వార్త ముఖ్యాంశాలు
- 10 లక్షల విరాళం ఇచ్చిన టీటీడీ దాతలకు మొదటి గడప దర్శనం పునరుద్ధరించాలి ----------------------------------------------------------------------- దాతలకు గతంలో కల్పించిన ప్రత్యేక దర్శన సౌకర్యాలను కొనసాగించాలి టీటీడీ ఈఓకు దాతల విజ్ఞప్తి-- తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.10 లక్షల విరాళాలు అందించిన పాత దాతలకు గతంలో కల్పించిన మొదటి…
- 2026 జూలై 15వ తేదీకి ముందు వర్తించే పథకాల కింద రూ.10 లక్షల విరాళం అందించిన దాతలకు సంవత్సరానికి మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పించేవారని, ఒక్కో దర్శనానికి దాతతో పాటు మొత్తం ఐదుగురికి అవకాశం ఉండేదని భక్తులు పేర్కొంటున్నారు.
- అప్పట్లో మొదటి గడప ద్వారా స్వామివారి దర్శనం కల్పించేవారని గుర్తుచేస్తున్నారు.
10 లక్షల విరాళం ఇచ్చిన టీటీడీ దాతలకు మొదటి గడప దర్శనం పునరుద్ధరించాలి
———————————————————————–
దాతలకు గతంలో కల్పించిన ప్రత్యేక దర్శన సౌకర్యాలను కొనసాగించాలి
టీటీడీ ఈఓకు దాతల విజ్ఞప్తి–
తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.10 లక్షల విరాళాలు అందించిన పాత దాతలకు గతంలో కల్పించిన మొదటి గడప బిగినింగ్ బ్రేక్ దర్శన సౌకర్యాన్ని పునరుద్ధరించాలని భక్తులు టీటీడీ అధికారులను కోరుతున్నారు.
2026 జూలై 15వ తేదీకి ముందు వర్తించే పథకాల కింద రూ.10 లక్షల విరాళం అందించిన దాతలకు సంవత్సరానికి మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పించేవారని, ఒక్కో దర్శనానికి దాతతో పాటు మొత్తం ఐదుగురికి అవకాశం ఉండేదని భక్తులు పేర్కొంటున్నారు. అప్పట్లో మొదటి గడప ద్వారా స్వామివారి దర్శనం కల్పించేవారని గుర్తుచేస్తున్నారు.
అయితే ఇటీవల భక్తుల రద్దీని కారణంగా చూపుతూ రూ.10 లక్షల దాతలకు రెండవ గడప ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు తెలుస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో టీటీడీ చేస్తున్న కృషిని గౌరవిస్తున్నామని, అయితే రద్దీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కూడా పాత దాతలకు మొదటి గడప దర్శనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు శ్రీవాణి పథకం కింద రూ.10 వేల విరాళం ఇచ్చిన భక్తులకు మొదటి గడప దర్శనం కల్పిస్తుండగా, రూ.10 లక్షల విరాళం అందించిన
పాత దాతలకు రెండవ గడప దర్శనం కల్పించడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. ఉదయాస్తమాన సేవా దాతలకు కూడా మొదటి గడప దర్శన సౌకర్యం కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
దాతలు రూ.10 లక్షల విరాళాన్ని కేవలం ఆర్థిక సహాయంగా మాత్రమే కాకుండా, స్వామివారిపై అపారమైన భక్తి, విశ్వాసంతో పాటు అప్పట్లో అమలులో ఉన్న ప్రత్యేక దర్శన సౌకర్యాలపై నమ్మకంతో అందించారని పేర్కొంటున్నారు. విరాళాలు స్వీకరించిన సమయంలో కల్పించిన సౌకర్యాలను గౌరవించడం టీటీడీ బాధ్యతగా భావించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈఓ) స్పందించి, రూ.10 లక్షల విరాళాలు అందించిన పాత దాతలకు గతంలో మాదిరిగానే సంవత్సరానికి మూడుసార్లు మొదటి గడప బిగినింగ్ బ్రేక్ దర్శనాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. భక్తుల రద్దీ లేదా ఇతర పరిపాలనా కారణాలతో ఇప్పటికే విరాళాలు అందించిన దాతలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దాతల భక్తి, విశ్వాసానికి తగిన గౌరవం కల్పిస్తూ టీటీడీ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గోవిందా! గోవిందా! గోవిందా!