Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

నేర ప్రవృత్తిని వీడి గౌరవప్రదమైన జీవనం సాగించాలి – ఉపాధికి పోలీసుల సహకారం

నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు: క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు

గాజువాక, నవంబర్ 16 (పున్నమి ప్రతినిధి): పాత నేరస్తులు నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా జీవించాలని సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు సూచించారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ అధికారుల ఆదేశాల మేరకు గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఇన్స్పెక్టర్ జి.డి. బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాజువాక ఎస్సై హరికృష్ణ, స్టీల్ ప్లాంట్ ఎస్సై రమణ, దువ్వాడ ఎస్సై సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గతంలో తెలిసో తెలియకో నేరాలకు పాల్పడి పోలీస్ రికార్డుల్లో ఉన్న వ్యక్తులు ఇకనైనా తమ పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. నేరాల వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల భవిష్యత్తు కూడా ప్రభావితమవుతుందని హితవు పలికారు.

నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి నిజాయితీగా జీవించాలనుకునే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ తరఫున సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఉపాధిపై ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించి పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి తగిన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఇకపై దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, నేరాలకు సహకరించినా, నేరస్తులకు ఆశ్రయం కల్పించినా చట్టపరమైన ఆధారాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజలు సహకరించాలి

తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, నేర కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాత నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడం, నేరాల పునరావృతిని అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

మారండి.. మార్పు మీతోనే మొదలవ్వాలి! మంచి మార్గంలో నడిచి కుటుంబానికి అండగా నిలవండి.. సమాజ భద్రతలో భాగస్వాములు కండి!

పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

పాత నేరస్తులకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *