Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Awareness

ప్రకాశం

జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ

జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. *కమిటీ సభ్యులు* ▪️హోం మంత్రి – చైర్మన్. ▪️సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి – వైస్ చైర్మన్. ▪️హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ▪️సాధారణ పరిపాలన (Poll) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ▪️సాధారణ పరిపాలన (I&PR) శాఖ ఎక్స్-ఆఫీషియో సెక్రటరీ. ▪️IGP (Law & Order) ▪️గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు. ▪️పెద్ద దినపత్రికలు/పీరియాడికల్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి. ▪️చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి. ▪️ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి. ▪️ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి. ▪️డైరెక్టర్, I&PR – మెంబర్ కన్వీనర్. ▪️అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం కూడా డైరెక్టర్, I&PRకు కల్పించారు. *జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్యలకు దోహదపడే విధంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది.*

ప్రకాశం

ఒంగోలు వైభవాన్ని భావితరాలకు అందించాలి: వెంకయ్యనాయుడు

ఒంగోలు వైభవాన్ని భావితరాలకు అందించాలి: వెంకయ్యనాయుడు ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1977లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తుచేశారు. రాజకీయాల్లో ధనబలం కంటే వ్యక్తిత్వం, సామర్థ్యం, నడవడికకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒంగోలు గిత్త జాతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్వచ్ఛత, ప్రకృతి పరిరక్షణకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. 150 ఏళ్ల చరిత్రను గౌరవిస్తూ ఒంగోలు భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. నగరాభివృద్ధిలో తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, గృహవసతికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమని గవర్నర్ పేర్కొన్నారు. గత వైభవాన్ని కాపాడుకుంటూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒంగోలును అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం

మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి

మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి – మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం. శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీదేవిని మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. – తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్తగా కేటాయించిన పదవిలో చేరాలని శ్రీదేవిని ప్రభుత్వం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. – అయితే డీఆర్వో ఎం. శ్రీదేవి గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్ కూడా విధులు నిర్వహించారు. – సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆమె రిలీవ్‌, జాయినింగ్ తేదీలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ప్రకాశం

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా సెప్టెంబర్ 20( మార్కాపురం కె టి సి పున్నమి ప్రతినిధి) నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మొట్టమొదటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా పంకజ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2020 బ్యాచ్ IPS అధికారి అయిన పంకజ్ కుమార్ మీనా స్వస్థలం రాజస్థాన్. 2019లో నిర్వహించిన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికైన ఆయన, 9 డిసెంబర్ 2023న IPS ధ్రువీకరణ పొందారు. నూతన మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాల్లో పోలీసు శాఖను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అధికారి వివరాలు: పంకజ్ కుమార్ మీనా | IPS బ్యాచ్: 2020 | క్యాడర్: ఆంధ్రప్రదేశ్ | స్వస్థలం: రాజస్థాన్ | UPSC ఎంపిక: సివిల్ సర్వీసెస్ పరీక్ష–2019 | IPS ధ్రువీకరణ: 9 డిసెంబర్ 2023. మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న పంకజ్ కుమార్ మీనా గారికి శుభాకాంక్షలు. 🌹

ప్రకాశం

GCDO హేమలతను కలిసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కౌన్సిలర్లు

GCDO హేమలతను కలిసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కౌన్సిలర్లు ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు సమగ్ర శిక్ష కార్యాలయంలో GCDO హేమలతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు తమ విధులకు సంబంధించిన పలు అంశాలను GCDO హేమలత దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ అందించడం, కౌన్సిలర్ల విధులు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, కెరీర్ అభివృద్ధికి కౌన్సిలర్ల సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన సహకారం, సమన్వయంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ప్రకాశం

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, భూసారం పరిరక్షించుకోవాలి – ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, భూసారం పరిరక్షించుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న వివిధ ప్రయోగాలను ఆయన క్షేత్రస్దాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, దొడ్డవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ఎంతో బాగా చేస్తున్నారన్నారు. ఎన్నో నూతన ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా రెండు ప్రయోగాలు ఎంతో వినూత్నంగా ఉన్నాయన్నారు. రెండున్నర ఎకరాల పొలంలో 29 లక్షల రూపాయల వ్యయంతో ఎన్నో పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. అలాగే, వరిలో కలుపు నివారణకు నూకలన వినియోగించి మంచిఫలితాలు రాబట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్దితుల నేపథ్యంలో నీటిని సమర్దంగా వినియోగించుకోవాలన్నారు. వృధా భూములలో పశుగ్రాసం సాగుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రకాశం

*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు*

*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు* *పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల కేటాయింపుపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చ :- మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో ఎం. వెంకట శివరామిరెడ్డి* *తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి రాజకీయ పార్టీల ప్రతినిధులు* ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, ఓటర్ల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి డీఆర్వో ఎం. వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్చించారు. ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటర్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించే విధానం, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాల కల్పనపై సమావేశంలో వివరంగా చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, ఇతర అవసరమైన సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఆయా గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, ఓటర్లకు అందుబాటులో ఉండే ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాజకీయ పార్టీల నాయకులు అధికారులను కోరారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, తాజా జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని వారు సూచించారు. మార్కాపురం జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 990 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు సమావేశంలో తెలిపారు. అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 7,55,731 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలకు అవసరమైన సమాచారం అందిస్తూ, అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ పద్మావతి, ఎన్నికల విభాగం అధికారులు, అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

ప్రకాశం

*రైతాంగానికి అండగా సమగ్ర ప్రణాళికలు: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత* .

*రైతాంగానికి అండగా సమగ్ర ప్రణాళికలు: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత* . *రబీ సీజన్‌కు ప్రణాళికలు, సూక్ష్మ పరిశ్రమల స్థాపన మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధుల సృష్టి ద్వారా జిల్లా ఆర్థిక రంగానికి బహుముఖ మద్దతు* . *రైతులకు సమగ్ర ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) మరియు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పై ప్రత్యేక కార్యాచరణ* . *రైతుల ఆర్థిక శ్రేయస్సు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు మరియు యువత నైపుణ్యాభివృద్ధికి బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశం* . *మార్కాపురం,16.9.26* మార్కాపురం జిల్లా సహజ వర్షాఛాయ భౌగోళిక పరిస్థితులు మరియు ఎల్ నినో వల్ల ఎదురైన తాత్కాలిక వర్షాభావ పరిస్థితులను అధిగమించి, జిల్లాలోని ప్రతి రైతుకూ, గ్రామీణ కుటుంబానికీ ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు. ఖరీఫ్‌లో నికర సాగు విస్తీర్ణం (Net Sown Area) 76% తగ్గినప్పటికీ, రాబోయే రబీ సీజన్‌‌కు విస్తృతమైన రుణ ప్రణాళికలు, ముందస్తు విత్తన/పెట్టుబడి సహాయ చర్యలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మార్కాపురం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు లీడ్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC) మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) ఉమ్మడి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (జూన్ 2026 నాటికి) వార్షిక రుణ ప్రణాళిక (ACP) సాధించిన పురోగతిపై సమీక్షిస్తూ, జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మార్గదర్శకాలు* : 1. రబీ సమగ్ర సాగుకు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ ప్రాధాన్యత: వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి రబీ కాలం గొప్ప ఉపశమనం కలిగిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. రబీ పంటల సాగు కోసం రైతులకు అవసరమైన రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మరియు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా బ్యాంకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. 2. రైతు సాధికారతకు ప్రత్యేక ‘ఆర్థిక అక్షరాస్యత’ కార్యక్రమాలు: జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా, రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ మరియు ఆర్థిక సేవల విస్తరణ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని బ్యాంకింగ్ వర్గాలను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా, వడ్డీ లేని పంట రుణాలు మరియు బ్యాంకింగ్ పథకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 3. సూక్ష్మ పరిశ్రమలు (Micro Enterprises) & విశ్వకర్మ యోజన ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి: వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉపాధి మార్గాలను పెంచేందుకు సూక్ష్మ పరిశ్రమలను గరిష్టంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకం ద్వారా సాంప్రదాయ చేతివృత్తుల వారికి నాణ్యమైన పరికరాలు, రోజువారీ స్టైఫండ్‌తో కూడిన నైపుణ్య శిక్షణ, మరియు పూచీకత్తు లేని రుణ సదుపాయాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆదేశించారు. 4. పశుసంవర్ధకం, మత్స్య రంగానికి ఊతం: రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చే పశుసంవర్ధక మరియు మత్స్య రంగానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డుల దరఖాస్తులను వేగవంతం చేసి, కేవలం 15 రోజు వ్యవధిలో ఆమోదించి రుణాలు విడుదల చేయాలని ఆదేశించారు. 5. సమర్థవంతమైన సమన్వయం & యువత నైపుణ్యాభివృద్ధి: జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వ శాఖలు మరియు బ్యాంకింగ్ రంగాలు సంపూర్ణ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. RUDSETI వంటి శిక్షణా సంస్థల ద్వారా జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, స్వయం ఉపాధి మరియు నూతన అవకాశాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, జిల్లా వ్యవసాయ అధికారి, డి.ఆర్.డి.ఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు మరియు బ్యాంకింగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రిన్సిపాల్ డా. కె. రాంప్రసాద్

గూడూరు సెప్టెంబర్ 16: స్థానిక ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాంప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ ఓజోన్ పొర పరిరక్షణతో పాటు పర్యావరణాన్ని, భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, గ్రీన్హౌస్ ప్రభావం వంటి సమస్యలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాముఖ్యత, ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు, ఓజోన్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని, దాని పరిరక్షణకు విద్యార్థులు మరియు ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, సీనియర్ అధ్యాపకులు, రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు శ్రీమతి కృపాకరుణవాణి, శ్రీమతి శైలజ, డాక్టర్ ఏ.వి. ప్రసాద్ తదితర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రకాశం

స్క్రీన్ ముందు పెరుగుతున్న పిల్లలు – మానసిక ఆరోగ్యంపై ప్రభావం

స్క్రీన్ ముందు పెరుగుతున్న పిల్లలు – మానసిక ఆరోగ్యంపై ప్రభావం సాంకేతికత అవసరమే.. కానీ పిల్లల బాల్యాన్ని స్క్రీన్‌కు అప్పగించకూడదు డా. కె.టి.సి. పాపారాయుడు Psychologist & District Career Mental Health Counsellor నేటి ప్రపంచంలో సాంకేతికత మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, టెలివిజన్ వంటి డిజిటల్ పరికరాలు పిల్లల చదువు, సమాచారం, వినోదానికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య, విద్యా యాప్‌లు, డిజిటల్ పాఠ్యాంశాలు పిల్లలకు అనేక అవకాశాలను అందిస్తున్నాయి. అయితే అవసరానికి మించి స్క్రీన్ ముందు గడిపే సమయం పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఫోన్ చూపించడం, భోజనం చేయించడానికి మొబైల్ ఇవ్వడం, ఖాళీగా ఉన్నప్పుడు వీడియోలు చూపించడం వంటి అలవాట్లు క్రమంగా పిల్లల రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయి. మొదట తల్లిదండ్రులకు ఇది సులభమైన పరిష్కారంలా కనిపించినా, పిల్లలకు స్క్రీన్ ఒక అలవాటుగా మారకుండా జాగ్రత్త వహించడం అవసరం. ఎక్కువ సమయం స్క్రీన్‌తో గడిపే పిల్లలు ఆటలు, పుస్తక పఠనం, కుటుంబ సభ్యులతో సంభాషణ, స్నేహితులతో ప్రత్యక్షంగా గడిపే సమయం వంటి కార్యకలాపాలకు తక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది. పిల్లల అభివృద్ధికి కేవలం సమాచారం సరిపోదు. ఇతరులతో మాట్లాడటం, కలిసి ఆడటం, ప్రశ్నలు అడగడం, సమస్యలను పరిష్కరించడం, భావోద్వేగాలను వ్యక్తపరచడం వంటి అనుభవాలు కూడా ఎంతో అవసరం. స్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర సమయం, ఏకాగ్రత, శారీరక చురుకుదనం వంటి అంశాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువసేపు స్క్రీన్ ఉపయోగించడం వల్ల నిద్రకు సంబంధించిన అలవాట్లు దెబ్బతినవచ్చు. తగిన నిద్ర లేకపోవడం పిల్లల చదువు, మానసిక స్థితి, రోజువారీ ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చు. అయితే స్క్రీన్ పూర్తిగా చెడ్డదని చెప్పడం సరైంది కాదు. పిల్లల వయస్సుకు తగిన విద్యా కంటెంట్, ఆన్‌లైన్ అభ్యాసం, సృజనాత్మక కార్యక్రమాలు వంటి వాటిని పరిమితంగా మరియు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. సమస్య స్క్రీన్‌లో కాదు.. దాన్ని ఎంతసేపు, ఎలా, ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమైన విషయం. పిల్లలకు నియమాలు పెట్టే ముందు తల్లిదండ్రులు తమ స్క్రీన్ అలవాట్లను కూడా పరిశీలించుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది మాత్రమే కాకుండా, వారు చేసే పనులను కూడా గమనించి నేర్చుకుంటారు. అందువల్ల “ఫోన్ చూడకూడదు” అని పిల్లలకు చెప్పే ముందు.. తల్లిదండ్రులు కూడా కుటుంబంతో గడిపే సమయంలో ఫోన్‌ను పక్కన పెట్టే అలవాటు చేసుకోవాలి. పిల్లలతో కలిసి రోజులో కొంత సమయం మాట్లాడటం, ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, బయట ఆడుకునేలా ప్రోత్సహించడం, కుటుంబ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం ద్వారా స్క్రీన్‌కు ప్రత్యామ్నాయమైన ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం అంటే కేవలం ఫోన్‌ను తీసేయడం కాదు.. దాని స్థానంలో పిల్లలకు మంచి అనుభవాలను అందించడం. పిల్లలు స్క్రీన్ ఉపయోగిస్తున్నప్పుడు ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వారి వయస్సుకు ఆ కంటెంట్ సరిపోతుందా? వంటి విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. అదే సమయంలో ప్రతి విషయాన్నీ నిషేధించడం కంటే, డిజిటల్ ప్రపంచాన్ని బాధ్యతగా ఉపయోగించడం గురించి పిల్లలకు నేర్పించడం కూడా అవసరం. పిల్లల్లో నిద్ర, చదువు, కుటుంబ సంబంధాలు లేదా రోజువారీ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. అవసరమైతే ఉపాధ్యాయులు, కౌన్సెలర్లు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం కంటే.. వారి మనసులో సంతోషం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ఉండటం ముఖ్యమైనది. సాంకేతికతను పిల్లల అభివృద్ధికి ఉపయోగించుకుందాం.. కానీ పిల్లల బాల్యాన్ని మొత్తం స్క్రీన్‌కు అప్పగించకూడదు. స్క్రీన్‌కు సమయం కేటాయించడంతో పాటు.. పిల్లల కోసం మన సమయాన్ని కూడా కేటాయిద్దాం. పిల్లలకు స్క్రీన్ కంటే సంబంధాలు అవసరం.. వీడియోల కంటే సంభాషణ అవసరం.. సమాచారం కంటే అనుభవం అవసరం. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మనందరిదీ.