వార్త ముఖ్యాంశాలు
- -రేపటి రోజున సిటీ కి నేతగా నిలిచేది అనిలా?
- చంద్రశేఖర్ రెడ్డా ?
- -కార్యకర్తల్లో అభద్రతా భావం -సిటీలో రేపటి వైసీపీ పెత్తనం పర్వతరెడ్డిదా, అనిల్‌దా?
-రేపటి రోజున సిటీ కి నేతగా నిలిచేది అనిలా? చంద్రశేఖర్ రెడ్డా ?
-కార్యకర్తల్లో అభద్రతా భావం
-సిటీలో రేపటి వైసీపీ పెత్తనం పర్వతరెడ్డిదా, అనిల్‌దా?
-ఏ వైపు ఉంటే మంచిదన్న చర్చలు
-జగన్ మా నేతే… కానీ సిటీలో ఈ వర్గాలేమిటి?
నెల్లూరు సిటీ నియోజకవర్గ వైసీపీలో ప్రస్తుతం అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2024 వరకు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి, వైసీపీలో తిరుగులేని నాయకుడిగా చలామణి అయిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు నుంచి నరసరావుపేటకు వెళ్లి అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ గాలిలో ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలు నెల్లూరుకు దూరంగా ఉండటంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి తనదైన శైలిలో పనిచేస్తూ, వైసీపీ కార్యకర్తలకు దగ్గరయ్యారు. నగరంలో అనేక కార్యక్రమాలకు హాజరవుతూ, సిటీ నియోజకవర్గంలో వైసీపీ వెనకడుగు వేయకుండా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో యువతను ఆకర్షిస్తూ వారిని వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నగరంలో వైసీపీ తిరిగి తన ప్రభావాన్ని కూడగట్టుకునే దశకు వచ్చింది. కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, డీఎస్సీలో జరిగిన లోటుపాట్లను నిలదీస్తూ నిరసనలు, ధర్నాలు నిర్వహించారు.
ఈ దశలో అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ నగర రాజకీయ వ్యవహారాల్లో అప్పుడప్పుడు జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి వర్గంలో ఉన్నవారు సైతం మరోసారి ఆలోచనలో పడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి సిటీ నియోజకవర్గంలో వీరిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది? జగన్ మోహన్ రెడ్డి ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు? అన్న ప్రశ్నలు వారి మధ్య చర్చకు వస్తున్నాయి.
ఇదే సమయంలో అప్పటివరకు చంద్రశేఖర్ రెడ్డికి గట్టి మద్దతుదారుగా ఉన్న వైసీపీ రాష్ట్ర యువజన నేత, 13వ డివిజన్ ప్రస్తుత కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆయనకు మెల్లమెల్లగా దూరమై అనిల్ వైపు అడుగులు వేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే సిటీకి చెందిన కొందరు కార్పొరేటర్లు అప్పటివరకు చంద్రశేఖర్ రెడ్డి బాటలో నడిచి, ఆ తర్వాత అనిల్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. వారిలో వేనాటి శ్రీకాంత్ రెడ్డి, మద్దినేని శ్రీధర్ తదితరులు ఉన్నారు.
ఇప్పుడు సిటీ వైసీపీలో రెండు దారులు ఏర్పడ్డాయని కార్యకర్తలు భావిస్తున్నారు. ఒకటి చంద్రశేఖర్ రెడ్డి దారి కాగా, మరొకటి అనిల్ కుమార్ దారి. దీంతో వారు డోలాయమానంలో పడ్డారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి సిటీ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదని కార్యకర్తలు అంటున్నారు. తామంతా వైఎస్ జగన్‌కు, వైసీపీకి నమ్మిన బంటులమేనని, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. కానీ సిటీలోని పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి వైపు మొగ్గితే మేలా? లేక అనిల్ కుమార్ వైపు మొగ్గితే మేలా? అన్న మీమాంసలో కార్యకర్తలు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్‌మీట్లకు కొందరు హాజరవుతుండగా, అనిల్ కుమార్ ప్రెస్‌మీట్లకు మరికొందరు హాజరవుతూ వారిని వేర్వేరుగా అనుసరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటికి సిటీ నియోజకవర్గ వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుంది? తమ అధినేత జగన్ వీరిద్దరిలో ఎవరి వైపు మొగ్గుతారు? అని ప్రశ్నించుకుంటున్నారు. ప్రస్తుతానికి సరైన సమాధానాలు దొరకకపోవడంతో అటో ఇటో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. కొందరు మాత్రం రెండు పడవలపై కాళ్లు పెట్టలేక, వేచి చూద్దామన్న రీతిలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
జిల్లా వైసీపీలో మరెక్కడా లేని పరిస్థితులు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్పష్టత లేకుండానే జిల్లా పార్టీ రోజులు గడుపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి మాత్రం విమర్శల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్, కోవూరు వైసీపీ ఇన్‌చార్జి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ వేడి పెంచుతున్నారు. వేమిరెడ్డి దంపతులపై అవినీతి, అక్రమాల ఆరోపణలు చేయడం అనిల్, ప్రసన్నలను మినహాయిస్తే మిగతా జిల్లా వైసీపీ నాయకులకు సుతరామూ ఇష్టం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడుకాకపోయినా ఎన్నికల నాటికైనా వేమిరెడ్డి దంపతులు తిరిగి వైసీపీలో చేరతారన్న ఆశ కొందరు నేతల్లో ఉందని, అనిల్, ప్రసన్నల ఆరోపణలు ఆ దారులను మూసేస్తున్నాయని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని జిల్లా నేతలు ఆపలేకపోతున్నారని, అధినేత కూడా నిలువరించడం లేదన్న భావన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జిలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుండగా, నెల్లూరు సిటీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అయోమయానికి తెరదించాలంటే అధినేత వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలే అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారు.