Sunday, 7 December 2025

Tag: Hyderabad

తెలంగాణ హైదరాబాద్

తెలంగాణలో 13 నుండి 16 వరకు అతి భారీ వర్షాలు..!

హైదరాబాద్, ఆగస్టు 12, పున్నమి ప్రతినిధి: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల ఆగస్టు 13 నుంచి 16 వరకు వరుసగా మూడు రోజులు పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు బలంగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ వాతావరణం: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా ఉంది. నేటి సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు, మెరుపులు పడే అవకాశమూ ఉంది.ఆగస్టు 12 నుంచి 16 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.

తెలంగాణ సినిమా హైదరాబాద్

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!

*తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!* హైదరాబాద్, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌ గా సంజీవ్ గోయెంకా ను కో-ఛైర్మన్‌ గా ఉపాసన కొణిదెల నియమించారు. అపోలో హాస్పిటల్స్‌ లో CSR వైస్ ఛైర్‌ పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ

తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం హైదరాబాద్, ఆగస్టు 05, పున్నమి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం మంగళవారం, బుధవారం (ఆగస్ట్ 5, 6) తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష సూచన రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమూ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈదురుగాలుల తీవ్రత వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హవామాన శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచనలిచ్చింది. హెచ్చరికలు: గగనతల విద్యుత్‌ స్ఫోటాల నుంచి జాగ్రత్తగా ఉండాలనీ, విద్యుత్ లైన్‌ల దగ్గరగా వెళ్లకుండా ఉండాలనీ, రైతులు పొలాల్లో ఉండే సమయాన్ని తగ్గించుకోవాలనీ, నీటి ప్రవాహాల వద్ద, పురుగు మందుల పిచికారీ సమయంలో సురక్షిత దూరం పాటించాలనీ సంబంధిత అధికారులు ముందస్తు సూచనలు జారీ చేశారు. రైతులకు సూచన: వర్షాభావ పరిస్థితులు మారే సూచనలు ఉన్నందున సాగు కార్యక్రమాలను వాయిదా వేయవచ్చు. వర్షపాతం ఆశించదగిన పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ సలహా ఇచ్చింది.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల..!!

*జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల…!!* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్ ఎల్ ఎం ప్రథమ సంవత్సరం చదువుతూ, ఇటీవల ప్రకటించిన జ్యుడిషియరీ నియామక ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి ( జే సీ జే ) గా ఎన్నికయిన సహచర విద్యార్థిని ధరావత్ సుష్మ ను తమ బ్యాచ్మెట్, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది, లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ (సతీష్ ) అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తమతో పాటు పీజీ చేస్తున్న సుష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్ లో జ్యుడిషియర్ విభాగంలో మరింత ఎత్తుకు ఎదుగాలని పలువురు ఆకాంక్షించారు. అదేవిధంగా పదవ తరగతి వరకు సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో చదివి, ఆ తర్వాత హైదరాబాద్ లోని పెండెకంటి న్యాయ కళాశాలలో ఎల్ ఎల్. బి పూర్తి చేసి, గ్రామీణ నేపథ్యం న్యాయ శాస్త్ర ప్రతిభకు అడ్డురాదనీ నిరూపించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయిన సుష్మ ను సహచర విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాస్త్ర పీజీ విద్యార్థి ఇనుముల సత్యనారాయణ తో పాటు సహచర పీజీ విద్యార్థులు నరేష్ రాథోడ్, ప్రభావతి, నవీన్ కుమార్, ఆనంద్, వేణుగోపాల్, సువర్ణ, శరత్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ హైదరాబాద్

ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు

*ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు* హైదరాబాద్/మంథని, జులై 25, పున్నమి ప్రతినిధి: ఇ – గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు. శుక్రవారం ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్య రంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణా ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ – గవర్నెన్స్ కీలకమని ఆయన తెలిపారు. ఇందులో ఎస్తోనియా దేశ తోడ్పాటును కోరుతున్నామని, సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందనీ, డ్రోన్ టెక్నాలజిలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందనీ మంత్రి తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన డ్రోన్లు శత్రు దేశానికి భారీ నష్టం కలిగించాయనీ, భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలనీ ప్రతినిధులను కోరారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాదు కరీంనగర్ కామారెడ్డి తెలంగాణ నాగర్‌కర్నూల్ పెద్దపల్లి మెదక్ వరంగల్ హైదరాబాద్

నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్

*నేడు తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు అలర్ట్* హైదరాబాద్‌, జులై 21, పున్నమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలపై విస్తృత వర్షాల ప్రభావం ఉండనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నగరంతోపాటు మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదివారం రాత్రి హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. నగరంలోని కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, రెస్క్యూ విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, చెరువుల సమీపాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదనీ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తే అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సంబంధిత అధికారులు ముందస్తు సూచనలు జారీ చేశారు.

తెలంగాణ హైదరాబాద్

ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 20, పున్నమి ప్రతినిధి: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హరిబౌలీలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ జీవన విధానం, పల్లె సంస్కృతి, సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజల స్ఫూర్తిని చాటి చెప్పే గొప్ప ఉదాహరణలు అని అన్నారు. జంట నగరాల్లో రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 కోట్లు కేటాయించామని, నగరంలోని 2783 ఆలయాలకు చెక్కుల రూపంలో నిధులను అందజేసినట్లు ప్రకటించారు. కేవలం ఒక ప్రకటన కాదనీ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేసే దృఢ సంకల్పం అని అన్నారు. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో, ఐటీ, పరిశ్రమల రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.