వార్త ముఖ్యాంశాలు
- ఎల్లలు దాటుతున్న సైదాపురం మైనింగ్ అక్రమాలు అనిల్ రాజేసిన అగ్గి ప్రజాగ్రహం వైపు నెల్లూరు జిల్లాలో టీడీపీ పరువు గంగ వైపు వందల కోట్ల క్వార్ట్జ్ అవినీతి వెలుగులోకి రూప్ కుమార్ యాదవ్‌పై పోలీస్ స్టేషన్లో మాజీ మేయర్ ఫిర్యాదు కమిషనర్‌కు వైసీపీ కార్పొరేటర్ నాగార్జున ఫిర్యాదు…
- (నెల్లూరు , సెప్టెంబర్ 02 , పున్నమి ప్రతినిధి ) వైసీపీకి చెందిన మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రాజేసిన అగ్గి ఎల్లలు దాటుతోంది.
- జిల్లాలోని సైదాపురం మండలంలో జరిగిన మైనింగ్, క్వార్ట్జ్ గనుల అవినీతి అనిల్, రూప్ల పుణ్యమా అని సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది.
ఎల్లలు దాటుతున్న సైదాపురం మైనింగ్ అక్రమాలు
అనిల్ రాజేసిన అగ్గి ప్రజాగ్రహం వైపు
నెల్లూరు జిల్లాలో టీడీపీ పరువు గంగ వైపు
వందల కోట్ల క్వార్ట్జ్ అవినీతి వెలుగులోకి
రూప్ కుమార్ యాదవ్‌పై పోలీస్ స్టేషన్లో మాజీ మేయర్ ఫిర్యాదు
కమిషనర్‌కు వైసీపీ కార్పొరేటర్ నాగార్జున ఫిర్యాదు
ఈ ఎపిసోడ్‌పై తలలు పట్టుకుంటున్న జిల్లా టీడీపీ పెద్దలు
జిల్లాలో చర్చనీయాంశంగా సైదాపురం క్వార్ట్జ్ అవినీతి అక్రమాలు
సీఎం చంద్రబాబు జోక్యం చేసుకునే అవకాశాలు?
(నెల్లూరు , సెప్టెంబర్ 02 , పున్నమి ప్రతినిధి )
వైసీపీకి చెందిన మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రాజేసిన అగ్గి ఎల్లలు దాటుతోంది. జిల్లాలోని సైదాపురం మండలంలో జరిగిన మైనింగ్, క్వార్ట్జ్ గనుల అవినీతి అనిల్, రూప్ల పుణ్యమా అని సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది. అవినీతి, అక్రమాలు జరిగాయని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని అనిల్ చూపుతుండగా, అవన్నీ నిరాధార ఆరోపణలేనని రూప్ కుమార్ యాదవ్ చేస్తున్న ఖండనలు ప్రజలను సంతృప్తిపరచలేకపోతున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాహిని వారి పెద్దమనుషులు చాపకింద నీరులా చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వచ్చే కొద్దీ కొత్త కొత్త బాగోతాలు తెలుస్తుండటంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంకట స్థితిలో పడుతోంది.
వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే గొడ్డలి పార్టీ నుంచి తన పార్టీలోకి తీసుకున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌ల వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటంతో జిల్లాలో ఆ పార్టీ పరువు గంగ వైపు పరుగులు తీస్తోంది.
ఈ మాటల యుద్ధం ఎపిసోడ్ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ రోజు ఇంతవరకు తెలిసింది… మరి రేపేం జరుగుతుందో, ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజయ పరంపరలో ముందుంటూ, ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి జైత్రయాత్ర కొనసాగించాలనుకున్న టీడీపీకి ఈ మాటల యుద్ధం ఎపిసోడ్ కొరకరాని కొయ్యగా మారింది. ఈ మాటల యుద్ధానికి స్వస్తి చెప్పి, ప్రజలను వేరే దారిలో మళ్లించాలన్న ఆలోచనలో జిల్లా టీడీపీ పెద్దలు ఉన్నారు.
అలా కాకుండా ఇలాగే కొనసాగితే ఇప్పటికే పార్టీ పరువు బజారులో పడిందని, దీనిని ఆపి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే నష్టపోతామనే ఆందోళనలో టీడీపీ పెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ విషయాలను జిల్లాలోని కొందరు టీడీపీ పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, తాజాగా బుధవారం నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి నెల్లూరు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆనాడు డిప్యూటీ మేయర్‌గా ఉన్న రూప్ కుమార్ యాదవ్, మేయర్ హోదాలో చైనాలో పర్యటించడం తప్పని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇదే రోజు వైసీపీకి చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ నాగార్జున సైతం ఇదే విషయంలో నెల్లూరు నగర కమిషనర్ వై.ఓ. నందన్‌ను ఆయన చాంబర్లో కలిసి రూప్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు.
ఈ రెండు ఫిర్యాదులు ప్రజల్లో అలజడి రేపాయి. తెలుగుదేశం పార్టీని సైతం ఆలోచనలో పడేశాయి. అసలేం జరిగింది? ఈ చైనా పర్యటనలేమిటి? చైనా వాళ్లతో ఉన్న వ్యాపార సంబంధాలేమిటి? అసలు ఇవి చట్టబద్ధమేనా, కాదా? అనే విషయాలపై కూడా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం ఈ మాటల యుద్ధం ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. అటు తిరిగి, ఇటు తిరిగి అధికార తెలుగుదేశం పార్టీలో సైతం ప్రకంపనలు సృష్టించడం ప్రారంభించింది.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఇప్పటివరకు వితరణశీలిగా, దానకర్ణుడిగా ప్రజల్లో పేరుండేది. కానీ అనిల్ రాజేసిన అగ్గి, సైదాపురం క్వార్ట్జ్ వ్యవహారం, ఆయన చుట్టూ ఉన్న కోటరీ చేస్తున్న పనులు—ఇవన్నీ ప్రజల్లో కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి.
ప్రజల హృదయాల్లో జేగంటగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభ మసకబారే సూచనలు కనిపిస్తున్నాయి. తాము ఎంతో గొప్పగా ఊహించుకున్న వేమిరెడ్డి, సైదాపురం క్వార్ట్జ్ గనుల వ్యవహారాల్లో ఇంత దిగజారి ప్రవర్తిస్తారా? నమ్మలేకపోతున్నామంటూ చర్చలు మొదలయ్యాయి.
అయితే, ప్రభాకర్ రెడ్డి చుట్టూ చేరి ఉన్న కోటరీ అనుచరుల వ్యవహారాలు తెలిసినవారు మాత్రం, వారే ఈయనను ఈ విధంగా ప్రభావితం చేసి మార్చి ఉంటారేమోనన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ లేవనెత్తుతున్న అక్రమాలు, అవినీతి అంశాల్లో ఎంతవరకు నిజముందనే విషయాలను తేలికగా కొట్టిపారేయకుండా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తేనే అసలు నిజాలు బయటకు రాగలవని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయాలు, వస్తున్న ఆరోపణలపై సరైన దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
‘గొడ్డలి పార్టీ’, ‘అభివృద్ధి నిరోధక పార్టీ’ అంటూ పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడు, అదే గొడ్డలి పార్టీ నుంచి టీడీపీలోకి వలస వచ్చినవారి పట్ల సైతం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి గడబిడలకు స్వస్తి పలికేలా పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.