పరీక్షల ఒత్తిడి – విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం
మార్కులు ముఖ్యం.. కానీ విద్యార్థి మానసిక ప్రశాంతత అంతకంటే ముఖ్యం
డా. కె.టి.సి. పాపారాయుడు
Psychologist & Career Mental Health Counsellor
పరీక్షలు విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, భవిష్యత్తు విద్యా అవకాశాలను నిర్ణయించుకోవడానికి పరీక్షలు ఉపయోగపడతాయి. అయితే పరీక్షల సమయంలో విద్యార్థులపై అధిక అంచనాలు, మార్కుల కోసం ఒత్తిడి, ఇతర విద్యార్థులతో పోల్చడం వంటి అంశాలు వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
“ఎన్ని మార్కులు వస్తాయి?”, “నీ స్నేహితుడికి ఎక్కువ మార్కులు వచ్చాయి కదా?”, “ఈసారి మంచి ర్యాంక్ రావాలి” వంటి మాటలు తల్లిదండ్రులు ప్రోత్సాహం కోసం చెప్పినవే కావచ్చు. కానీ అదే మాటలు పదేపదే వినిపిస్తే కొంతమంది విద్యార్థుల్లో భయం, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, చిన్న విషయాలకే చిరాకు పడటం, నిద్రలో మార్పులు రావడం, ఎప్పుడూ పరీక్షల గురించే ఆలోచించడం, “నాకు రాదు” అనే భావన కలగడం వంటి మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలి. ప్రతి విద్యార్థి చదివే విధానం, అర్థం చేసుకునే వేగం, జ్ఞాపకశక్తి, ఆసక్తులు ఒకేలా ఉండవు. కాబట్టి అందరినీ ఒకే ప్రమాణంతో పోల్చడం సరైనది కాదు.
పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎక్కువగా అవసరమయ్యేది భయపెట్టడం కాదు.. భరోసా ఇవ్వడం. “ఎంత చదివావు?” అనే ప్రశ్నతో పాటు “ఏ విషయంలో నీకు ఇబ్బంది ఉంది?”, “నీకు మేమెలా సహాయం చేయగలం?” అని అడగడం ఎంతో ఉపయోగకరం. ఫలితాల కంటే ప్రయత్నాన్ని గుర్తించి అభినందించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పరీక్షలకు మంచి ప్రణాళికతో సిద్ధం కావడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. చదువును చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవడం, మధ్యలో తగిన విరామాలు తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, శారీరక చలనం, కుటుంబ సభ్యులతో కొంత సమయం మాట్లాడటం వంటి సాధారణ అలవాట్లు విద్యార్థుల రోజువారీ సమతుల్యతకు సహాయపడతాయి.
తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై బలవంతంగా మోపకుండా, పిల్లల సామర్థ్యాలు మరియు ఆసక్తులను అర్థం చేసుకోవాలి. ఒక పరీక్షలో వచ్చిన మార్కులు ఒక విద్యార్థి మొత్తం ప్రతిభను నిర్ణయించవు. పరీక్షలో ఆశించిన ఫలితం రాకపోయినా, అది జీవితానికి ముగింపు కాదు. తప్పుల నుంచి నేర్చుకుని మరోసారి ప్రయత్నించే అవకాశం ప్రతి విద్యార్థికి ఉంటుంది.
విద్యార్థుల్లో ఆందోళన లేదా ప్రవర్తనలో గణనీయమైన మార్పులు ఎక్కువకాలం కొనసాగితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, స్కూల్ కౌన్సెలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడంలో సంకోచించకూడదు.
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని పెంచడం కంటే.. పరీక్షలను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచడం మన బాధ్యత. మార్కులు వారి భవిష్యత్తులో ఒక భాగం మాత్రమే.. కానీ వారి మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆనందం జీవితాంతం వారితో ఉంటాయి.
పిల్లలను మార్కులతో కొలవకండి.. వారి ప్రయత్నాన్ని గుర్తించండి.
భయపెట్టకండి.. భరోసా ఇవ్వండి.
పోల్చకండి.. ప్రోత్సహించండి.


