ఒకటి ఒంట్లో చక్కెర పెంచుతుంది, మరొకటి రక్తనాళాల్లో ఒత్తిడి పెంచుతుంది. వైద్య పరిభాషలో డయాబెటిస్ (షుగర్), హైపర్టెన్షన్ (బీపీ) రెండూ వేర్వేరు వ్యాధులే. కానీ మన శరీరంలో మాత్రం మంచి స్నేహితుల్లా కలిసి తిరిగే ‘తోడు దొంగలు’. ఒకటి ఒంట్లోకి ప్రవేశిస్తే మరొకటి కూడా వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
*ఈ రెండింటి మధ్య ఉన్న పరస్పర బంధం చాలా బలమైనది.* బీపీ ఉన్నవారికి షుగర్ వచ్చే ముప్పు సాధారణ వ్యక్తుల కంటే 2 నుంచి 2.5 రెట్లు ఎక్కువ. అలాగే షుగర్ ఉన్నవారిలో రక్తపోటు వచ్చే అవకాశం మరింత అధికం. డయాబెటిస్ బాధితులలో ప్రతి పది మందిలో దాదాపు ఆరు నుంచి ఎనిమిది మందికి బీపీ వచ్చి చేరుతుంది.
*ఈ ఇద్దరికీ ఇంత స్నేహం ఎలా కుదిరింది?
అధిక బరువు* , పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఇన్సులిన్ నిరోధకత వంటి అంశాలు రెండింటికీ ఉమ్మడి కారణాలు.
వీటిని అదుపులో ఉంచుకోవడం ఎలా?
రోజూ కనీసం 30 నిమిషాలు చురుగ్గా నడవాలి. ఉప్పు, చక్కెర, నూనె పదార్థాలను తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగతాగడం, మద్యపానం మానుకోవాలి. నియమితంగా బీపీ, రక్తంలో చక్కెర పరీక్షలు చేయించుకుంటూ, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
షుగర్ ఉన్నవారు రక్తంలో చక్కెర అదుపులో ఉండటానికి తీపిని తగ్గించుకోవాలన్నది తెలిసిన విషయమే. అయితే వీరు బీపీ రాకుండా ఉప్పును కూడా తగ్గించుకోవాలి. అలాగే బీపీ ఉన్నవారు ఉప్పుతో పాటు షుగర్ రాకుండా చక్కెర, అధిక కేలరీల ఆహారాన్ని తగ్గించాలి. బీపీ, షుగర్ రెండు లేని వారు కూడా ఉప్పు, చక్కెరలు రెండింటినీ పరిమితంగా తీసుకుంటే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది.
షుగర్, బీపీలు వచ్చాక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సరైన జీవనశైలి, వ్యాయామం, మందులతో వాటిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవచ్చు. మన ఆరోగ్యమనే ఇంట్లో ఈ తోడు దొంగలకు చోటివ్వకండి!
డాక్టర్ ఎం.వి రమణయ్య
సీనియర్ వైద్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నెల్లూరు.
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు.





వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్