ఆత్మకూరు సెప్టెంబర్ 29 పున్నమి ప్రతినిధి
ఆత్మకూరు: ముఖ్యమంత్రి సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తరలించడంతో ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం పట్టణానికి ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు సాయంత్రం స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు బస్సులు లేక బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సాధారణంగానే ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో బస్సుల కొరత ఉండగా, సభ కోసం సుమారు 80 శాతం బస్సులను తరలించడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. అత్యవసర ప్రయాణాలు ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయాలనీ ప్రయాణికుల కోరుతున్నారు.


