వార్త ముఖ్యాంశాలు
- మన ఒంటి మీద పుట్టుమచ్చలు ఉంటే పెద్దవాళ్లు వాటిని అదృష్టానికి చిహ్నాలంటారు.
- కొందరైతే పుట్టుమచ్చ ఉన్నచోట అదృష్టం కలిసివస్తుందని జోస్యం చెబుతుంటారు!
- కానీ వైద్యశాస్త్రం మాత్రం వాటిని చూసి అదృష్టం చెప్పదు...
మన ఒంటి మీద పుట్టుమచ్చలు ఉంటే పెద్దవాళ్లు వాటిని అదృష్టానికి చిహ్నాలంటారు. కొందరైతే పుట్టుమచ్చ ఉన్నచోట అదృష్టం కలిసివస్తుందని జోస్యం చెబుతుంటారు! కానీ వైద్యశాస్త్రం మాత్రం వాటిని చూసి అదృష్టం చెప్పదు… ఆరోగ్యాన్ని పరిశీలించమంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పుట్టుమచ్చల్లో వచ్చే మార్పులు చర్మ క్యాన్సర్‌కు, ముఖ్యంగా ‘మెలనోమా’కు సంకేతాలు కావచ్చు.
అయితే ఒంటి మీద పుట్టుమచ్చ ఉందని భయపడాల్సిన పనిలేదు. చాలా పుట్టుమచ్చలు ప్రమాదకరం కావు; అరుదుగా మాత్రమే కొన్ని మెలనోమాగా మారతాయి. అంతేకాదు, మెలనోమాల్లో అత్యధిక శాతం పాత పుట్టుమచ్చల నుంచి కాకుండా, చర్మంపై కొత్తగా ఏర్పడతాయి.
పుట్టుమచ్చలకు క్యాన్సర్ ముప్పు ఎందుకు?
చర్మానికి రంగునిచ్చే ‘మెలనిన్’ అనే పదార్థాన్ని తయారుచేసే ‘మెలనోసైట్’ కణాలు ఒకచోట గుంపుగా చేరితే పుట్టుమచ్చ ఏర్పడుతుంది. ఈ కణాల్లోని డీఎన్ఏ (DNA) దెబ్బతిని అసాధారణ మార్పులు జరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
దీనికి ప్రధాన కారణాలు:
మండే ఎండలు: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల కణాల డీఎన్ఏ దెబ్బతింటుంది.
కుటుంబ చరిత్ర: కుటుంబంలో ఎవరికైనా మెలనోమా చరిత్ర ఉంటే ఇతరులకు వచ్చే ప్రమాదం ఎక్కువ.
చర్మతత్వం: తెల్లటి చర్మం ఉండి, మెలనిన్ తక్కువగా ఉండేవారికి UV కిరణాల ప్రభావం ఎక్కువ. అయితే ముదురు చర్మం ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
మీ పుట్టుమచ్చకు ‘ABCDE’ పరీక్ష పెట్టండి!
పుట్టుమచ్చ సాధారణమైనదా? ప్రమాదకరమైనదా? అని గుర్తించడానికి వైద్యులు సూచించే ABCDE సూత్రాన్ని గమనించండి:
A – Asymmetry (అసమాన ఆకారం): మచ్చను మధ్యకు విభజిస్తే రెండు భాగాలు ఒకేలా ఉండకపోవడం.
B – Border (అస్పష్టమైన అంచులు): అంచులు గుండ్రంగా ఉండకుండా గరుకుగా, వంకరటింకరగా కనిపించడం.
C – Color (రంగుల్లో తేడా): ఒకే మచ్చలో నలుపు, గోధుమ, ఎరుపు, తెలుపు, నీలం వంటి భిన్న రంగులు కలగలిసి ఉండటం.
D – Diameter (పరిమాణం): మచ్చ పరిమాణం 6 మిల్లీమీటర్ల (పెన్సిల్ వెనుక ఉండే రబ్బరు సైజు) కంటే పెద్దగా ఉండటం. (కొన్నిసార్లు అంతకంటే చిన్న మచ్చల్లోనూ మెలనోమా ఉండవచ్చు).
E – Evolving (మార్పులు): మచ్చ పరిమాణం, ఆకారం, రంగు వేగంగా మారడం; లేదా దానిపై దురద, రక్తం కారడం, పొలుసులు రావడం.
’అగ్లీ డక్లింగ్ సైన్’ (Ugly Duckling Sign):
ఒంటి మీద ఉన్న మచ్చలన్నీ ఒకేలా ఉండి, ఒక్క మచ్చ మాత్రం మిగతా వాటన్నింటికంటే పూర్తి భిన్నంగా కనిపిస్తుంటే దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
నెలకు ఒకసారి తల నుంచి పాదాల వరకు చర్మాన్ని పరిశీలించుకోండి. ముఖ్యంగా వీపు, అరచేతులు, అరికాళ్లు, గోళ్ల కింద కూడా గమనించాలి.
తీవ్రమైన ఎండలో అనవసరంగా తిరగకండి. గొడుగు, టోపీ, శరీరాన్ని పూర్తిగా కప్పే కాటన్ దుస్తులు ఉపయోగించండి.
బయటకు వెళ్లేటప్పుడు ఎండ తీవ్రతను బట్టి SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడండి.
పుట్టుమచ్చలో కొత్త మార్పులు కనిపిస్తే సొంత వైద్యం, నాటు మందుల జోలికి వెళ్లకుండా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించండి.
పుట్టుమచ్చ అదృష్టాన్ని తెస్తుందో లేదో తెలియదు కానీ, దానిలో వచ్చే మార్పును qప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అందుకే పుట్టుమచ్చల పట్ల భయం వద్దు… అలాగని నిర్లక్ష్యం అసలే వద్దు!
డాక్టర్ ఎం.వి రమణయ్య
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్