 అవార్డును కూడా అపోలో హాస్పిటల్ పొందింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే గ్రీన్ అండ్ ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీ హాస్పిటల్ – 2018 అవార్డును కూడా పొందింది. _*సాధించిన విజయాలు… !*_ గడచిన రెండేళ్లలో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 220కి పైగా రోబోటిక్ టోటల్ నీ రిప్లేస్ మెంట్ ( TKR ) శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. 100 మందికి పైగా మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేపట్టారు. నెల్లూరులో తొలిసారిగా ABO అననుకూలత మార్పిడి. AI న్యూరాలజీ విభాగం ద్వారా స్ట్రోక్ ప్రిడిక్షన్ అధ్యయనాన్ని ప్రారంభించింది. మొదటి బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ మరియు అవయవ మార్పిడి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 1వ కేసుగా నమోదైన కార్టిగ్రో- స్టెమ్ సెల్ థెరపీ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీని నెల్లూరులో విజయవంతంగా నిర్వహించారు. ఏపిలో అత్యధిక మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్న హాస్పిటల్ నెల్లూరు అపోలో హాస్పిటల్. లక్ష మందికి పైగా అపోలో హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. స్ట్రోక్ కేసుల కోసం హబ్ మరియు స్పోక్ మోడల్ ను ప్రవేశపెట్టాం. నెల్లూరు అపోలో హాస్పిటల్ అత్యధికంగా 4.9గా గూగుల్ రేటింగ్ లో కొనసాగుతంది. _*ఇతర ప్రత్యేకతలు… !*_ నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతిష్ఠాత్మక సంస్థలలో విద్యానభ్యసించిన అగ్రశేణి యువ కన్సల్టెంట్ వైద్య బృందం అందుబాటులో ఉంది. రోబోటిక్ టోటల్ నీ రిప్లేస్ మెంట్ ( TKR ) సర్జరీలు, ట్రాన్స్ ప్లాంట్స్, సిఆర్‌టి-డి, అనూరిజం క్లిప్పింగ్‌లు, మెకానికల్ థ్రోంబెక్టమీ మొదలైన అన్ని హై-ఎండ్ వైద్య సదుపాయాలు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఉన్నాయి. బెస్ట్ ఎమర్జెన్సీ సర్వీసులతో పాటూ క్రిటికల్ కేర్ కూడా అందుబాటులో ఉంది. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఓపి విధానం పూర్తిగా డిజిటల్ రూపంలో కొనసాగుతుంది.

Featured Others

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవము

  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారిని జిల్లా కార్యాలయం నందు సేవలందిస్తున్న మహిళ అధికారులు ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీ కమల్ కిరణ్ గౌరవ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా నిజాయితీ కలిగిన మంచి అధికారిణిని డాక్టర్ సుజాత గారిని మహిళా దినోత్సవ సందర్భంగా సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ఎపి హంస అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారి చేతుల మీదుగా ఆఫీసు నందు సేవలందిస్తున్న మహిళా అధికారులు మహిళా ఉద్యోగులు అందర్నీ ఘనంగా సత్కరించి గుర్తింపు పొందిన సంఘముగా ఏపీ హంస ఓక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో మహిళా అధికారులు ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు ఏపీ హంస అసోసియేషన్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి కనక రత్నం, డిపిఎమ్ఓ డాక్టర్ రమేష్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, ఎన్ఆర్సి నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివరాముడు,జిల్లా ఎపిడిమిక్ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్, రిటైర్డ్ మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, ఏపీ హంస జిల్లా ట్రెజరర్ మజార్, గౌరవ సలహాదారులు అరవ పరిమళ, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు మురళి, నాగరాజు, జిల్లా మహిళా వింగ్ సెక్రటరీ సుకన్య, ఇందుకూరు పేట తాలూకా ప్రెసిడెంట్ అరుణ రాణి, జిల్లా నాయకులు జయ శ్రీ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ప్రాజెక్టు ఓనర్ ఎవరు..? గొయ్యిని పూడ్చే బాధ్యత ఎవరిది..?

శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి అధీనంలో ఉందని, ఓనర్ ఎవరని  ప్రశ్నించారు. ఇప్పటికీ ఓ స్పష్టత లేదని ఏపీ సమాధానం చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణను ఎవరు చూస్తున్నారని అనిల్ జైన్ ప్రశ్నించగా.. తామే చూస్తున్నామంటూ ఏపీ బదులిచ్చింది. అలాంటప్పుడు డ్యామ్​పై పూర్తి బాధ్యత మీది కాదా? అని అనిల్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ చూసే వాళ్లే డ్యామ్​కు ఓనర్​ అన్న విషయం తెలియదా? అని మండిపడ్డారు. శ్రీశైలం ఓనర్​గా ఆ ప్రాజెక్ట్​ సీఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఓనర్​గా నల్గొండ సీఈలు ఉండాలని తేల్చి చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెట్రాపాడ్స్​తో గొయ్యిని పూడ్చండి శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్​పూల్​లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్​తో పూడ్చాల్సిందిగా ఎన్​డీఎస్​ఏకి తెలంగాణ ఈఎన్​సీ జి.అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జియోలాజికల్ స్టడీస్​, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేలా ఏపీని ఆదేశించాలన్నారు. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైందని గుర్తు చేశారు. ఆ ఏడాది ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందన్నారు. దీంతో ప్రాజెక్టులోని ప్రెజర్ సెల్స్ పనిచేయడం లేదని వివరించారు. డ్యామ్ గ్యాలరీలోని డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలూ పనిచేయడం లేదని, వాటిని ఏపీ పట్టించుకోవడం లేదని ఎన్​డీఎస్​ఏకి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని, నీటి పంపకాలపై ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్​సీ అనిల్​ కుమార్​, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, సెంట్రల్​ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్​ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర రావు, శ్రీశైలం సీఈ కబీర్ బాషా తదితరులు హాజరయ్యారు.

Featured జాతీయ అంతర్జాతీయ

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 – వి ఎస్ యు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి ఎస్ యు) లో నెహ్రూ యువ కేంద్రం, నెల్లూరు మరియు వి ఎస్ యు ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ను నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమం యువతకు తమ ఆలోచనలు, అభిప్రాయాలను దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రదర్శించేందుకు ఒక ఉత్తమ వేదికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు ఇందులో పాల్గొనవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు “My Bharat” పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, వికసిత్ భారత్ పై తమ ఆలోచనలను వివరించే ఒక నిమిషం వీడియోను చిత్రీకరించి, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నెల్లూరు నోడల్ డిస్ట్రిక్ట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 150 మంది యువతను ఎంపిక చేసి, “వన్ నేషన్, వన్ ఎలక్షన్” అనే అంశంపై మూడు లేదా నాలుగు నిమిషాలు మౌఖికంగా మాట్లాడే అవకాశం కల్పించబడుతుంది. ఐదుగురు జ్యూరీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 మందిని ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్‌కు పంపించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు ఎంపికై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జాతీయ స్థాయిలో తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం పొందుతారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. పూర్తి వివరాల కోసం: ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త: డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం (8187814140) నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి: డాక్టర్ ఏ. మహేందర్ రెడ్డి (99635 33440) సమయాన్ని సద్వినియోగం చేసుకొని యువతీ, యువకులు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.