శ్రీసిటీలో ‘పేక్స్ ఇండియా’ నీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
శ్రీసిటీ, డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PETI) ఏర్పాటు చేసిన అత్యాధునిక NABL నీటి/మురుగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీసిటీని ‘క్లీన్ అండ్ గ్రీన్’ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేసే యత్నంలో ఇది ఒక ప్రధాన మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ల్యాబ్ పరిశ్రమలకు వేగవంతమైన, ఖచ్చితమైన మరియు విశ్వసనీయ టెస్టింగ్ సేవలను అందిస్తుందని చెప్పారు. పేక్స్ ఇండియా ఎండీ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ సదుపాయం ‘మేక్ ఇన్ ఇండియా’ భావనకు అనుగుణంగా అత్యాధునిక యూరోపియన్ ప్రమాణాలతో పనిచేస్తుందని తెలిపారు. 30కి పైగా పరామితుల్లో నీటి, మురుగునీటి టెస్టింగ్ అందుబాటులో ఉందని, బయోమెథేన్ పొటెన్షియల్ (BMP) టెస్టింగ్ ద్వారా పరిశ్రమలు బయోగ్యాస్ ఉత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. 2016లో ₹30 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో యూనిట్‌ను స్థాపించిన పేక్స్ ఇండియా, ఇప్పుడు టెస్టింగ్ సేవలను కూడా అందించనుంది.











