పెరుగుతున్న సాగు ఖర్చులు కనిపించవా?
ఒక రైతుగా నా ఆవేదన.. నా అభిప్రాయం!
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
నేను కూడా ఒక రైతునే. వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి పంట పండించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్, కూలీల ఖర్చులు పెరుగుతున్నాయి. పంట పండించే వరకు రైతు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. తీరా పంట చేతికొచ్చాక సరైన ధర లభించకపోతే అప్పులు మిగులుతున్నాయి.
కంపెనీలు తయారు చేసే వస్తువులు, గృహోపకరణాలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తి ఖర్చుల గురించి మాట్లాడుతున్నాం. మరి వ్యవసాయ పెట్టుబడులు పెరిగినప్పుడు రైతు తన పంటకు మంచి ధర కోరుకోవడంలో తప్పేముంది?
పెట్టుబడి రైతుదే.. నష్టభారం రైతుదే!
సన్న, చిన్నకారు రైతులు సొంత పొలంలో కష్టపడటంతోపాటు పెట్టుబడి, పంట నష్టభయాన్ని కూడా భరించాలి. కొన్ని సందర్భాల్లో వ్యవసాయం ద్వారా మిగిలే ఆదాయం కంటే కూలి పనులకు వెళ్లడం ద్వారా వచ్చే ఆదాయమే మెరుగ్గా ఉంటోంది. ఇది చిన్నకారు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తోంది.
రైతుకు న్యాయమైన ధర ఎప్పుడు?
వినియోగదారులకు సరసమైన ధరలకు సరుకులు అందాలి. అదే సమయంలో రైతుకు కూడా తన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి. సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని తగ్గించి, పంట నష్టాల సమయంలో రైతులకు అండగా నిలవాలి.
ఒక రైతుగా నా ప్రశ్న ఒక్కటే.. ఇతర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వాటి ఉత్పత్తి ఖర్చులను గుర్తిస్తున్నాం. మరి రైతు పంట ధర పెరిగితేనే ఎందుకు గగ్గోలు? పంట ధరను మాత్రమే కాకుండా, దాని కోసం రైతు పెట్టిన పెట్టుబడిని కూడా లెక్కించాలి.
రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే సమాజానికి ఆహార భద్రత ఉంటుంది.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్