శిథిలావస్తలో 75 సంవత్సరాల విద్యా మందిరం!
వెలుగులు పంచిన బడికి ఆదరణ కరువు!
పూర్వ విద్యార్థుల చొరవే ప్రాణం !
విద్యా మందిరానికి పునర్జీవం అవసరం !
చరిత్రకు సాక్షిగా నిలిచిన పాఠశాల భవనానికి పూర్వవైభవం ఎప్పుడు !
పెళ్లకూరు దశరథరామిరెడ్డి దాతృత్వం వృధా !
పాఠశాల ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగేనా !
పున్నమి ప్రతినిధి : షేక్ రసూల్ అహమద్
పాఠశాల అంటే కేవలం చదువులు నేర్పించే భవనం మాత్రమే కాదు. ఎన్నో తరాల విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన విజ్ఞాన మందిరం. ఎందరో ప్రముఖులను, ఉన్నత స్థాయి వ్యక్తులను సమాజానికి అందించిన విద్యాలయం. అలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన మన గూడూరు జడ్పీ పాఠశాల భవనం నేడు శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరం. 1922 లో హైస్కూలుగా అప్గ్రేడ్ అయ్యి దినదినాభివృధి చెందుతూ విద్యార్థులతో కిక్కిరిసిపోయి ఉండేది. ఇలాంటి స్థితిలో గూడూరు వాస్తవ్యులు అయిన గ్రిద్దలూరు రామానాయుడు, గూడూరు సుబ్బారెడ్డి లాంటి మహానుభావులు హైస్కూలుకు ఆర్ధిక సహాయ నిమిత్తం వీలునామాలు, ఆస్తులు కల్పించారు. కాలగతిలో ఇవన్నీ మరుగున పడిపోవడంతో స్కూలును పట్టించుకొనే నాధుడు లేకపోయారు.
ఇలాంటి విపత్కర స్థితిలో సత్రం భవనం చాలక పోవడంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చదువుకొంటున్న విద్యార్థుల, ఉపాధ్యాయుల ఇక్కట్లు చూసి చలించి పోయిన పాత విద్యార్థి పెళ్లకూరు దశరథరామి రెడ్డి ముందుకు వచ్చి హైస్కూలు సొంత భవన పనులకు అంకురార్పణ చేసారు.1945లో నిర్మాణ పనులు ప్రారంభమై, 1954 నాటికి పూర్తిస్థాయిలో విద్యా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ పాఠశాల భవనానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. అప్పటి పరిస్థితుల్లో పాఠశాల నిర్మాణం కోసం దశరధరామిరెడ్డి ఎంతో శ్రమించి, తన సొంత ధనాన్ని వెచ్చించి ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. విద్య పట్ల ఆయనకున్న అంకితభావం, సమాజ అభ్యున్నతి పట్ల ఉన్న దూరదృష్టికి ఈ పాఠశాల భవనం ఒక నిలువెత్తు నిదర్శనం.
దాదాపు ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విద్యాలయ భవనం ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది.విశాలమైన భవనం, నాణ్యమైన చదువుకు అనుకూలంగా ఉండటంతో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గూడూరు పాఠశాల వైపు మొగ్గు చూపేవారు. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వారి బాల్యస్మృతులు, విద్యాభ్యాస జ్ఞాపకాలు ఈ పాఠశాల గోడలతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాక రాజకీయ, సాంస్కృతిక చైతన్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండటంతో పాటు ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలను అక్కున చేర్చుకొనేది.
ఇంతటి ఘనమైన చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ 2023 లో పూర్వ విద్యార్థులందరూ కలిసి పాఠశాల శతాబ్ది ఉత్సవాలను (సెంటినరీ వేడుకలను) వైభవంగా నిర్వహించుకున్నారు. ఆ వేడుకలు పాఠశాల చరిత్రను, పూర్వ విద్యార్థుల అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకొనే విధంగా జరిగాయి. ఈ ఆత్మీయానందం కేవలం రెండు సంవత్సరాలకే నేడు ఆవిరి అవ్వడం బాధాకరం.
ప్రస్తుత పరిస్థితి ?
ఒకప్పుడు విద్యార్థుల కేరింతలతో, ఉపాధ్యాయుల పాఠాలతో కళకళలాడిన ఈ చారిత్రక భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. భవనం పరిస్థితి బాగోలేకపోవడంతో విద్యార్థులకు పక్కనే ఉన్న మరో భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది విద్యార్థుల భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన అసలు పాఠశాల భవనం నిర్లక్ష్యానికి గురికావడం ఆవేదన కలిగిస్తోంది.
పాత భవనాన్ని కూల్చివేయడం కాదు… పునరుద్ధరించి పూర్వవైభవాన్ని తీసుకురావడమే మన లక్ష్యం కావాలి. ఈ నేపథ్యంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు సమష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏం చేయాలి :-
ముందుగా భవనానికి నిపుణుల ద్వారా సాంకేతిక పరిశీలన చేయించి, మరమ్మతులకు అనుకూలంగా ఉందో లేదో నిర్ధారించాలి. భవనం భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా అవసరమైన మరమ్మతులు, పైకప్పు పునరుద్ధరణ, గోడల పటిష్టత, తలుపులు, కిటికీలు, విద్యుత్ సదుపాయాలు వంటి పనులను చేపట్టాలి. అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడంతో పాటు పూర్వ విద్యార్థులు, దాతలు కూడా తమ వంతు సహకారం అందించాలి.
ఈ భవనాన్ని కేవలం మరమ్మతులు చేయడానికే పరిమితం కాకుండా, దాని చారిత్రక గుర్తింపును కాపాడుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దాలి. అవసరమైతే పాఠశాల చరిత్రను తెలిపే ఫొటోలు, పాత రికార్డులు, ప్రముఖ పూర్వ విద్యార్థుల వివరాలతో ఒక ప్రత్యేక స్మారక ప్రదర్శన ఏర్పాటు చేయాలి. దీన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలి.
నెల్లూరు జిల్లాలో తొలి తాలూకా పాఠశాలగా 1826 లో ప్రారంభమై ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొని సొంత భవనం లేక దశరథరామిరెడ్డి పుణ్యమా అని పూర్తిస్థాయి విద్యా ప్రస్థానంగా మారి, ఎన్నో తరాల జీవితాల్లో వెలుగులు నింపింది. నాడు దశరధ రామిరెడ్డి తన సొంత ధనాన్ని వెచ్చించి సమాజానికి అందించిన ఈ విద్యా మందిరాన్ని నేడు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
ఆయన చేసిన సేవలను గౌరవించుకోవడం అంటే కేవలం ఆయనను స్మరించుకోవడం మాత్రమే కాదు. ఆయన నిర్మించిన విద్యాలయాన్ని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు అందించడమే నిజమైన నివాళి …
2023లో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పుడు మరో చారిత్రక బాధ్యతను స్వీకరించాలి. అందరూ ఒక్కటై పాఠశాల పునరుద్ధరణకు నడుం బిగించాలి.
ఈ పాఠశాల భవనం ఇటుకలు, సిమెంటుతో నిర్మించిన కట్టడం మాత్రమే కాదు… మన బాల్యానికి చిరునామా, మన జ్ఞాపకాలకు నిలయం, మన ప్రాంత విద్యా చరిత్రకు సజీవ సాక్ష్యం.
దీనిని నిర్లక్ష్యం చేసి కాలగర్భంలో కలిసిపోయేలా చేయకుండా, తిరిగి పూర్వవైభవంతో వెలుగొందేలా చేయడమే మనందరి లక్ష్యం కావాలి.
పెళ్లకూరు దశరధరామిరెడ్డి గారి త్యాగానికి గుర్తుగా… పూర్వ విద్యార్థుల ఐక్యతకు ప్రతీకగా… భావితరాల విద్యార్థులకు వారసత్వ సంపదగా ఈ పాఠశాల భవనం మళ్లీ కళకళలాడాలి.




వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్