కంచర్లవారిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
కనిగిరి, అక్టోబర్ 10: ( కె టి సి పున్నమి ప్రతినిధి)
కంచర్ల వారి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సి. విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్, సైకాలజిస్ట్ డా. కె.టి.సి. పాపారాయుడు మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులు చదువులో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పరీక్షల భయాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థులు సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని, తమ సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా కౌన్సిలర్లతో పంచుకోవాలని పేర్కొన్నారు. మానసిక సమస్యలు ఎదురైనప్పుడు సహాయం కోరడం బలహీనత కాదని, సరైన సమయంలో తగిన సహాయం పొందడం ఎంతో ముఖ్యమని వివరించారు.
ప్రతి విద్యార్థి తన సామర్థ్యాలను గుర్తించి, ఇతరులతో పోల్చుకోకుండా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి, విద్యా పురోగతికి తోడ్పడవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సి. విజయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










