వార్త ముఖ్యాంశాలు
- వీధి కుక్కైనా, ఇంట్లో పెంచుకునే ముద్దుల కుక్కైనా...
- అదుపుతప్ప గాటు వేస్తే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది వంటింట్లోని కారం పొడో, పసుపో, లేక గాయం కనపడకుండా కట్టేసే గట్టి కట్టో!
- రేబిస్ అనే ప్రాణాంతక వైరస్‌కు ఈ నాటు చిట్కాలంటే అస్సలు భయం ఉండదు; కానీ దానికి వెన్నులో వణుకు పుట్టించే ఏకైక ఆయుధం మన ఇంట్లోని సబ్బు మాత్రమే.
వీధి కుక్కైనా, ఇంట్లో పెంచుకునే ముద్దుల కుక్కైనా… అదుపుతప్ప గాటు వేస్తే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది వంటింట్లోని కారం పొడో, పసుపో, లేక గాయం కనపడకుండా కట్టేసే గట్టి కట్టో! రేబిస్ అనే ప్రాణాంతక వైరస్‌కు ఈ నాటు చిట్కాలంటే అస్సలు భయం ఉండదు; కానీ దానికి వెన్నులో వణుకు పుట్టించే ఏకైక ఆయుధం మన ఇంట్లోని సబ్బు మాత్రమే.
కుక్క కరవగానే ఆసుపత్రికి పరిగెత్తే ముందు, ఇంట్లోనే చేయాల్సిన అత్యంత కీలకమైన పని గాయాన్ని పద్ధతి ప్రకారం కడగడం. ఇక్కడ సువాసనలు వెదజల్లే ఒంటి సబ్బు కంటే బట్టలు ఉతికే సర్పే లేదా బట్టల సబ్బే (Alkaline soap) ఎంతో శ్రేష్టం. ఎందుకంటే బట్టల సబ్బులోని క్షార గుణం రేబిస్ వైరస్ పైపొరను పిండిపిండి చేసి నాశనం చేస్తుంది. అయితే చాలామంది గాయంపై పైపైన కాస్త సబ్బు రుద్ది వదిలేస్తుంటారు. అలా పైపైన రుద్దితే ఏమాత్రం లాభం ఉండదు; పంటి గాటు లోపలికి సబ్బు నురగ, నీళ్లు వెళ్లాలి. కొళాయి (ట్యాప్) విప్పి, ధారగా పారే నీటి కింద గాయాన్ని ఉంచి, కనీసం 15 నిమిషాల పాటు లోపలికి నీళ్లు వెళ్లేలా కడగాలి. ఒకవేళ ఇంట్లో కొళాయి సదుపాయం లేకపోతే, ఒక మగ్గుతో ఎత్తు నుంచి నీళ్లు తీసుకుని గాయం లోపలికి ధారగా వేగంగా పడేటట్టు పోస్తూ శుభ్రం చేయాలి.
ఇలా 15 నిమిషాలు లోపలి దాకా క్షుణ్ణంగా కడిగితే గాయంలోని 80 నుండి 90 శాతం వైరస్ అక్కడికక్కడే కొట్టుకుపోతుంది. ఆ తర్వాత బెటాడిన్ పూసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ సలహాతో యాంటీ-రేబిస్ టీకాలు (ARV), అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్ వేయించుకుంటే నూటికి నూరు శాతం ప్రాణాపాయం తప్పుతుంది. గుర్తుంచుకోండి… కుక్క కరిచాక కంగారుపడటం కంటే, బట్టల సబ్బుతో లోతుగా కడగడమే అసలైన సంజీవని!