మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావుకు ప్రేమపూర్వక స్వాగతం లభించింది. తీన్మార్, డప్పు వాయిద్యాల నడుమ తమ గ్రామానికి వచ్చిన విక్కుర్తికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.
కే కొత్తపాలెం గ్రామంలో ఆర్.సి కరకట్ట ప్రక్కన ఎస్సీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను ప్రారంభించడంతో పాటు జెండాను విక్కుర్తి ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో పిఎసిఎస్ పక్కనగల కమ్యూనిటీ భవనంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చందన రంగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి, విక్కుర్తి శ్రీనివాస్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు లు ప్రసంగించారు.
వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి విక్కుర్తి మాట్లాడారు. కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదన్నారు. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవలను కొనియాడారు. ఆపద కాల సమయంలో గ్రామంలో కార్యకర్తలకు అండగా నిలిచిన చందన రంగారావును ఈ సందర్భంగా విక్కుర్తి అభినందించారు.
తమ గ్రామానికి మండల పరిషత్ నిధులు కేటాయించి, ఇటీవల పదవీ విరమణ పొందిన మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి – రావి నాగేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి తో పాటు కార్యక్రమానికి హాజరైన అతిథులను చందన రంగారావు సన్మానించారు.


