Thursday, 23 April 2026

Blog

Featured బిజినెస్

వృత్తి జీవితం – 9 వ్యాపార మర్యాదలు (బిజినెస్‌ ఎటికెట్‌)

ముందుగా, ‘పున్నమి ‘ పాఠకులకు 2020 శుభాకాంక్షలు. 2020లో మీ జీవితం – ఆనందంగా, అర్ధవంతంగా, నాలుగు డబ్బులకు లోటు లేకుండా, హాయిగా సాగాలని కోరుకుంటూ ఈ వారం ఆర్టికల్‌. ఇంగ్లిష్‌లో బిజినెస్‌ ఎటికెట్‌ అనే ఒక పదం ఉంది. అంటే, మనం పని చేసే ఉద్యోగంలో / వ్యాపారంలో, దీసెంట్‌గా, హుందాగా, మర్యాద గా ప్రవర్తించాల్సిన నియమావళి అన్న మాట . వీటిని ఎక్కడా రాయరు. ఎవ్వరూ చెప్పరు. కళాశాలలో నేర్పించరు. కంపెనీ పాలసీలలో ఉండవు. వీటిని ‘అన్‌ రిటెన్‌ రూల్స్‌’ అంటారు. వీటిని పాటిస్తే, మనతో కలిసి పని చేసే వారు మనతో సమయం గడపడానికి ఇష్ట పడతారు. మనకి కావల్సిన కీలకమైన సమాచారంతో, సరి అయిన టైంలో పంచుకుంటారు. మనకి అవసరమైన హెచ్చరికలు చేస్తారు. ‘వ్యాపార మర్యాద’ లు మనం పాటించక పోతే, అవతలి వారు మనని ‘ కేవలం భరిస్తారు’. మన అవసరం అయి పోగానే దూరం పెడతారు. అవి ఏమిటో చూద్దాం . (1) ఎవరికైనా కాల్‌ చేసేటప్పుడు : రెండు సార్ల కంటె ఎక్కువ కాల్‌ చెయ్యకండి . మీరు 2 సార్లు కాల్‌ చేసినా వారు కాల్‌ తీసుకోవడం లేదంటే, కావాలని కావచ్చు , లేదా మరే పని లో అయినా బిజీగా ఉండి ఉండవచ్చు. మీరు ఏ పని మీద వారికి కాల్‌ చేశారో , చిన్న మెసేజి పెట్టండి. ఎస్సెమ్మెస్‌లోనో, లేక వాట్సాప్‌లోనో. మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. వ్యాపారం కోసం చేసే కాల్స్‌కి పై సూత్రం వర్తిస్తుంది . కానీ, క్యాష్‌ కలెక్షన్‌ దగ్గర వర్తించదు! మన దగ్గర సరుకు తీసుకుని, అమ్ముకుని, మనకి డబ్బులు ఇవ్వడానికి డిలే చేస్తున్నారు అంటే, మనం 100 కాల్స్‌ చేసినా, తప్పు లేదు. ఇంటికి / దుకాణానికి వెళ్ళి, వెయిట్‌ చేసి పట్టుకుని అడిగినా తప్పు లేదు. ప్రతి రూల్‌ కీ కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్న మాట! (2) అప్పు తీసుకోవడం, ఇవ్వడం, తిరిగి ఇవ్వడం : వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా వ్యాపారస్తుల నుంచి, సగటు జీవి వరకూ, మనిషి కి అప్పు చేసే పరిస్థితి వస్తుంది! వ్యాపార జీవితం లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ. అది మనకు ఇష్టం ఉండదు, కానీ కొన్ని సార్లు తప్పదు. మీరు గనక వ్యక్తిగత జీవితం లో అప్పు తీసుకుంటే, ఆ ఇచ్చిన వారు తిరిగి మనకి గుర్తు చేసే లోపల మీరు తిరిగి ఇవ్వండి ! ఇది మర్యాద చిహ్నం ! ఒక వేళ మీరు ప్రామిస్‌ చేసిన రోజు ఇవ్వ లేక పోతే , మనకి రెండు ఛాయిస్‌ లు ఉంటాయి . ఒకటి , మనం కమిట్‌ చేసిన డేట్‌ కి 2 లేక మూడు రోజుల ముందే, ‘ సారీ ‘ చెప్పి , మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది అని చెప్పడం . రెండవది, పాక్షికం గా తిరిగి ఇవ్వడం . ‘ ఇదిగో సురేష్‌ ! నేను చెప్పిన 20 వేలూ ఇప్పుడు ఒక్క సారి గా ఇచ్చే పరిస్థితి లేదు . ఇప్పుడు రూ . 5 వేలు ఇస్తాను, మిగతాది వచ్చే నెలలో . తీసుకో, నాకు కొంచెం భారం తగ్గినట్లు ఉంటుంది ! ‘ అని . అర్ధం చేసుకుంటారు . మొహం చాటు వేయవద్దు ! మీరు అప్పు ఇచ్చే పక్షంలో : అప్పు ఇచ్చి స్నేహాన్ని పాడు చేసుకోకండి ! అలా అంటే అప్పు ఇవ్వ వద్దు అని కాదు ! అవసరానికి సాయ పడక పోతే స్నేహం ఎందుకు? ఎంత మొత్తం ఇవ్వాలి ? : తీసుకున్న వ్యక్తి చెప్పిన డేటు కి సర్ద లేక పోయినా , తిరిగి ఇవ్వడానికి చాలా కాలం పట్టేటట్లు ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది లేనంత చిన్న మొత్తం మాత్రమే ఇవ్వండి ! కానీ, పలుసార్లు అడిగి, తీసుకున్న వారు మొహం చాటేసే పరిస్థితి కల్పించ వద్దు ! మరొక విషయం : అవతలి వారు అడిగినంత మీరు ఇవ్వ లేక పోయినా, పాక్షికం గా సాయం చెయ్యండి. ‘ బాసూ ! నువ్వడినీ 50 వేలు నేను ఇచ్చే పరిస్థితి లేదు. నాకు బ్లాక్‌ అయి పోతుంది. నేను ఇప్పుడు 15 వేలు ఇవ్వ గలను . మిగతా 35 వేలు, మరెక్కడన్నా ట్రై చెయ్యి ! ‘ ఇలా. ఇంకో విషయం ! మీరు ఆ స్నేహితునికి అప్పు ఇచ్చినట్లు ఎవరికీ చెప్ప వద్దు ! మీరు గనక అప్పు ఇస్తే, భారం లేని మొత్తమే ఇవ్వండి . అవతలి వారు ఎప్పుడు ఇచ్చినా తీసుకునే దానికి సిద్ధం గా ఉండండి . అలా కుదరక పోతే, అసలు అప్పే ఇవ్వకండి .ఇది, వ్యక్తిగత జీవితంలో పాటించ వలసినీ ‘ వ్యాపార ‘ మర్యాద . ఈ టాపిక్‌ పైన మరొక్క ముఖ్య విషయం . ‘వడ్డీ’ కి ఇవ్వకండి, స్నేహితులకు, చుట్టాలకు, మీ పనిమనుషులకు. ప్రేమగా సాయం చేయ వలసిన చోట, దాని నుంచి ‘లాభ’ పడడానికి ప్రయత్నించకండి. మరిన్ని వ్యాపార మర్యాదలు, వచ్చే సంచికలో సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: punnami. news@ gmail. com, essence. training @yahoo.com.

Featured అనంతపురం

రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం.. — *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి*

రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా* *నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 366 చెరువులు కృష్ణా జలాలతో నింపుతాం* *దేశానికి వెన్నెముక రైతన్న* *రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం.. — *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి* “ఎన్నికలకు మునుపు కదిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామని అప్పుట్లో హామీ ఇచ్చాను. కచ్చితంగా ఈ రెండేళ్లలో అన్ని చెరువులను నింపి తీరుతాను..” అని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి మండల పరిధిలోని పట్నం రంగనాయకుని చెరువును ఎమ్మెల్యే చొరవతో హంద్రీనీవా జలాలతో నింపారు.  ఆదివారం ఎమ్మెల్యే ఆ చెరువులోకి దిగి జల హారతి ఇచ్చారు. అనంతరం మహానేత వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడే మీడియాతో మాట్లాడారు. *అందులోని ముఖ్యాంశాలు:* ®  మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో హంద్రీనీవా ప్రాజెక్టు ను ప్రారంభించారు. © వైయస్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ©వైఎస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వెంటనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. © హంద్రీనీవా కాలువ సామర్థ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే. ఈ కాలువ గుండా ఎక్కువ నీటిని తీసుకురావడం సాధ్యపడదు . అందుకే దీన్ని ఈ రెండేళ్లలో 6 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. © కదిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం 380 చెరువులు ఉండగా ఈ రెండేళ్లలో 366 చెరువులు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఉండవు. © తలుపుల, ఎన్ పి కుంట మీదుగా వెళ్తున్న హంద్రీనీవా మెయిన్ కెనాల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ©దేవుడి కృప, ప్రజలందరి ఆశీర్వాదాలతో నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాను. ,* రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దేశానికి వెన్నెముక రైతన్న. మాది రైతు ప్రభుత్వమని నిరూపించు కుంటాము.

Featured అనంతపురం

బిసిల అభివృద్ధికి పాటుపడతాం – బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ

రాష్ట్రంలో బిసిల అభ్యున్నతికి పాటుపడతామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బిసి/ ఓబిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ వందేళ్ల కిందట దేశంలో అణగారిన వర్గాల, పేద ప్రజల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారన్నారు. పూలే ను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టారని, ఎన్నో రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు అండగా నిలిచారన్నారు. ఆయన బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. చేపట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ సోదరుల కు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించారని, అమ్మ ఒడి, పెన్షన్లులాంటి పథకాలను ప్రవేశపెట్టారని, టైలర్ లు, నాయి బ్రాహ్మణుల కు ఆర్థిక సాయం చేశారని, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించగా అందులో బి సి, ఎస్సీ, ఎస్ టిలకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇచ్చారన్నారు. జిల్లాలో బిసి భవన్ నిర్మాణానికి, బిసిలకు రుణాల మంజూరుకు, బిసి స్టడీ సర్కిల్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిసీలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ పూలే ను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు అంతా తమ పిల్లలను బాగా చదివించాలని, విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందేలా తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి లోను కాకుండా చిన్నప్పటినుంచే ధైర్యాన్ని నూరిపోయాలని, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి ల అభివృద్ధికి పాటు పడుతోందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారికోసం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు పూలే ప్రతిభా అవార్డులను మంత్రి, ఎంపీలు ప్రధానం చేశారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ వీరాంజనేయులు, జడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పిడుగు శ్రీనివాసులు, బిసి సంఘం నాయకులు, విద్యార్థుని, విద్యార్థులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. నెల్లూరు నగరంలో పెండింగ్ లో వున్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రణాళికాబద్దంగా పనులు జరుగుతున్నాయన్నారు. 5వ డివిజన్లోని లక్ష్మీపురం, వైకుంఠపురం,లో పర్యటనలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ కమిషనర్ మూర్తి, వైసీపీ నేతలు ముక్కాల ద్వారకానాధ్, దార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గూడూరు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…

ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది. – ఏపీ తన సొంత జాగీరులా సీఎం వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నలభై వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. – ఏపీ ప్రభుత్వం పిచ్చిచర్యలని మానుకోవాలి. జీఎన్ రావు కమిటీ నివేదికని చెత్తబుట్టలో‌ పడేయాలి. వైసీపీలోనే వ్యతిరేఖత వస్తుంది. ఏపీ ముడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. – బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంది. కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు. – సెల్ఫ్ ఫైనాన్స్ తో అమరావతిని రాజధానిగా అభివృద్ది చేమోచ్చు. – మడెం తిప్పమని, మాట తప్పవని చెప్పే జగన్ రాజధాని విషయంలో ఇచ్చిన మాటకి ఎందుకని కట్టుబడటం లేదు. – ఏపీ అనేక సమస్యల్లో ఉంది. సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు. మీ నిర్ణయాలతో ప్రజలు నవ్వుకుంటున్నారు. – అభివృద్ధి చెందిన వైజాగ్ ని మళ్లీ మీరు అభివృద్ధి చేసేదేమిటి? – రాజధానిని మారిస్తే సహించేది లేదు. కేంద్ర పార్టీ‌ దృష్టికి తీసుకువెళ్లి ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం. – ఏపీ ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. అంబానీ, అదానీ లాంటి వారంతా వెనక్కు వెళుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.

Featured ఆంధ్రప్రదేశ్

వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తి పిఎస్‌ఎల్‌వి సి-47

కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సి-47ను రోదసిలోకి దిగ్విజయంగా పంపింది. శాస్త్రవేత్తల ఉత్కంఠకు తెరదించుతూ నిర్ధిష్ట లక్ష్యం వైపు దూసుకెళ్లింది. వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తిని చాటింది మన పిఎస్‌ఎల్‌వి సి-47 రాకెట్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో గగన కీర్తిని తమ ఖాతాలో వేసుకొంది. అచ్చొచ్చిన వాహక నౌక పిఎస్‌ఎల్‌వి నుంచి సి-47 రాకెట్‌ కొద్దిసేపటి క్రితం నిప్పులు చెరుగుతూ నింగిలోకి వెళ్లింది. నిర్ధిష్ట కక్ష్యలో చేరింది. అత్యాధునిక రెసల్యూషన్‌ కలిగిన కెమెరాలతో భూవాతావరణ పరిస్థితులను 0.28 మీటర్ల కంటె మెరుగైన రెసల్యూషన్‌లో ఫోటోలు తీసే కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని నిర్ధిష్ట సమయంలో నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 12 నానో శాటిలైట్లను మన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక రోదసిలోకి పంపింది. భారత సమాచార సాంకేతిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే కార్టోశాట్‌ – 3 ఉగ్రహం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్తో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రసంశలు కురుస్తున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనకీర్తిని సర్వత్రా కొనియాడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడివుండే కార్టోశాట్‌-3 దేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ప్రత్యేకించి భారత సైన్యానికి అభివృద్ధి ప్రణాళికలకు ఈ ప్రయోగం దిక్సూచిగా మారనుంది. దాదాపు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన స్లోక్‌-4పి అనే నానో ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనేమరో బుల్లి ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి సి-47 దిగ్విజయంగా కక్ష్యలోకి పంపింది. దాదాపు పదేళ్లపాటు ఈ ఉపగ్రహం భారతదేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.

Featured బిజినెస్

వృత్తి జీవితం – 6

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం – 6 వ భాగం వినడం ద్వారా మానసిక ఆరోగ్యం ! శ్రద్ధగా వినడం అనేది కమ్యూనికేషన్‌ లో అన్నింటికంటే ముఖ్యమైన కళ ! కమ్యూనికేషన్‌కి 4 స్థంభాలు! రాయడం, చదవడం, మాట్లా డడం, వినడం. మాట్లాడడం కంటే కూడా ముఖ్యమైనది వినడం . ఇది అలవరుచుకుంటే, మనకి వత్తి జీవితంలోనూ, కుటుంబ జీవితం లోనూ కూడా చాలా ఉపయోగ పడుతుంది. మన సత్సంబంధ బాంధవ్యాలు మెరుగు పడ తాయి. తద్వారా ఉపశాంతి, సంతోషం. తద్వారా మన మానసిక ఆరోగ్యం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి . నిశితంగా వినడంలోని ముఖ్యాంశాలు. 1. చెప్పే వారి వైపు వినే వారు చూడడం మొదటి స్టెప్పు ( అలా అని మనం తదేకంగా గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ ఉంటే, ఆ చెప్పే వారు స్త్రీ లు అయితే, వారు ఇబ్బంది పడవచ్చు! జాగ్రత్త ! చెప్పే వారు స్త్రీలు అయితే, సూది లాంటి చూపులతో గ్రుచ్చెయ్యకండి మరి! కొంచెం గ్యాపు ఇచ్చి అటు ఇటు చూస్తూ వినండి!) 2.అవతలి వారు చెప్పేటప్పుడు ‘ఊ’ కొట్టడం, తల ఊపడం, వారు చెప్పినది కొంచెం రిపీట్‌ చేసి, మనం విన్నాము అన్న నమ్మకం కలిగించడం. 3. సూటి ప్రశ్నలు అడగడం . సరి అయిన ప్రశ్నలు అడగడం . కానీ ఇది చాలా సున్నితం గా చేయాలి . మనకి సమస్య చెప్పే వారు, మనకి పూర్తి వివరాలు చెప్ప డానికి ఇష్ట పడక పోవచ్చు. కొన్ని విషయాలు గోప్యంగా ఉం చవచ్చు. వారు ఎంత వరకు చెప్పడానికి ఇష్ట పడతారో, అంతవరకే ప్రశ్నలు అడగాలి. 4. ఎవరైనా సహోద్యోగి తమ బాధలు చెప్పినప్పుడు, పూర్తి గా విని, వారు చెప్పిన దానిలో, కీలక మైన పదాలు తిరిగ్‌ రిపీట్‌ చెయ్యడం. దాని వలన వారికి మనం విన్నామని నమ్మకం కలుగుతుంది. మన అవగాహన కూడా పెరుగుతుంది. అవతలి వారు చెప్పేది విన్న తరువాత , వారి దగ్గర లేనిదీ, మనకి తెలిసినదీ, వారిగి సహాయ పడగలదీ అయిన సమాచారాన్ని వారికి ఇవ్వడం. మీకు తెలిసిన డాక్టర్‌ పేరు కావచ్చు, వారి బిడ్డ ని చేర్పించాలి అనుకున్న పాఠశాలలో మీకు తెలిసిన వ్యక్త్‌ పని చేస్తూ ఉండవచ్చు . ఇలాంటి రిఫరెన్సు కి సంబంధించిన సహాయం కావచ్చు. కేవలం ‘వినడం’ ద్వారా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందా ? ఖచ్చితంగా కుదుట పడుతుంది ! ‘ వినడం ‘ అనే ప్రక్రియ ద్వారా, మనస్సు ప్రక్షాళనం అవుతుంది ఇతరులు తమ బాధలు చెప్పేట ప్పుడు, మన స్వంత ఫీలింగ్స్‌ని అదుపులో పెట్టుకోవడం అవసరం ! అవతలి వారు తమ బాధలు చెబుతున్నప్పుడు , కొన్ని విషయాలు మనకి ఆశ్చర్యం కలిగించేవిగా , లేదా మనని నిర్ఘాంత పరిచేలా ఉండవచ్చు. కానీ, వినే ప్రక్రియలో , మన భావోద్వేగాలు, వెనువెంటనే ప్రకటించక పోవడమే మంచిది .. ఇంకో విషయం ఏమిటంటే, అవతలి వారు తమ సమస్యను మనకి చెప్పేటప్పుడు మనం విని వెనువెంటనే తక్షణ పరిష్కారాల లిస్టు చదవక పోవడం. చాలా మందికి తక్షణ పరిష్కారం అవసరం లేదు. వారి బాధని వినే వారు మాత్రమే కావాలి ! మనం చెప్పే ఇన్స్‌ స్టంట్‌ సొల్యూషన్‌ లు వారికి తట్ట లేదనీ కాదు. పరిష్కారానికి వారు ఇప్పటి దాకా ఏమేమి చేశారో వారినే అడిగి , ఆ తరువాత మాత్రమే మనకి తోచిన సలహా ఇవ్వడం మంచిది! ఒక ఆనంద కరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో వత్తిడికీ, మానసిక సమస్యకూ గురి అయిన వారిలో 70 శాతం మంది కోలుకుంటారు ! వారి చుట్టు పక్కల వారు అర్ధం చేసుకుని సహానుభూతితో సపోర్టు చేస్తే! పైగా, ఉద్యోగంలో మానసిక అనారోగ్యం అనేది – ఏళ్ళ తరబడి ఉండదు . ఒక్కో సారి మనకి నచ్చని ఒక సంఘట వల్ల రావచ్చు. ఇష్టం లేని బదిలీయో, లేక ఇష్టం లేని బాస్‌ క్రింద పని చేయడమో, అనుకున్న ప్రమోషన్‌ / ఇంక్రిమెంటు రాక పోవడమో, ఇలా. ఆ సమయంలో ఆ ఎదురు దెబ్బని సరిగా ఎదుర్కొంటే, మళ్ళీ, ఉద్యోగ / వ్యాపార జీవితం సజావుగా నడవ వచ్చు! ఒక్కోసారి సమస్యలకి పరిష్కారమే ఉండక పోవచ్చు ! పరిష్కారం లేని సమస్యలు ఎన్నో ! అలాంటప్పుడు కలిగిన బాధ ని , దుఃఖాన్నీ జీర్ణం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడమే! ఉదాహరణకి , విడాకులు కావచ్చు . లేదా, సంస్థ నష్టాల్లో ఉందని వేల మందికి ” స్వచ్చంద విరమణ” (!!) ఇచ్చీ ఇంటికి పంపించ వచ్చు! మళ్ళీ అదే సంస్థ లో అదే ఉద్యోగం రాదు. మళ్ళీ ఆ జీతం రాక పోవచ్చు ! ఉన్న డబ్బు ని పొదుపు చేసుకుని, మరో చోట ఇంకోపనో, రిస్కు తక్కువ ఉన్న వ్యాపారమో ప్రారంభించ డమే ! మానసిక అనారోగ్యం అనుకోని సమస్యల వల్ల వస్తుంది. కానీ అన్ని సమస్యలకి పరిష్కా రాలు ఉండవు. పరిష్కారం లేని సమస్యల గురించి , మార్చ లేని గతాన్ని గురించి అతిగా వ్యధ పడకుండా , కొత్త జీవితాన్ని మరో చోట ప్రారంభించడమే పరిష్కారం ! మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్‌ : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

పని చేసే చోట మానసిక ఆరోగ్యానికి మార్గాలు – 5

వృత్తి జీవితం – 5 ఇంకొకరితో పోలికలు వద్దు ! మిమ్మల్ని మీరుగా అంగీకరించండి . మీలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలూ ఉండవచ్చు . ఇతరులలో కూడా అవి ఉంటాయి కానీ, వేరు వేరు రకాల ప్లస్‌లు మైనస్‌లు ! గుర్తు ఉంచుకోండి. పని అనేది మన జీవి తంలో ఒక భాగం మాత్రమే ! దీనికి మించిన సంపూర్ణ వ్యక్తిత్వం మన అందరికీ ఉంటుంది! కానీ దురదష్టవశాత్తు మనలో చాలా మందిమి, మనం పనిలో సాధించే విజయాన్ని బట్టే, మన ఆత్మ గౌరవం పెంచుకోవడం, లేదా తగ్గించు కోవడం – చేస్తూ ఉంటాము. చాలా మంది , తమ ఐడెంటిటీ, ఉనికి , మనకి మనం ఇచ్చుకునే విలువ, అన్నీ – వత్తికే ముడి పెట్టుకుంటారు . ఒక ఇంకిమెంటు కో, ప్రమోషన్‌కో, లేక విదేశీ ట్రిప్పుకో, లేక ఆన్‌ సైట్‌ ప్రాజక్టుకో. ప్రమోషన్‌ కానీ, మిగతావి కానీ, మన పక్క సహోద్యోగికి వచ్చి మనకి రాక పోతే, ఆ ఉద్యోగి బాధ వర్ణనాతీతం ! మనో వ్యాధి పట్టేస్తుంది. ఒక పెద్ద సంస్థలో అన్నీ కరెక్ట్‌గా , న్యాయంగా జరగవు. కొన్ని అన్యాయాలు ఉం టాయి, పాలిటిక్స్‌ ఉంటాయి. ఒక్కోసారి ఆ అన్యాయానికి, పాలిటిక్స్‌కి మనం బలి అవుతాము. అయినా, వత్తి జీవితం ఒక్కటే మన వ్యక్తిత్వానికీ, మన విలువలకు గీటురాయి కాదు! మనకి ప్రమోషన్‌ / ఇంక్రెమెంటు / ఆన్‌ సైట్‌ ప్రాజక్టు, అవార్డు, రివార్డు వచ్చినా రాక పోయినా – ఇంటికి వస్తే ఆప్యాయంగా చూసుకునే జీవిత భాగస్వామి , పిల్లలు, లేక మిమ్మల్ని చూడగానే తోక ఆడించే పెంపుడు కుక్క – ఉంటే , మీరు విజయం సాధించినట్లే! కాబట్టి , మనకి మనం ఇచ్చుకునే విలువ ( సెల్ఫ్‌ వర్థ్‌ ) మొత్తం వత్తి కే ముడి పెట్ట వద్దు ! ఇది మానసిక ఆరోగ్యానికి మేము చేసే మరొక సూచన . 10. మరి మన సహోద్యోగుల మానసిక ఆరోగ్యం మాట ఏమిటి ? ఇప్పటి దాకా మనం – పని చేసే చోట మన మానసిక ఆరోగ్యం కోసం ( మందులు వాడకుండా ) మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో – తెలుసుకున్నాం . ఇప్పుడు మనం, ఇతరుల, అనగా మన సహోద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం మనం ఏమైనా చేయగలమో లేదో – చూద్దాం. ఇది ముఖ్యం! ఎందుకంటే, మనం మన తోటి వారికి ఏమి ఇస్తామో, అదే మనకు ఏదో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది . మనం వారి శ్రేయస్సు గురించి శ్రద్ధ తీసుకుంటే, మన టైం బాగు లేనప్పుడు, మనము ‘ డౌన్‌’లో ఉన్నపుడు మనకి ఆసరా / సహాయం లభిస్తాయి. మనం పరస్పర ఆధారిత సామాజిక వ్యవస్థలో నివసిస్తున్నాము కాబట్టి. మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం ఎంత అవసరమో, ఇతరుల గురించి శ్రద్ధ చూపించడం కూడా అంతే ముఖ్యం. ఇత రులూ మనమూ ఒకటే అనుకున్నప్పుడు. మనమందరం, కుటుంబ వ్యవస్థ నుంచి తయారయిన మనుషులం. మీ సహోద్యోగు లలో కుటుంబ సమస్యల వల్ల ఆఫీసులో డిప్రెష న్‌కి లోను అవుతున్నారేమో – కనుక్కోండి. మీకు క్లోజ్‌ గా ఉన్న కొలీగ్స్‌తో. వారి ఇంట్లో వద్ధులైన తల్లిదరండ్రులు ఉన్నారా ? వారిని ఇంట్లో వదిలి పనికి రావాల్సి వస్తోందా ? మీకు తెలిసిన ‘ డే కేర్‌’ ఇచ్చే వారు ఉంటే, మగ నర్సులు, డే కేర్‌ సెంటర్‌లు, మీకు తెలిస్తే, సూచించండి. వారి పిల్లలు చదువులో ఎక్కి రావటం లేదని వర్రీ అవుతున్నారా? మీకు తెలిసిన మంచి ట్యూటర్‌ ఉంటే, వారికి తెలియ జేయండి. మీ సహోద్యోగి పని వత్తిడిని సరిగా హ్యాండిల్‌ చెయ్య లేక మీ బాస్‌చేత బాగా తిట్లు తింటున్నారా ? మీరు కాస్త ట్రెయినింగ్‌/ కోచింగ్‌ ఇచ్చి వారి నైపుణ్యం మెరుగు పరచ గలరేమో ఆలొచించండి . పని నేర్పిన వారి పట్ల చాలా మంది జీవితాంతం క్రుతగ్నులుగా ఉంటారు . మీకు ఏయే సబ్జక్ట్‌ల పట్ల మంచి పరిజ్ఞానం ఉంది? మీ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి రెండు క్లాసులు చెప్ప గలరేమొ చూడండి! మీ ఆఫీసుకి బయట , ఏవైనా సామాజిక సేవా కార్య క్రమాలలో ‘ వాలంటీర్‌ / స్వచ్చంద సేవకులుగా చేరండి. దీర్ఘ కాలం వ్యాధితో బాధ పడుతూ మంచం పట్టిన చుట్టాలు ఎవరైనా ఉంటే, వారిని, తీరిక చేసు కుని అప్పుడప్పుడూ సందర్శించండి . ఇంటర్‌ / డిగ్రీ చదివిన విద్యార్ధినీ విద్యా ర్ధులకి పోటీ పరీక్షలలో ‘ ఫ్రీ కోచింగ్‌ ‘ ఇవ్వండి. ఒకటి రెండు క్లాసులు. మీకు బాగా కమాండ్‌ ఉన్న సబ్జెక్టులలో. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉం డండి. డాక్టర్‌ లకీ జబ్బులు వస్తాయి. మానసిక వ్యాధి నిపుణులు కూడా డిప్రెషన్‌కి లోను అవు తారు. క్రీడాకారులకి కూడా గాయాలు అవుతాయి. ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే క్రమంలో, వారి సమస్యలను మీరు ఎక్కువ సీరియస్‌ గా తీసుకుని, మీరు మానసిక వత్తిడికి గురి కావద్దు. మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్‌ : : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.

Featured ఆంధ్రప్రదేశ్

విద్యాలయాలు

విద్యాలయాలు విద్యావేత్తలను, వైద్యులను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, న్యాయ వాదులను, న్యాయమూర్తులను, దేశరక్షకులను, నాయకులను అందించి సకల మానవాళిని వున్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే కర్మాగారాల వంటి స్థలాలే విద్యాలయాలు. తొలి విద్యాలయాలు వి.ఆర్‌. కళాశాల విద్యారంగంలో జిల్లా ముందడుగులో వుంది. ప్రధమంగా నెల్లూరులో సి.ఏ.యం. హైస్కూలు, వెంకటగిరి రాజా హైస్కూలు, వేద సంస్కృత పాఠశాల ప్రారంభించబడినవి. వీటిని ఈ ప్రాంతపు మొదటి విద్యాలయాలుగా పేర్కొనాలి. 1875లో సుంకు నారాయణస్వామి శెట్టి అద్దె ఇంటిలో ప్రారంభించిన హిందూ వర్నాకులర్‌ స్కూలు క్రమంగా హిందూ హైస్కూలుగా పిలువబడేది. 1979లో మహమ్మదు రహంతుల్లా సాహెబ్‌ (వెంకటగిరి రాజాగారి మాజీ దివాను) భవన స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు విరాళమిచ్చారు. వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర దాతృత్వంతో అభివృద్ధి పరచడంవల్ల 1895లో హిందూ హైస్కూలు పేరు వెంకటగిరి రాజా హైస్కూలుగా మార్చారు. పాఠశాల నిరంతరాయంగా కొనసాగడానికి అవసరమైన భవనాలు నిర్మించారు. 50 వేల రూపాయలు శాశ్వతనిధి సమకూర్చారు. ఆనాడు వి.ఆర్‌. హైస్కూలుగా మొదలై 1920లో వి.ఆర్‌ కళాశాల, క్రమంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌, లా కాలేజి, చిల్డ్రన్స్‌ అకాడమీ, ఈవినింగ్‌ కాలేజి, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌తో నేడు విరాజిల్లుతోంది. కళాశాల సర్వతోముఖాభివృద్ధికి ఆనం కుటుంబీకులు, మేనకూరు ఆదిశేషారెడ్డి, మాడభూషి నరసింహాచారి, వవ్వేటి విశ్వనాథరావు, తూములూరు శివరామయ్య విశేష కృషి చేశారు. ఈ ప్రాంతపు మేధావులు, ప్రముఖులలో ఎక్కువమంది ఇందులో చదివినవారు కావడం విశేషం. వి.ఆర్‌. కళాశాల మొదటి ప్రిన్సి పాల్‌గా రాయసం వెంకట శివుడు పనిచేశారు. సిఎఎం హైస్కూల్‌ : మిషనరీస్‌ ఆధ్వర్యంలో 1837 ప్రాంతాలలో ఏర్ప డిన సి.ఏ.యం. హైస్కూలు విద్యావ్యాప్తికి బాగా తోడ్ప డింది. ఇది నెల్లూరులో స్థాపితమైన మొదటి హైస్కూలు. ప్రప్రథమంగా ఆంగ్లవిద్యను ప్రవేశ పెట్టింది. విశాలమైన ప్రాంగణంలో మంచి భవనాలు నిర్మించారు. ఆటస్థలం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా వుండేది. దీటైన ఉపాధ్యాయులు ఇందులో పనిచేశారు. అంతటి వున్నత స్థితిలో వుండిన పాఠశాల 175 ఏళ్ళ తర్వాత మూతపడింది. ఆస్తులు పరాధీనమవుతున్నాయి. వేదసంస్కృత పాఠశాల స్థానికంగా వున్న భాషాభిమానుల ప్రోత్సాహంతో 1882లో స్థాపించబడింది. పిల్లలకు సంస్కృతంపై పరిజ్ఞానం, పట్టు, వేద విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన వుద్దేశం. వేదాలను, మన సంస్కృతిని మరిచిపోతున్న ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా విద్యాలయం సాగుతుంది. చిన్న పాఠశాలగా మొదలై కళాశాలగా రూపుదిద్దుకొంది. వేదం, సంస్కృతం, ఇతిహాసాలు, కావ్యాలు ఇక్కడ విద్యార్థులకు బోధిస్తారు. ఇక్కడ చదివినవారు విద్వాన్‌, శిరోమణి వంటి విద్యార్హతలు పొందగలిగారు. తెలుగు, సంస్కృత పండితులుగా గౌరవప్రదమైన ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. పురాతన గ్రంథాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు కలిగిన పెద్ద గ్రంథాలయం వుంది. 1900-1915 మధ్య కాలంలో వెంకటగిరిలో ఆర్‌.వి.యం. హైస్కూలు, నెల్లూరులో ఎబియం గరల్స్‌ హైస్కూలు, కావలిలో బోర్డు హైస్కూలు ప్రారంభమయ్యాయి. కావలిలో విశ్వోదయ విద్యాసంస్థలు జవహరు భారతి : ఈ విద్యాలయ సంస్థలకు శ్రీకారం చుట్టిన మహ నీయుడు ‘డి.ఆర్‌.’గా పిలువ బడే దొడ్ల రామచంద్రారెడ్డి. కావలిలో సంపన్నమైన సంస్కా రవంతమైన కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే ఎం.ఎ డిగ్రీ పొందిన తర్వాత ఆయనకు కళాశాల స్థాపన ఆలోచన కలి గింది. 1951లో విశ్వోదయ విద్యా సంస్థను స్థాపించారు. కొంతకాలం తర్వాత జవహర్‌ భారతి కాలేజీగా నామకరణం చేశారు. 1953లో డిగ్రీ కళశాల, 1972లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌, 1978లో ఇంజనీరింగ్‌ కాలేజి స్థాపించారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటిని పారద్రోలి వెలుగులోకి రావడం, అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి రావడం అనే భావనతో ప్రారంభమైంది. విద్యారంగంలో వెనుకబడిన కావలి ప్రాంతానికి, ప్రకాశంజిల్లా మెట్ట ప్రాంతాలవారికి విద్యా సముపార్జనకు అవకాశాలు కలుగజేశారు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. విశ్వోదయ సంస్థ పేరుకు తగ్గట్టే ఆశయాలు, వాటికి తగ్గట్టే సంస్థ ఎంబ్లమ్‌ రూపొందించారు. దొడ్ల రామచంద్రారెడ్డికి వెన్నుదన్నుగా ఛీఫ్‌ జస్టిస్‌ రాజమన్నార్‌, తిక్కవరపు రామిరెడ్డి, రామానుజ రావు నాయుడు, బెజవాడ రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మల్లికార్జునం, భుజంగ రాయ శర్మ వంటి మేధావులున్నారు. ఈ విద్యా సంస్థలో ఎందరో ప్రముఖులు విద్య నభ్యసిం చారు. సి.పి.యం. కార్యదర్శి రాఘవులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంకట్రామి రెడ్డి, దివంగత ఐ.ఏ.యస్‌. అధికారి సుబ్రహ్మణ్యం, జూపూడి ప్రభాకరరావు, ఆదాల ప్రభాకరరెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, కంభం విజయరామిరెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడ చదువుకున్న వారే. విద్యా సంస్థలకు డి.ఆర్‌.గారు రెక్టారుగా వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, కామరాజ నాడార్‌, దేశ్‌ముఖ్‌ దంపతులు, జాకీర్‌ హుసేన్‌ వంటి మహామహులు ఈ విద్యా సంస్థలను సందర్శించారు. విద్యా సంస్థలు 60 సం|| పూర్తి చేసుకొన్న సందర్భంలో 2012లో వజ్రోత్సవం జరుపుకొంది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యాసంస్థలు : స్వాతంత్య్రం రాకపూర్వమే విద్యాలయాలను, హాస్టళ్ళను ప్రారం భించి పాతికేళ్లపాటు అవిరళ కృషిచేసిన మహోన్నతుడు. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థ లకు కోట, వాకాడు మండ లాలు ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఈ రెండు మండ లాలు కోట సమితిగా వుండేది. విద్యాదాతగా పేరుపొందిన బాలకృష్ణారెడ్డి గారి కృషివల్ల విద్యాసంస్థలు వెలిశాయి. వీరు నేదురు మల్లి జనార్ధనరెడ్డికి పినతండ్రి గారు. 1965లో కళాశాల స్థాపించారు. క్రమంగా వాటితో ఈ మండలాలకు విద్వత్‌ వెలుగులు వచ్చాయి. వీటి అభివృద్ధికి నేదురుమల్లి, నల్లపరెడ్లు సయోధ్యగా కృషి చేశారు. వాకాడు మండలం విడిపోయిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు చేతులమీదుగా కోటలో జూనియర్‌ మహిళా కళాశాలను స్థాపించారు. బాలకృష్ణారెడ్డి మరణించిన తర్వాత జనార్దన రెడ్డి, పద్మనాభరెడ్డి సోదరులు బాధ్యత వహించి విద్యాలయాలను అభివృద్ధి చేశారు. వాకాడు విద్యానగర్‌గా మారిపోయింది. బాలకృష్ణారెడ్డి హరిజన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారి అభివృద్ధికి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలను ఇందిరాగాంధీ ఒకసారి దర్శించారు. విద్యానగర్‌లో బాలురకు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్ళు నిర్మించారు. ఇక్కడ చదువుకొన్న విద్యార్థులు గొప్ప పదవులలో వున్నారు. ఈ విద్యా సంస్థలు చదువులోనే కాకుండా క్రమశిక్షణకు పేరుపడ్డాయి. వీటికి ఆద్యుడు, స్థాపకుడు, మూలపురుషుడు అనతగిన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి చిరస్మరణీయుడు. వీరి సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘దీన బంధు’ బిరుదుతో, కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించాయి. ఆ మహనీయుడు 1978లో కన్నుమూసినా వారు వెలిగించిన విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూనే వుంది. శ్రీ సర్వోదయ కళాశాల : 1972లో నెల్లూరులోని వైశ్య ప్రముఖులు కళాశాలను ప్రారంభించారు. వాకాటి సంజీవిశెట్టి ముఖ్యదాతగా సి.సి. సుబ్బరాయుడు తదితరులతో కలిసి ప్రారంభించారు. యడ్లపల్లి గోవిందుశెట్టి, వొమ్మిన సుబ్రహ్మణ్యం సెక్రటరీలుగా పనిచేశారు. ఆర్‌.టి.సి. బస్టాండు ప్రాంతంలో ఏడెకరాల స్థలంలో కాలేజి నిర్మితమైంది. ఇక్కడ ఇంటర్మీడియట్‌, బి.ఏ., బి.యస్‌సి., ఎం.ఏ., ఎం.కామ్‌., తదితర చదువులున్నాయి. డా|| వి. మాధవరావు, డా|| కాళిదాసు పురుషోత్తం వంటి మేధావులు ఇక్కడ ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. నిపుణులైన అధ్యాపకులు ఆయాశాఖలలో పనిచేస్తున్నారు. కాలేజి 1996లో ఎండోమెంట్స్‌ శాఖ పరిధిలోకి వెళ్లింది. కోరా విద్యా సంస్థలు : నెల్లూరుకు చెందిన విద్యావేత్త కోదండ రామయ్య ఆధ్వర్యంలో 1986లో విద్యాలయాలు స్థాపించబడినవి. ఎంసెట్‌ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థగా ప్రారంభమై 1995లో జూనియర్‌ కాలేజిగా రూపుదిద్దుకొంది. ఇటీవల స్వర్గస్తులైన డాక్టరు ఎస్‌.వి.నరసింహులు (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డి.కె.డబ్ల్యూ. కాలేజి) వంటి ప్రముఖ విద్యావేత్తలు సంస్థకు మూలస్థంబాలలో ఒకరుగా వుండేవారు. 2000 మార్చిలో ఈ సంస్థ రత్నం విద్యాసంస్థలలో విలీనమయింది. నారాయణ విద్యా సంస్థలు : ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనలో నారాయణ పేరు, నారాయణ విద్యా సంస్థల పేర్లు విననివారు రాష్ట్రంలో వుండరు. 1977లో పి. నారాయణ ఒక కాలేజీలో స్టాటిస్టిక్స్‌ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఎందు కనో ఆయన అందులో కొనసాగ లేదు. కొనసాగి వుంటే ఆయనలోని ప్రజ్ఞ, ప్రతిభా పాటవాలు బయల్పడేవి కావు. 1983 నుండి విద్యాసంస్థలను ఒకటొకటిగా ప్రారంభించడం మొదలు పెట్టారు. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాళెం విద్యలకు కేంద్ర బిందువయింది. అక్కడనుండి విద్యాలయాలు విస్తరించాయి. క్రమంగా జిల్లా, రాష్ట్ర పరిధులు దాటింది. నేడు దేశంలో పలుచోట్ల నారాయణ విద్యాసంస్థలు (దాదాపు 300) నెలకొని వున్నాయి. ఇందులో ఐదారువేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఆయన స్వతంత్రంగా, స్వయంకృషితో ఎదిగారు. పట్టుదల, కార్యదీక్ష, మృదుస్వభావం ఆయన సహజ లక్షణాలు. ప్రస్తుతం నారాయణ సంస్థలలో ప్రీప్రైమరీ స్కూలునుండి పోస్టు గ్రాడ్యుయేట్‌ వరకు విద్యాలయాలున్నాయి. ఒలింపియాడ్‌ స్కూల్స్‌, కాన్సెప్ట్‌ స్కూల్స్‌, టెక్నో స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీ, డెంటల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజి, బి.ఫార్మసి, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు, యోగ & నేచురోపతి కాలేజి, బి.ఇడి. కాలేజి వున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల ఐ.ఎ.ఎస్‌. అకాడమి ప్రారంభించారు. 30 సం||ల కాలంలో (1983-2012) నారాయణ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయి. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా వున్న నారాయణ 2014 జూన్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రత్నం విద్యా సంస్థలు : నెల్లూరు జిల్లాలో 1984లో ప్రారంభమైన రత్నం సంస్థలకు ప్రత్యేక స్థానం వుంది. కె.వి. రత్నం, వారి శ్రీమతి పద్మావతి రత్నం సంస్థ వ్యవస్థాపకులుగా వున్నారు. ప్రస్తుతం కె. వేణుగోపాల్‌ , డా|| కె. కృష్ణకిషోర్‌ సారధ్యంలో నడుస్తున్నాయి. రత్నం రెసిడెన్షియల్‌ స్కూలు, ఫార్మసి ఇన్‌స్టిట్యూట్‌, కంప్యూ టర్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్లు నెల్లూరు సమీపంలోని పిడతా పోలూరులో, రత్నం పబ్లిక్‌ స్కూలు ధనలక్ష్మీపురంలో నిర్మించారు. రత్నం డిగ్రీ కళాశాలను హరనాథ పురంలో స్థాపించారు. నెల్లూరు నగర పరిధిలో రత్నం ఒలింపియాడ్‌ అకాడమి క్యాంపస్‌ స్కూలు దర్గామిట్టలో, గ్లోబల్‌ స్కూలు మాగుంట లే అవుట్‌లో స్థాపించారు. వ్యాపార దృష్టితో కాకుండా విద్యాసంస్థలను ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రియదర్శిని విద్యాసంస్థలు : నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేటలో 2001-02 సం||లో ఇంజనీరింగ్‌ కాలేజి ప్రారంభించారు. 2005-06లో నెల్లూరు పట్టణ పరిధిలో మరొక ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించారు. ఇక్కడ యం.సి.ఏ., యం.బి.ఏ. కోర్సులు కూడ వున్నాయి. సూళ్ళూరుపేటలో ఇంజ నీరింగ్‌ కోర్సులోని పలు బ్రాంచీలను ఏర్పాటు చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు అధికార పార్టీలో రాజకీయ పోరు

నెల్లూరు అధికార పార్టీలో రాజకీయ పోరు ఆనం – మంత్రి అనిల్‌ మధ్య ఆధిపత్యపోరు వి.ఆర్‌.విద్యాసంస్థలే వేదిక రాజకీయాలకు రాజధాని నెల్లూరులో ఇప్పుడు సరికొత్త రాజకీయ అంతర్యుద్ధం మొదలైంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు మరో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య తాజా వార్‌ మొదలైంది.ఇందుకు వి.ఆర్‌.విద్యా సంస్థలు వేదికయ్యాయి. గత రెండేళ్లుగా వి.ఆర్‌.విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ఆనం పెత్తనం పై అత్యున్నత ధర్మాసనం వరకు వెళ్ళి విజయం సాధించారు. వి.ఆర్‌.విద్యాసంస్థలకు పాత పాలక వర్గాన్ని రద్దు చేసింది కోర్టు. జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. వి.ఆర్‌. విద్యా సంస్థల నూతన యాజమాన్యం కోసం ఎన్నికలు జరపాలని గత ఏడాది క్రితం సుప్రీం కోర్ట ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కసరత్తు మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వి.ఆర్‌.కళాశాల నూతన పాలక వర్గం కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు ఓటర్లుగా సభ్యత్వాలకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే సమయంలో జిల్లా అధికారులు పదే పదే మారడం, ఎన్నికల క్రతువు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వి.ఆర్‌. విద్యాసంస్థల ఆర్థిక వ్యవహారాలు, కళాశాల పురోభివృద్ధికి అవాంతరాలు మొదలయ్యాయి. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆనం కుటుంబం వి.ఆర్‌.విద్యాసంస్థల పై పెత్తనం చేస్తోంది. సుదీర్ఘ 144 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. ఒకప్పటి ఆనం భక్తవత్సల రెడ్డి నుంచి ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కళాశాల కార్యనిర్వాహకులుగా కొనసాగుతూ వున్నారు. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్న రామనారాయణరెడ్డి, అంతకుముందున్న ఆనం కుటుంబీకుల మొత్తం పెత్తనం ఆపివేయాలంటూ ఆనం వ్యతిరేక వర్గం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. తాజాగా వి.ఆర్‌.విద్యాసంస్థల నిర్వహణ పై రూరల్‌ ఎమ్మెల్యేతో పాటు మంత్రి అనిల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, ప్రత్యేక అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి కళాశాలను పరిశీలించారు. పాలనా తీరును అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వి.ఆర్‌. విద్యాసంస్థలకు పూర్వవైభవం తెస్తాం. ఇందులో ఎవరి ప్రమేయాలు ఉండబోవు. ఎవరికి భయపడాల్సిన పనిలేదు అంటూ పరోక్షంగా మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానాలను చేశారు. మరోవైపు వి.ఆర్‌.విద్యాసంస్థల పై ఇప్పటి వరకు ఉన్న పెత్తనాలను సహించం. కొత్త యాజమాన్యంతో కళాశాలను అభివృద్ధి చేస్తాం.. ఇప్పుడివి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వి.ఆర్‌.విద్యాసంస్థలు వేదికగా ఆనం వర్సెస్‌ మంత్రి అనిల్‌ అన్నట్లుగా ఉన్నాయి తాజా పరిణామాలు. వి.ఆర్‌.కళాశాల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి అనిల్‌ తనదైన స్టైల్‌లో పరోక్షంగా ఆనంకు వ్యతిరేకంగా మాట్లాడారు. పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వి.ఆర్‌.కళాశాల మైదానాన్ని ఇకపై రాజకీయ పార్టీలకు వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కళాశాల నిర్వాహకులకు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చారు. ఎవరి పెత్తనాన్ని సహించం. విద్యాశాఖ మంత్రి ద్వారా సంస్కరణలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఆనంకు వ్యతిరేక ధోరణిలోనే సాగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి నెల్లూరు వి.ఆర్‌.విద్యాసంస్థలు మరోసారి అధికార వైసీపీలో ఆధిపత్య రాజకీయాలకు తెరలేపాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.