వార్త ముఖ్యాంశాలు
- *పార్టీ కార్యాలయంలో ఘనంగా భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు**చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే చదలవాడ* పల్నాడు: నరసరావుపేట, మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ అణు శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని…
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
*పార్టీ కార్యాలయంలో ఘనంగా భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు**చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే చదలవాడ*
పల్నాడు: నరసరావుపేట,
మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ అణు శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ అబ్దుల్ కలాం కేవలం ఒక శాస్త్రవేత్త లేదా రాష్ట్రపతి మాత్రమే కాదని, కోట్ల మంది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని రగిలించిన మహోన్నత చైతన్యశీలి అని కొనియాడారు. రామేశ్వరంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, పేపర్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి, స్వయంకృషితో భారత అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను అందుకోవడమే కాక, దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్కు విశిష్ట గౌరవం తెచ్చిన అసాధారణ వ్యక్తిత్వం కలాం దని ఎమ్మెల్యే గుర్తుచేశారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించి ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతికెక్కిన కలాం, పోఖ్రాన్-2 అణు పరీక్షల విజయంతో భారత రక్షణ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు.
రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు సామాన్యులను సైతం ఆత్మీయంగా పలకరించి ‘ప్రజల రాష్ట్రపతి’గా (పీపుల్స్ ప్రెసిడెంట్) ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. “నిద్రలో వచ్చేది కల కాదు.. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేదే అసలైన కల” అంటూ ఆయన యువతకు ఇచ్చిన సందేశం నేటికీ అజరామరమని, దేశ ప్రగతి యువత చేతుల్లోనే ఉందని కలాం బలంగా నమ్మారని ఎమ్మెల్యే అన్నారు.
ఆయన కలలుగన్న వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా విద్యార్థులు ఆయన చూపిన శాస్త్రీయ దృక్పథం, సమగ్రత, క్రమశిక్షణలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. చివరి శ్వాస వరకు విద్యార్థులకు బోధిస్తూ, విజ్ఞానాన్ని పంచుతూ జీవించిన కలాం జీవితమే ప్రతి భారతీయుడికి గొప్ప పాఠమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన విభాగ సభ్యులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలాం గారి సేవలను స్మరించుకున్నారు.
