50 శాతం ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి
-ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేసి చెల్లించాలి*
*-CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి*
*-పాఠశాల స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి* టీపీటీఎఫ్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అంకుషావలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) బచ్చన్నపేట మండల కమిటీ సర్వసభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షుడు మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీటీఎఫ్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అంకుషావలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని డిమాండ్ చేశారు.
2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని నేటికీ ప్రకటించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే 50 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేసి చెల్లించాలి అని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్ని ఆసుపత్రులలో వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని, వేతనాలు అందక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ వేతనాలను విడుదల చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 25ను సవరించి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి, ప్రతి సబ్జెక్టుకు తగిన ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలంటే ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడంతో పాటు, బోధనేతర పనుల భారాన్ని తగ్గించి ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు భంగం కలిగిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మహ్మద్ అంకుషావలి కోరారు.
ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా మహిళా కార్యదర్శి ఎం. కవిత, ప్రధాన కార్యదర్శి ఎస్. గిరీష్, రాజేశ్వరి , డి నరసింహారెడ్డి , అమీర్ , కృష్ణమోహన్ , నరసింహ స్వామి, భాస్కర్, R యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


