విశాఖ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కూటమి భాగస్వామ్య పార్టీలతో ఇప్పటికే నాలుగు దఫాలుగా చర్చలు జరిగాయని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చినట్లు చెప్పారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని, న్యాయపరంగా సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.
రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని, స్థానికంగా ప్రజలతో అనుబంధం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని పల్లా తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.
