వార్త ముఖ్యాంశాలు
- అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీ మూర్తిరెడ్డిపాళెం పరిధిలో చోటుచేసుకుంది.
- ఆడుకుంటూ వీధిలోకి వెళ్లిన చిన్నారిపై ఒక్కసారిగా కుక్క దాడి చేసి ముఖాన్ని చిందరవందరగా చీల్చింది.
- చిన్నారి గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు, స్థానికులు కుక్కను వెంటాడటంతో చిన్నారిని వదిలేసి వెళ్లింది.
అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీ మూర్తిరెడ్డిపాళెం పరిధిలో చోటుచేసుకుంది. ఆడుకుంటూ వీధిలోకి వెళ్లిన చిన్నారిపై ఒక్కసారిగా కుక్క దాడి చేసి ముఖాన్ని చిందరవందరగా చీల్చింది.
చిన్నారి గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు, స్థానికులు కుక్కను వెంటాడటంతో చిన్నారిని వదిలేసి వెళ్లింది.
ఈ ఘటనలో చిన్నారి ముఖంపై 20 కుట్లు పడ్డాయి.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన కేశయ్య, చెంగమ్మ దంపతులు కొన్ని రోజులుగా నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీ మూర్తిరెడ్డిపాళెం పరిధిలో బాటలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మూడేళ్ల కుమార్తె గురువారం బయటకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న సర్జన్ డాక్టర్ గురు ప్రసాద్ చిన్నారికి సుమారు ఒకటిన్నర గంట పాటు చికిత్స అందించి, ముఖంపై 20 కుట్లు వేసి సురక్షితంగా కాపాడారు.
చిన్నారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆసుపత్రి ఇన్‌చార్జి అమర్‌నాథ్ తెలిపారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
కాగా,చిన్నారి ప్రాణాలను కాపాడి, మెరుగైన వైద్యం అందించిన డాక్టర్ గురు ప్రసాద్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.