వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, అక్టోబర్ 30 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు పట్టణం జనసంద్రంగా మారింది.
- పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ–ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార మహార్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో సాగిన ఈ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ర్యాలీ అగ్రభాగంలో పుష్పక వాహనాలపై నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా…
మంత్రి ఆనం సారథ్యంలో భారీ ఎన్నికల ప్రచారం
పుష్పక వాహనాలపై ఎంపీ వేమిరెడ్డి, కూటమి అభ్యర్థులు
ఆత్మకూరు, అక్టోబర్ 30 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు పట్టణం జనసంద్రంగా మారింది. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ–ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార మహార్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో సాగిన ఈ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ర్యాలీ అగ్రభాగంలో పుష్పక వాహనాలపై నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ జెండాలు చేతబూనిన కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణ ప్రధాన వీధుల్లో సందడి నెలకొంది. మార్గమధ్యంలో పలుచోట్ల స్థానికులు నాయకులకు ఘనస్వాగతం పలికారు. దీవెనలు, హారతులతో అభినందించారు.
మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా సహా వివిధ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 1న జరగనున్న పురపాలక ఎన్నికల్లో చైర్పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై, జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తుపై, బీజేపీ అభ్యర్థులకు కమలం గుర్తుపై ఓట్లు వేసి కూటమికి మద్దతు తెలపాలని కోరారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు రూ.5,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోనే సుమారు రూ.120 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించడంతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే అనుభవం కలిగిన నాయకత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వ సహకారంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు, కార్యక్రమాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారానికి చివరి రోజున నిర్వహించిన ఈ మహార్యాలీ ద్వారా కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేశారు. భారీగా తరలివచ్చిన జనసందోహంతో పట్టణంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ర్యాలీ విజయవంతం కావడంతో టీడీపీ–ఎన్డీయే శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరి గిరి నాయుడు , యువనాయకులు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి , పట్టనాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి , ఆనం తనయ లీలాకైవల్యరెడ్డి , బిజెపి జిల్లా సినియర్ నాయకులు కరటంపాటి సుధాకర్ రెడ్డి , యువనాయకులు కోడూరు శ్రావణ్ కుమార్ రెడ్డి . చల్లా రవికుమార్ రెడ్డి ,కేతా వేణుగోపాల్ రెడ్డి ,కేతా విజయభాస్కర్ రెడ్డి ,కొండ్రెడ్డి రమణారెడ్డి 27 వార్డుల కూటమి అభ్యర్దులు టీడీపీ–ఎన్డీయే నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు .

