Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

ఐదుతరాల అపురూప సమ్మేళనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐదుతరాల అపురూప సమ్మేళనం

వార్త ముఖ్యాంశాలు

  • ఈ సమ్మేళనంలో 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషంగా నిలిచింది.
  • సామాన్య నేపథ్యం నుంచి జీవితం ప్రారంభించిన ఈ కుటుంబం, చదువునే ఆయుధంగా మలుచుకుని తరం తరంగా ఎదిగి, నేడు వివిధ రంగాల్లో నాయకత్వ స్థానాలకు చేరుకోవడం అనేక మందికి స్ఫూర్తినిచ్చింది.
  • వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పూర్వీకులు ఎదుర్కొన్న కష్టాలను స్మరించుకుంటూ, నేటి తరాల విజయాలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
ఒక్క వేదికపై 200 మంది కుటుంబ సభ్యులు హైదరాబాద్/మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతూ, కుటుంబ విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత కాలంలో ఐదు తరాల వారసులు ఒకే వేదికపై కలుసుకున్న అపురూప ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్‌లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కుటుంబ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది సభ్యులు ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకున్నారు.

ఈ సమ్మేళనంలో 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. సామాన్య నేపథ్యం నుంచి జీవితం ప్రారంభించిన ఈ కుటుంబం, చదువునే ఆయుధంగా మలుచుకుని తరం తరంగా ఎదిగి, నేడు వివిధ రంగాల్లో నాయకత్వ స్థానాలకు చేరుకోవడం అనేక మందికి స్ఫూర్తినిచ్చింది.

వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పూర్వీకులు ఎదుర్కొన్న కష్టాలను స్మరించుకుంటూ, నేటి తరాల విజయాలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. మూలాలను మరువకుండా, విద్య ద్వారా జీవితాన్ని మలుచుకోవచ్చని ఈ కుటుంబం మరోసారి నిరూపించిందని పలువురు వ్యాఖ్యానించారు. పెద్దల ఆశీస్సులు, చిన్నారుల చలాకితనం కలగలసిన ఈ కార్యక్రమం ఒక మధుర అనుభూతిగా నిలిచింది.

ఈ సందర్భంగా కొంతం కిష్టయ్య కుటుంబ వంశవృక్షాన్ని చిత్రరూపంలో ప్రదర్శించారు. అనంతరం ప్రతి కుటుంబ శాఖకు చెందిన సభ్యులు తమ పరిచయాలను చేసుకున్నారు. చిన్నారుల కళా ప్రదర్శనలు, ఆటపాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ సమ్మేళనానికి రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించింది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, అలాగే విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చలిని, ప్రయాణ వ్యయప్రయాసలను లెక్కచేయకుండా కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యుల ఫొటోలు, పరిచయాలతో కూడిన ప్రత్యేక స్మారక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని, తరతరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *