వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, నవంబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఈ నెల 29వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
- ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం, అనుమసముద్రంపేట, చేజర్ల, కలువాయి మండలాల పరిధిలో ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 700 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ టి.
- వెంకటేశులు తెలిపారు.
ఆత్మకూరు సబ్ డివిజన్లో 700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
ప్రజలు పోలీసులకు సహకరించాలి – డీఎస్పీ టి. వెంకటేశులు
ఆత్మకూరు, నవంబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఈ నెల 29వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం, అనుమసముద్రంపేట, చేజర్ల, కలువాయి మండలాల పరిధిలో ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 700 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ టి. వెంకటేశులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పాల్గొనాలని, ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావివ్వకూడదని సూచించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ప్రత్యర్థి అభ్యర్థులపై దూషణలు, అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, అభ్యంతరకర పోస్టులు, వీడియోలు ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. ఓటర్లను భయపెట్టడం, డబ్బు లేదా ఇతర ప్రలోభాలతో ప్రభావితం చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా అన్ని మండలాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో 144 సీఆర్పీసీ) అమలులో ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా గుమిగూడరాదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను అభ్యర్థించడం నిషేధమన్నారు. మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, ఆయుధాలు ప్రదర్శించడం, ఎన్నికల అనంతరం అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు.ఎన్నికల బందోబస్తులో భాగంగా 16 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 700 మందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ టి. వెంకటేశులు విజ్ఞప్తి చేశారు.
మూలం: 28-11-2026 . ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్.