వార్త ముఖ్యాంశాలు
- -టెండర్లు ఒకరివి..
- క్షేత్రస్థాయిలో పనులు మరొకరివి -పనుల్లో నాణ్యత, మన్నికల కరువు -పాత పనులకు కొత్త మెరుగులు -కార్యకర్తలే కాంట్రాక్టర్లు -లెక్కకేమో కోట్ల పనులు -ఫలితాల్లో మాత్రం శూన్య ధ్వనులు.
- -క్వాలిటీ కంట్రోల్ , విజిలెన్స్ లు సైలెన్స్ నెల్లూరు నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కకు మించిన కోట్ల నిధులను తెస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.
-టెండర్లు ఒకరివి.. క్షేత్రస్థాయిలో పనులు మరొకరివి
-పనుల్లో నాణ్యత, మన్నికల కరువు
-పాత పనులకు కొత్త మెరుగులు
-కార్యకర్తలే కాంట్రాక్టర్లు
-లెక్కకేమో కోట్ల పనులు
-ఫలితాల్లో మాత్రం శూన్య ధ్వనులు.
-క్వాలిటీ కంట్రోల్ , విజిలెన్స్ లు సైలెన్స్
నెల్లూరు నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కకు మించిన కోట్ల నిధులను తెస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ అభివృద్ధి పనులను ఒక జాతరలా నిర్వహింపజేస్తున్నారు. ఈ పనులు మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, నుడా తదితర శాఖల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పనులపై పర్యవేక్షణ మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. దున్న ఈనిందంటే గాట కట్టేయమన్న సామెతగా పనులు జరుగుతున్నాయి. అసలు కొన్ని పనులను పరికించి చూస్తే ఈ పనులు ప్రజల కోసం, వారి అవసరాల కోసం, మౌలిక వసతుల కోసం జరుగుతున్నాయా లేక కాంట్రాక్టర్లను లబ్ధి పొందించేందుకు జరుగుతున్నాయా ? అన్న విధంగా జరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ నేతల, మున్సిపల్ మంత్రి నోటి నుంచి వందల కోట్ల గణాంకాలు వినిపిస్తున్నాయి. కానీ అవి క్షేత్రస్థాయిలో నూరు శాతం ప్రజలను సంతృప్తిపరచడం లేదన్నది నిర్విదాంశం.
ఉదాహరణకు 27 కోట్లతో నగరంలో ఇరిగేషన్ కాలువలను కుదించి సీసీ కాంక్రీట్ కాలువలుగా నిర్మించే పనులు జరుగుతుండగా, వాస్తవానికి ఈ పనులలో కొన్ని ఎన్‌సీసీ లాంటి పేరొందిన సంస్థ టెండర్ దక్కించుకోగా, క్షేత్రస్థాయిలో ఆ పనులను విడివిడి ముక్కలు చేసి సిటీ పరిధిలోని టీడీపీ కార్యకర్తలను కాంట్రాక్టర్లుగా మార్చి వారికి నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం మనుమసిద్ధి నగర్ ఆర్చ్ సమీపంలో జరుగుతున్న పనులు ఈ బాపతే. అలాగే రామ్మూర్తి నగర్, అనగుంట, కర్నాలమిట్ట వద్ద జరుగుతున్న పనులే ఇందుకు నిదర్శనం. ఈ పనులు నెలల తరబడిగా ఆగి ఆగి సాగుతున్నాయి. కొన్నిచోట్ల ఆలస్యం కావడంతో ఇందులో వాడుతున్న స్టీల్ కూడా తుప్పుపట్టి కనిపిస్తుంది.
ఇక సిటీ నియోజకవర్గ పరిధిలో ఎల్ అండ్ టీ లాంటి బడా కాంట్రాక్టర్‌కు మురుగునీటి కాలువల పనులను అప్పగించారు. అయితే పనుల్లో ఆ సంస్థ పేరు ఉంది తప్ప క్షేత్రస్థాయిలో ఆ సంస్థవారు ఆ పనులను గుంటూరు తదితర జిల్లాలకు చెందిన తమ అనునూయులైన కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులు పరమ నాసిరకంగా ఉంటున్నాయి. సీసీ డ్రైన్లు కట్టాల్సి ఉండగా సెల్ఫ్ క్లీనింగ్ విధానంలో నిర్మించకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తూ, భవిష్యత్తులో నీరు ముందుకు పోయే వాలు తలాలను గాలికి వదిలేసి దోమల హేచరీలను నిర్మిస్తున్నారా అన్న విధంగా నిర్మిస్తున్నారు. ఈ సీసీ పనులకు సరైన వాటర్ క్యూరింగ్ చేయడం లేదు. మున్సిపల్ మంత్రి పి. నారాయణ అభివృద్ధి మంత్రం జపిస్తున్నా ఆ జప ఫలితాలు క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు.
2007లో అప్పటి ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి 19 కోట్లు ఖర్చుపెట్టి ఫౌంటైన్లు, డివైడర్లు, ఐలాండ్లు నిర్మిస్తే, ఆనాడు ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి కొన్నాళ్లకే పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ 10 కోట్లతో పున:నిర్మిస్తున్నారు. పాత పనులకు కొత్త మెరుగులు దిద్దుతూ నిధుల స్వాహాకు తెర తీసినట్లు ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎండ్ టు ఎండ్ రోడ్లు ,పార్కుల అభివృద్ధి, ఐలాండ్ల అభివృద్ధి, ఫౌంటైన్ల అభివృద్ధి పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇవేవీ శాశ్వతం కాని, గ్యారంటీ కాని పనులే. మరో రెండేళ్ల నాటికి ఈ పనుల్లో ఎంతవరకు మిగులుతాయో, మరి ఎంతవరకు శిథిలావస్థకు చేరుకుంటాయో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
నగరంలో ఇంకా కచ్చా రోడ్లు, కచ్చా డ్రైన్లు చేయాల్సినవి మిగిలి ఉన్నాయి. వాటి జోలికి పోకుండా రేపటి రోజున జవాబుదారీ లేని పనులను, మన్నికలు లేని పనులను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ప్రజలు ఇరుకైన రోడ్లతో, మురుగునీరు పోని కాలువలతో ఇబ్బందులు పడుతుండగా, ముందు చేయాల్సిన పనులను వదిలేసి ఏవేవో పనులు అభివృద్ధి పేర చేసి పారేస్తున్నారు.
8.40 కోట్ల ఖర్చుతో మహిళా సాధికారత పేరుతో మైపాడు రోడ్డులో నిర్మించిన స్మార్ట్ బజార్ ఏడాది తిరగకముందే మూలపడింది. ఇక్కడ సుమారు 120 దుకాణాలు నిర్మించగా, వాటిలో 35 శాతానికి పైగా ప్రస్తుతం వ్యాపారాలు జరగక షట్టర్లు వేసుకొని ఉన్నారు. మరో 10 శాతం మంది నెలకు 4 వేల వంతున వేరే వాళ్లకు లీజులకు ఇచ్చి ఉన్నారు. ఇది స్మార్ట్ బజారా లేక ప్రభుత్వ నిధులు మింగేసిన మాయాబజారా అని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించుకుంటున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికంటూ 1.70 కోట్లతో సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కానీ అవి ఉపయోగపడకుండా మూలపడ్డాయి. వాహనదారులు ఎవ్వరూ ఇప్పుడు సిగ్నల్స్‌ను పట్టించుకోవడం లేదు. మహానగరాల్లో నిర్మించాల్సిన ఏసీ బస్‌స్టాప్‌లను నగరంలో అక్కడక్కడా నిర్మించారు. కానీ ఆ బస్‌స్టాప్‌ల్లో ప్రస్తుతం మందుబాబులు, సోమరులు మాత్రమే సేదతీరుతున్నారు.
నగరంలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించే లక్ష్యమంటూ 12,500 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు మొత్తం 6,480 వంతున ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆ మొక్కల్లో 1,000 మొక్కలకు పైగా చచ్చిపోయి గుంతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నగరంలో ఐలాండ్లను ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వెడల్పు చేయడం, కుదించడం.. ఇలా వెర్రితలలు వేస్తున్న అభివృద్ధి జరుగుతుంది. కలర్‌ఫుల్ లైటింగ్స్ అంటూ డివైడర్లలోని స్తంభాలకు రంగురంగుల విద్యుత్ సరాలను చుట్టేస్తున్నారు. అయితే అవి పట్టుమని పది నెలలు కూడా పనిచేయడం లేదు.
సీఎస్‌ఆర్ నిధులంటూ వందల కోట్లు తెచ్చి పాఠశాలల అభివృద్ధి పేరుతో ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ నిధులు కూడా పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు. వీటిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న పనులలో నాణ్యత , మన్నికలు ఉండటం లేదు. కారణం అధికార పార్టీ కార్యకర్తలకే కాంట్రాక్టులు అప్పజెప్పడం, నిధులు తెచ్చి అంచనాలు తయారయ్యి శంకుస్థాపనలు జరిగిన తర్వాత ఆ పనుల నిర్మాణంపై సరైన పర్యవేక్షణ బాధ్యతలు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిధులు తేవడం ఒక ఎత్తయితే, ఆ తెచ్చిన నిధులను క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు అవుతుంది. కానీ ఆ రెండో విధానాన్ని మంత్రి నారాయణ పూర్తిగా మరచి అటకెక్కించడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని మేధావులు అంటున్నారు. నిధులు తెచ్చిన మంత్రి నారాయణ ఆ పనుల పర్యవేక్షణను ఆ తర్వాత కాలంలో మరచిపోతుండడం పైన తెలిపిన ప్రభుత్వ శాఖల ఇంజినీర్లకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది .
ఇక పండుగల పేరుతో, పబ్బాల పేరుతో గేటు పండగ, ఏటి పండగ, పెద్దల పండుగ, గాలిపటాల పండుగ ఈవెంట్ లంటూ కోట్లు తగలేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అవినీతి అక్రమాలే జరిగితే విమర్శించినవారే ఇప్పుడు అదే బాటలో నడవటం గమనార్హం. నారాయణ వైఖరిని గమనించిన కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా మారి, నారాయణ తెస్తున్న అభివృద్ధి నిధులను వీలైనంతవరకు స్వాహా చేసుకోవడానికి దారులు వెతుక్కొని అందులో కృతకృత్యులు అవుతున్నారు.
సంబంధిత పర్యవేక్షణ చేయాల్సిన శాఖల ఇంజినీరింగ్ అధికారులు మాత్రం పర్యవేక్షణలను గాలికి వదిలేసి పర్సంటేజీల వేటలో కోట్లు గడిస్తూ మురిసిపోతున్నారు. ఒక ప్రణాళిక లేని అభివృద్ధితో నగరంలో కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోతుంది. ఇంత జరుగుతున్న క్వాలిటీ కంట్రోల్ , విజిలెన్స్ , ఏ సి బి లాంటి నిఘా విభాగాలు సైతం పట్టించుకోకుండా ఉండిపోతున్నాయి .