ఎస్సీ వర్గీకరణకు సార్థకత ఎక్కడ? గాయక్వాడ్ తులసిదాస్,
మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
———————————————————————
జనగామ,సెప్టెంబర్ 4,పున్నమి జిల్లా ప్రతినిధి :
తరతరాలుగా ఎదురవుతూ వస్తున్న వివక్ష, అసమానతలను నిర్మూలించడంలో భాగంగా సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ ఎస్సీ వర్గీకరణతో కొన్ని కులాలు రిజర్వేషన్ల పరంగా నష్ట పోవడమే కాకుండా చివరకు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణతో తెలంగాణ రాష్ట్రంలోని … కొన్ని కులాలకు ఆ వర్గీకరణ ఫలాలు అందకుండా పోతున్నాయి. ఇది తెలంగాణలోని అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల ప్రజల ముందున్న అతి ప్రధానమైన ప్రశ్న.
01.08.2024 రోజున భారత సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నెం.2317 / 2011 ) కేసులో షెడ్యూల్డ్ కులాలలో ఉపవర్గీకరణ డిమాండ్ న్యాయబద్ధమైనది చెబుతూనే, సామాజిక వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.
ఈ చారిత్రాత్మక తీర్పు యొక్క అసలు ఉద్దేశం రిజర్వేషన్ ప్రయోజనాలు ఇప్పటికే కొంతమేర లబ్ధి పొందిన కులాలకే పరిమితం కాకుండా, అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల ప్రజలకు కూడా సమాన అవకాశాలు అందేలా చేయడం. అదే నిజమైన సామాజిక న్యాయం.
తెలంగాణలో వర్గీకరణ – కానీ ఫలితం ఎంత?
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ఫలాల పంపిణీకి శాసనబద్దంగా చర్యలు తీసుకున్నది. Telangana Scheduled Castes (Rationalisation of Reservations) Act, 2025 ( Act No.15 of 2025) ద్వారా ఎస్సీలోని 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఈ చట్టం ప్రకారం గ్రూప్ – 1లో 15 కులాలను చేర్చి, ఎస్సీలకు కేటాయించిన 15% రిజర్వేషన్‌లో 1 శాతం గ్రూప్ – 1కి, 9 శాతం గ్రూప్ – 2కి, 5 శాతం గ్రూప్ – 3కి కేటాయించారు. గ్రూప్ – 1 జాబితాలో బావురి, బేడ (బుడ్గ) జంగం, చచాటి, దక్కలి, జగ్గలి, పంబాల, మాంగ్, మాంగ్ గరోడి, మన్నే, మాష్టీ, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు మొదలగు 15 కులాలు ఉన్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.
అత్యంత వెనుకబడిన 15 కులాలకు కేవలం 1% సరిపోతుందా?.
ఒకవైపు ప్రభుత్వం, తన దగ్గర ఉన్న అన్ని రకాల సమాచారం ఆధారంగా ‘సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన / పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలు’గా ఈ 15 కులాలను ప్రత్యేకంగా గుర్తించి గ్రూప్-1లో చేర్చింది. మరోవైపు జనాభా ఆధారంగా అదే 15 కులాలకు కేవలం 1% రిజర్వేషన్ కేటాయించింది. అంటే, వర్గీకరణ ద్వారా అత్యంత వెనుకబడిన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించినట్లయితే, ఆ వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు ఇచ్చే అవకాశాలు కూడా అదే స్థాయిలో బలంగా ఉండాలి కదా?. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ (Preferential treatment) తో గతం కన్నా వర్తమానం – భవిష్యత్తు ఘనంగా ఉండాలే తప్పా అధ్వానం కాకూడదు.
వెనుకబాటుతనాన్ని గుర్తించి, దానికి తగిన పరిష్కారం ఇవ్వకపోతే వర్గీకరణ చేసి ప్రయోజనం ఏమిటి?.
ఒక్క శాతం రిజర్వేషన్ల కారణంగా సరైన అవకాశాలు రాక గ్రూప్-1 లోని 15 కులాల ప్రజల్లో ఆవేదన, అసంతృప్తి వ్యక్తం అవుతోంది ..
సున్నా పోస్ట్లతో ఉద్యోగ ప్రకటనలు :
అసలు విషయం ఏమిటంటే?, ఉద్యోగ నోటిఫికేషన్‌లలో “SC Group-I”కు పోస్టులే కేటాయించడం లేదు. పోస్టుల సంఖ్య సున్నాగా నిర్ణయించినప్పుడు రిజర్వేషన్ అమలు చేయనట్లే కదా?. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లు అమలు చేయనప్పుడు వర్గీకరణ వల్ల ఉపయోగం ఏమిటి?. వర్గీకరణ అమలులో మరో ముఖ్యమైన సమస్య, ఇప్పుడిప్పుడే ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్న ఈ కులాల విద్యార్థులకు (గ్రూప్-1) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల నోటిఫికేషన్లలో వాస్తవంగా ఎన్ని అవకాశాలు లభిస్తున్నాయి?. గత సంవత్సరం వైద్య విద్య ప్రవేశాల సందర్భంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ వర్గాల వారు వర్గీకరణ ఫలాలు మొదటిసారిగా అధిక సంఖ్యలో పొందారని సంతోషించాము. కానీ ప్రభుత్వం విడుదల చేసిన వివిధ ఉద్యోగ ప్రకటనలలో ఎస్సీ గ్రూప్-1కి కేటాయించిన పోస్టుల సంఖ్య ‘౦’ గా చూపబడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో కూడా శూన్యమే. నల్సార్ యూనివర్సిటీలో ఎస్సీ గ్రూప్-1 కులాల వారికీ న్యాయ విద్య చదువుకోవడానికి ప్రవేశానికి అధికారికంగా అనుమతి లేదు. ఎందుకంటే కేటాయించబడిన సీట్ల సంఖ్య ‘౦’. అంటే భవిష్యత్తులో ఈ కులాల వారు న్యాయవాద / న్యాయమూర్తి వృత్తిలో కనిపించే అవకాశం ఉండదు.
గతంలో 15 % రిజర్వేషన్ వల్ల ఆశతోనైనా ఈ 15 కులాల వాళ్లు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారు. ప్రస్తుతం 1% రిజర్వేషన్ అమలు వల్ల పోటీలో నిలబడనివ్వకుండానే, మీరు అర్హులు కారంటూ, ఆదుకోవాలసిన ప్రభుత్వమే వివక్షను చూపినట్లయింది.
ప్రశ్న కేవలం “1% ఇచ్చారా లేదా?” అన్నది కాదు.
“Group-Iలోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఆ 1% రిజర్వేషన్ ప్రతి నియామకంలో, ప్రతి విద్యా ప్రవేశంలో, ప్రతి సంబంధిత అవకాశంలో వాస్తవంగా ఎలా చేరుతోంది?” అన్నదే ప్రశ్న.
రిజర్వేషన్ పత్రంలో ఉండటం కాదు … జీవితాల్లో కనిపించాలి.
రిజర్వేషన్ అంటే కేవలం ప్రభుత్వ ఉత్తర్వులో ఒక శాతం అని రాయడం కాదు. అది, అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు చెందిన ఒక పేద విద్యార్థికి ఉన్నత విద్యలో సీటు దక్కాలి, ఒక యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం దక్కాలి. ఒక కుటుంబానికి ఆర్థిక, సామాజిక స్థిరత్వం రావాలి. తరతరాలుగా అవకాశాలకు దూరంగా ఉన్న సమాజానికి కొత్త మార్గం తెరుచుకోవాలి. ప్రభుత్వ సంస్థల్లో ఆ వర్గానికి తగిన ప్రాతినిధ్యం పెరగాలి, అప్పుడే రిజర్వేషన్‌కు అర్థం ఉంటుంది. లేకపోతే “రిజర్వేషన్ ఉంది” అని కాగితంపై కనిపించినా, “ప్రయోజనం లేదు” అనే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఇదే జరుగుతున్నది.
సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి ఏమిటి?
దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎస్సీ కులాలలో ఉపవర్గీకరణను కేవలం పరిపాలనా విభజన అంశముగా చూడలేదు. వాస్తవంగా అత్యంత వెనుకబడిన కులాలకు ప్రయోజనం చేరేలా substantive equality సాధించడమే దాని రాజ్యాంగ తాత్పర్యం. రాష్ట్రం ఏ వర్గాన్ని లేదా కులాలను మరింత వెనుకబడినదిగా గుర్తిస్తే, దానికి తగిన ప్రాతినిధ్యం మరియు అవకాశాలను కల్పించడానికి ఆధారపూర్వక చర్యలు తీసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణ యొక్క తుది లక్ష్యం “వర్గీకరణ” కాదు — “సామాజిక న్యాయం”. అట్టడుగున ఉన్న, అభివృద్ధికి నోచుకోని కులాలకు అధిక అవకాశాలు కల్పించి ప్రగతి బాట పట్టించి గౌరవంగా బ్రతికేటట్లు చూడడం.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి:
గ్రూప్-1లోని 15 కులాల ప్రజలలో సహజంగానే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 1% రిజర్వేషన్ వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలను ఇస్తుంది?. ఎన్ని విద్యా సీట్లు లభిస్తాయి?. ప్రతి నోటిఫికేషన్‌లో గ్రూప్-1వారికీ ఏవిధంగా ప్రయోజనాలు లభిస్తున్నాయి?. “0” పోస్టులు చూపబడుతున్నప్పుడు ఆ 1% రిజర్వేషన్ ఎప్పుడు, ఎలా ప్రయోజనం కలిగిస్తుంది?. ఈ కులం ప్రజలు ఇతర వర్గాలకు సమానంగా ఎప్పుడు అభివృద్ధిలోకి రాగలుగుతారు ?. అత్యంత వెనుకబడిన 15 కులాలకు వాస్తవ ప్రాతినిధ్యం పెరుగుతోందా?. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం డేటాతో కూడిన పారదర్శక సమాధానం ఇవ్వాలి. అవసరమైతే ప్రతి నియామక సంస్థ, ప్రతి విద్యా సంస్థలో గ్రూప్-1కి కేటాయించిన పోస్టులు / సీట్లు, భర్తీ అయిన పోస్టులు, మిగిలిన పోస్టులు వంటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
వర్గీకరణ పేరు కోసం కాదు … న్యాయమైన హక్కు కోసం :
ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో సంవత్సరాలుగా జరిగిన పోరాటం యొక్క అసలు ఉద్దేశం ఒక కొత్త క్యాటగిరి సృష్టించడం కాదు. అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు కూడా రాజ్యాంగం కల్పించిన అవకాశాల ఫలాలు అందించడం. అందుకే గ్రూప్-1లోని 15 కులాలకు కేటాయించిన 1% రిజర్వేషన్ నిజ జీవితంలో కనిపించే ఫలితాలను ఇవ్వాలి. వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగం మొదలగు వాటిలో ప్రాతినిధ్యం పెరగకపోతే ప్రజల్లో సహజంగానే ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. “వర్గీకరణ జరిగింది … మరి సామాజిక న్యాయం ఎక్కడ?”.
ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులో ఉండకూడదు. ఉద్యోగాల్లో కనిపించాలి. విద్యా సంస్థల్లో కనిపించాలి. అన్ని స్థాయిలలోని ఉద్యోగాల్లో స్పష్టంగా కనబడాలి. ప్రభుత్వ ప్రాతినిధ్యంలో కనిపించాలి. అత్యంత వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో కనిపించాలి. అప్పుడే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి నెరవేరుతుంది. అప్పుడే తెలంగాణ ఎస్సీ వర్గీకరణకు నిజమైన అర్థం వస్తుంది. లేకపోతే — వర్గీకరణ పేరులోనే ఉంటుంది … కానీ సామాజిక న్యాయం మాత్రం ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.
సంఘాలు – నాయకులు మౌనం :-
ఎస్సీ గ్రూప్ 1 & 2 వర్గాల సమస్యలు, డిమాండ్ల కోసం గొంతుకగా వివిధ సంఘాలు, నాయకులూ, మేధావి వర్గం, ప్రజాప్రతినిధులు, చివరకు మంత్రులు కూడా ముందుకు వస్తారు. కానీ గ్రూప్ 1 వర్గాల కోసం అందరు మౌనం పాటిస్తారు. దురదృష్టం ఏంటంటే ఈ కులాల వారిలో సమర్ధుడైన బలమైన ఒక్క నాయకుడు లేక పోవడం ఒక కారణమైతే వీరికి సమస్యను ఎలా? ఎక్కడ? సమర్థవంతంగా చెప్పాలో తెలియకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చును. అందరు వీరిని అవసరానికి అనుగుణంగా వాడుకున్నారే తప్పా చేయి అందించిన వారెవ్వరూ లేరనేది వాస్తవం.
ప్రభుత్వం – తక్షణ చర్యలు :
గ్రూప్-1లో గుర్తించిన 15 అత్యంత వెనుకబడిన, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎస్సీ కులాలకు కేటాయించిన 1% రిజర్వేషన్ వలన వాస్తవంగా జరిగిన మార్పులు, అభివృద్ధి అన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలి. ప్రతి ఉద్యోగ, విద్యా నోటిఫికేషన్‌లలో గ్రూప్-1వారికీ రిజర్వేషన్ ఫలాలు ఖచ్చితంగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.
ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న గ్రూప్-1 కులాల వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు వాస్తవంగా చేరేలా అనగా అర్హులైన అభ్యర్థులు లేని సందర్బంలో ఆ సీట్లు / పోస్ట్లు ఇతరులచే భర్తీ చేయకుండా, ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి, తర్వాత ఇదే గ్రూప్ వారితో భర్తీ చేస్తూ న్యాయం చేయాలి.
ఎందుకంటే? ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం కాదు … అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు న్యాయం జరిగితేనే వర్గీకరణ సార్థకం.” సామాజిక న్యాయం కోసం — సమాన అవకాశాల కోసం — అత్యంత వెనుకబడిన 15 ఎస్సీ కులాల భవిష్యత్తు కోసం పునఃసమీక్ష నిర్వహించి, రిజర్వేషన్ ఫలాలతో ఈ కులాల వారు గతంలో చూడని అభివృద్ధిని సాధించేవిధంగా మార్పు చూపెట్టాలి. ఒకవేళ 1% తో కల్పించే సదుపాయాలతో మార్పు సాధ్యం కానప్పుడు, ఈ కులాలను గ్రూప్ 2 లో చేర్చి అధిక అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి, లేదా తమిళనాడు రాష్ట్రంలో అమలులో ఉన్న విధంగా ‘ప్రత్యేక ప్రాధాన్యత అంతర్గత రిజర్వేషన్’ లాంటిది లేదా అదనపు రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు చేయాలనీ, సుప్రీమ్ కోర్ట్ తీర్పును అనుసరించి అట్టడుగున ఉన్న అభివృద్ధికి నోచుకోని కులాలకు ఫలాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటూ సరైన సామాజిక న్యాయం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.


