స్వచ్ఛత హి సేవ’ క్యాంపెయిన్‌లో భాగంగా ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్’ కార్యక్రమం
*మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి*
*ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలి*
*పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి*
జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య
విశాఖపట్నం
నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడంలో అధికారులు, సఫాయి మిత్ర పారిశుధ్య కార్మికులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు గురువారం జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని సెంట్రల్ పార్కులో, అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య అధ్యక్షతన, ముఖ్య అతిథిగా హాజరైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి, సౌత్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడుతో కలిసి “స్వచ్ఛత హి సేవ” క్యాంపెయిన్‌లో భాగంగా “ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్” థీమ్‌తో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
అక్టోబర్ 17వ తేదీ వరకు కొనసాగనున్న “స్వచ్ఛత హి సేవ” క్యాంపెయిన్‌లో భాగంగా నగరవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే సెంట్రల్ పార్కులో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామని అదనపు కమిషనర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది కేవలం సఫాయి మిత్ర పారిశుధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు జీవీఎంసీ చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. అధికారులు, సఫాయి మిత్ర పారిశుధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములైనప్పుడే స్వచ్ఛత కార్యక్రమాల లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందని, ఆ దిశగా విశాఖ నగర పరిసరాల పరిశుభ్రతకు,అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పరిసరాల పరిశుభ్రత, ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ, డోర్-టు-డోర్ చెత్త సేకరణతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అతను ఒక కమిషనర సూచించారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛత హి సేవ క్యాంపెయిన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాలను నిర్మించగలమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 వరకు కొనసాగే ఈ క్యాంపెయిన్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డా. కృష్ణంరాజు మాట్లాడుతూ, స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలు తమ ఇళ్ల వద్దనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను రోడ్లు, కాలువలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికే అందించాలని కోరారు.
అనంతరం పరిశుభ్రతను పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పేర్కొంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో “స్వచ్ఛ ప్రతిజ్ఞ” చేయించారు.
ఈ సందర్భంగా నగర పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న సఫాయి మిత్ర పారిశుధ్య కార్మికులను సన్మానించి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు అందిస్తున్న సేవలను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీడీ పద్మావతి, సంబంధిత అధికారులు, సఫాయి మిత్ర పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



