వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, అక్టోబర్ 19 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై చర్చ మొదలైంది.
- 28 వార్డుల్లో జనసేనకు రెండే సీట్లా..?
- బీజేపీకి ఒక్కటేనా..?

జనసేనకు అన్యాయమేనా..?
ఆత్మకూరు కూటమిలో అసంతృప్తి సెగ!
28 వార్డుల్లో జనసేనకు రెండేనా..?
పది మంది వరకు జనసేన తరఫున నామినేషన్లు..
షకీలా ర్యాలీకి జనసేన శ్రేణులు దూరమెందుకు..?
ఆత్మకూరు, అక్టోబర్ 19 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై చర్చ మొదలైంది. 28 వార్డుల్లో జనసేనకు రెండే సీట్లా..? బీజేపీకి ఒక్కటేనా..? మిగిలిన స్థానాలన్నీ టీడీపీకే కేటాయించారా..? అన్న ప్రశ్నలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీట్ల కేటాయింపుపై జనసేన శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందనే చర్చ సాగుతోంది.పది మంది నామినేషన్లు.. అసంతృప్తికి సంకేతమా..?సీట్ల కేటాయింపులో తమ పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని భావిస్తున్న జనసేన ఆశావహులు పది మంది వరకు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. మరి వీరిలో ఎంతమంది అధికారిక అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు..? ఎంతమంది స్వతంత్రులుగా పోటీ చేస్తారు..? నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే స్పష్టత రానుంది. కూటమి నిర్ణయాన్ని అంగీకరిస్తారా..? లేక తమ బలాన్ని ఎన్నికల బరిలో చూపిస్తారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
షకీలా ర్యాలీకి జనసేన దూరమెందుకు..?
టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు . అయితే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కనిపించలేదనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సీట్ల పంపకాలపై అసంతృప్తే ఇందుకు కారణమా..? లేక ఇతర కారణాలున్నాయా..? అన్నది తెలియాల్సి ఉంది. జనసేన నేతల గైర్హాజరుకు సీట్ల వివాదమే కారణమని నిర్ధారించే అధికారిక సమాచారం మాత్రం లేదు.
కూటమిలో సర్దుబాటు కుదిరేనా..?
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అభ్యర్థుల పరిశీలన, ఉపసంహరణపై దృష్టి నెలకొంది. జనసేన ఆశావహులు పోటీ నుంచి తప్పుకుంటారా..? కూటమి నేతలు చర్చించి అసంతృప్తిని చల్లారుస్తారా..? లేక ఆత్మకూరులో కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ తప్పదా..? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీట్ల పంపకాలపై పార్టీల అధికారిక స్పందన, తుది అభ్యర్థుల జాబితా వెలువడితేనే అసలు పరిస్థితి తేలనుంది.